
- ఫస్ట్ ఫేజ్లో 5,190 కి.మీ. మేర రోడ్లకు రూ. 6,478 కోట్లతో మరమ్మతులు
- జీవో 318 విడుదల.. త్వరలో టెండర్లు.. సెప్టెంబర్లో పనులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ( హ్యామ్ ) విధానంలో మరమ్మతుల కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో పనులకు ఓకే చెప్పింది. ఈ మేరకు ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ బుధవారం జీవో నంబర్ 318ని జారీ చేశారు. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 5,190.25 కిలోమీటర్ల ఆర్ అండ్ బీ రోడ్లను రూ. 6,478.33 కోట్లతో రిపేర్లు