- దండకారణ్యంలో ఉన్నారా? లేక పోలీసుల అదుపులోనా?
- వీళ్లందరూ తెలంగాణకు చెందిన అగ్ర నేతలే..
- మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరడంతో కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన
- ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా రాష్ట్రంలో అలజడి
హైదరాబాద్, వెలుగు: మావోయిస్ట్ పార్టీ కీలక నాయకుల ఆచూకీ దొరకట్లేదు. దండకారణ్యంలో ఉంటూ మూడు దశాబ్దాలకు పైగా అలుపెరగని పోరాటం చేసిన లీడర్లంతా ఎక్కడున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆపరేషన్కగార్ పేరుతో కేంద్ర బలగాలు మావోయిస్టులపై ప్రత్యక్ష యుద్ధానికి దిగడంతో ఆ పార్టీ కకావికలమైంది.
పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు, హిడ్మా సహా పలువురు అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో చనిపోగా.. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న లాంటి కీలక నేతలు లొంగిపోయారు. మిగిలిన వాళ్లలో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, సెంట్రల్ కమిటీ మెంబర్ కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ జాడ తెలియడం లేదు. వీళ్లు నలుగురు పోలీసులు అదుపులో ఉన్నారని కొందరు, దండకారణ్యంలోనే షెల్టర్జోన్లో ఉన్నారని ఇంకొందరు భావిస్తున్నారు.
దండకారణ్యం మొత్తం కేంద్ర బలగాల గుప్పిట్లోకి చేరడంతో వాళ్లు మైదానాల బాట పట్టారని, ఈ క్రమంలోనే పోలీసులకు దొరికిపోయి ఉంటారని పౌర హక్కుల సంఘాల నేతలు చెప్తున్నారు. వాళ్లకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమం చివరి దశకు చేరుకోవడంతో మావోయిస్టు నేతల కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన నెలకొంది. వాళ్లంతా ఎక్కడున్నారో స్పష్టం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు.
దశాబ్దాలుగా పోరుబాట..
మావోయిస్టు ఉద్యమంలో తెలంగాణకు చెందిన నేతలే ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి 2018 వరకు ఉమ్మడి కరీంనగర్‌జిల్లాకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పార్టీ జనరల్ సెక్రటరీగా పని చేశారు. ఇప్పుడదే జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పని చేస్తున్నారు. మధ్యలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఏడేండ్ల పాటు జనరల్ సెక్రటరీగా పని చేశారు.
ఈయన వరంగల్నిట్లో ఇంజనీరింగ్చేసి, ఇక్కడి మూలాలతోనే మావోయిస్ట్ఉద్యమంలోకి వెళ్లి క్రీయాశీలక పాత్ర పోషించారు. మొన్నటి దాకా మావోయిస్ట్పార్టీ సెంట్రల్‌కమిటీ మెంబర్లు 13 మంది ఉంటే, వారిలో 8 మంది తెలంగాణ వాళ్లే. వీరిలో గతంలో ఇద్దరు లొంగిపోగా, ఇటీవల జరిగిన పరిణామాలతో మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న వంటి లీడర్లు ఆయుధాలతో సహా పోలీసులకు సరెండర్అయ్యారు. ఇక మిగిలిన నలుగురు ఇంకా మావోయిస్ట్ఉద్యమంలోనే కొనసాగుతున్నారు. వాళ్లంతా కూడా మూడు దశాబ్దాలుగా పోరుబాటలోనే ఉన్నారు.
ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా రాష్ట్రంలో అలజడి..
దేశంలో ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా రాష్ట్రంలో అలజడి రేగుతున్నది. ఫలానా మావోయిస్ట్లీడర్చనిపోయినట్టుగా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది. దీంతో వాళ్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతూ పోలీసుల దగ్గరికి వెళుతున్నారు. లోకల్ పోలీసులు సమాచారం సేకరించి వాళ్లకు అధికారికంగా తెలియజేయడానికి చాలా సమయం పడుతున్నది. తాజాగా ఏపీలో బుధవారం మరో ఎన్‌కౌంటర్ జరిగింది. అందులో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.
వారిలో తెలంగాణకు చెందిన నేతలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఎన్‌కౌంటర్‌లో తిప్పిరి తిరుపతి, బడే చొక్కారావు, ఆజాద్చనిపోయినట్టు ప్రచారం జరిగింది. కానీ చనిపోయినోళ్లలో అగ్రనేతలు లేరని ఆంధ్రా పోలీసులు అధికారికంగా ప్రకటించడంతో వాళ్ల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ముప్పాళ్ల లక్ష్మణరావు @ గణపతి
ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్లి 50 ఏండ్లు దాటిపోయింది. ఎన్ఐఏ హిట్‌లిస్టులో ఈయన పేరుంది. జగిత్యాల జిల్లా బీర్పూర్మండల కేంద్రానికి చెందిన గణపతి.. బీఎస్సీ, బీఈడీ పూర్తి 1971-–74 మధ్య జిల్లా పరిషత్ హైస్కూల్‌లో టీచర్‌గా పని చేశారు. వరంగల్‌లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి 1975లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో చేరి.. ఆ తర్వాత పీపుల్స్‌వార్ గ్రూప్వ్యవస్థాపకులు కొండపల్లి సీతారామయ్యతో సంప్రదింపులు జరిపి నక్సలైట్‌గా మారారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయి, 13 నెలల పాటు జైలు జీవితం గడిపారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత దండకారణ్యంలోకి వెళ్లిపోయారు.
2004లో సీపీఐ ఎంఎల్, పీపుల్స్ వార్, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనం ద్వారా సీపీఐ మావోయిస్ట్పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. మావోయిస్ట్పార్టీ ఆవిర్భావం నుంచి 2018 వరకు జనరల్ సెక్రటరీగా పని చేశారు. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించారు. ఎన్నో దాడుల్లో కీలక పాత్ర పోషించారు. అనారోగ్య కారణాలతో పార్టీ చీఫ్బాధ్యతల నుంచి గణపతినే స్వయంగా వైదొలిగి నంబాల కేశవరావును జనరల్ సెక్రటరీ చేశారు. ఆ తర్వాత ఆయన విదేశాలకు వెళ్లినట్టు ప్రచారం జరిగింది. కానీ గణపతి ఎక్కడున్నాడు? అనేది కేంద్ర భద్రతా బలగాలు కూడా ఇప్పటివరకు ధ్రువీకరించలేదు.
బడే చొక్కారావు @ దామోదర్
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మావోయిస్ట్ఉద్యమంలోకి వెళ్లి 30 ఏండ్లు దాటింది. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఎన్ఐఏ హిట్‌లిస్టులో ఈయన పేరుంది. అన్ని రాష్ట్రాల్లో కలిపి రూ.2 కోట్ల రివార్డ్ఉంది. తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మిలిటరీ వ్యూహాలు పన్ని దాడులు నిర్వహించడంలో సిద్ధహస్తుడు. ములుగు జిల్లాలో గిరిజన కుటుంబంలో పుట్టి పెరిగారు. ఈయన కుటుంబానికి మావోయిస్టు బ్యాక్ గ్రౌండ్ ఉంది. 20 ఏండ్ల కింద పోలీస్ఎన్కౌంటర్లో మరణించిన సెంట్రల్ కమిటీ మెంబర్బడే నాగేశ్వర్ రావుకి తమ్ముడు. ములుగు జిల్లా మాజీ జడ్పీ చైర్‌పర్సన్, బీఆర్ఎస్లీడర్బడే నాగజ్యోతికి స్వయాన చిన్నాన్న అవుతారు.
20 ఏండ్ల వయసులో ఆర్‌ఎస్‌యూలో చేరి, ఆ తర్వాత 1990లో పీపుల్స్‌వార్ గ్రూపులో జాయిన్ అయ్యారు. మావోయిస్ట్పార్టీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్(కేకేడబ్ల్యూ) జిల్లాల కమిటీ కార్యదర్శిగా పని చేశారు. మిలిటరీ వ్యూహాలు పన్నడంలో, దాడులు నిర్వహించడంలో, కొత్త సభ్యుల రిక్రూట్‌మెంట్‌లో నైపుణ్యం సాధించి రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర కమిటీలో మావోయిస్ట్ యాక్షన్ టీమ్‌లు, అటాక్ గ్రూపులకు ఇన్‌చార్జ్‌గా పని చేశారు.
రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతిసారీ దామోదర్చనిపోయినట్టుగా వార్తలు వస్తుంటాయి. ఆ తర్వాత ఆయన తప్పించుకున్నారని ప్రకటనలు వెలువడుతాయి. ఇలా పది, పదిహేను సార్లు జరిగినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఈయన జాడ తెల్వట్లేదు. పోలీసులు కూడా పూర్తి సమాచారం ఇవ్వట్లేదు.
తిప్పిరి తిరుపతి @ దేవ్ జీ
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మావోయిస్ట్ పార్టీలో చేరి 40 ఏండ్లు దాటింది. ఈయన పేరు కూడా ఎన్ఐఏ హిట్‌లిస్టులో ఉంది. దేశంలోనే రూ.3.6 కోట్ల అత్యధిక రివార్డ్ కలిగిన మావోయిస్ట్ లీడర్. ప్రస్తుతం పార్టీ జనరల్ సెక్రటరీగా పని చేస్తున్నారు. మిలిటరీ వ్యూహాలు పన్ని దాడులు జరపడంలో దిట్ట. మిలిటరీ స్ట్రాటజిస్ట్, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) సృష్టికర్త. ఆర్ఎస్‌యూ ద్వారా ఉద్యమానికి ప్రభావితుడై 1982లో సుమారు 19 ఏండ్ల వయసులోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. పార్టీ పత్రిక ‘అవామీ జంగ్’లో ఆర్టికల్స్ రాసి మావోయిస్టుల విజయాలను ప్రచారం చేశారు.
మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు రిక్రూట్‌మెంట్, మిలిటరీ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. 2010 ఏప్రిల్‌లో చత్తీస్‌గఢ్ దంతెవాడలో జరిగిన దాడికి సూత్రధారి ఈయనే. ఈ దాడిలో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే 21న నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ మరణం తర్వాత సెప్టెంబర్‌లో బస్తర్‌లో జరిగిన మీటింగ్‌లో పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. మావోయిస్ట్ పార్టీ చరిత్రలో ఈ పదవి చేపట్టిన మొదటి దళిత నాయకుడు ఈయనే.
ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఇటీవల జరిగిన పరిణామాలతో దేవ్ జీ దండకారణ్యం వదిలి మైదాన ప్రాంతానికి వచ్చి పోలీసుల చేతికి చిక్కినట్టుగా ప్రచారం జరుగుతున్నది. కానీ ఈ విషయంలో పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
కొయ్యడ సాంబయ్య @ ఆజాద్
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ ప్రస్తుతం మావోయిస్ట్పార్టీ సెంట్రల్‌కమిటీ మెంబర్‌గా పని చేస్తున్నారు. 20 ఏండ్ల వయసులో పీపుల్స్వార్గ్రూపులో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈయనపై 50కి పైగా కేసులు ఉన్నాయి. ఎన్ఐఏ హిట్లిస్టులోనూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ,- చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేయడానికి క్యాడర్‌కు శిక్షణ, ఆయుధాల సరఫరా వంటి పనులు చేస్తారు. కొత్త రిక్రూట్‌మెంట్ బాధ్యతలు నిర్వహించారు.
ఇటీవల మావోయిస్ట్సెంట్రల్ కమిటీ మెంబర్లు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న ఆయుధాలతో సహా తమ టీమ్‌తో లొంగిపోవడంతో.. ఆజాద్ కూడా లొంగిపోవడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. ఈ నెల 15న ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈయనను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) పోలీసులు అరెస్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఆజాద్‌ను పోలీసులు అరెస్ట్చేశారా? లేక ఆయన లొంగిపోవడానికి వచ్చారా? అనే విషయాన్ని పోలీస్ ఆఫీసర్లు ధ్రువీకరించడం లేదు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
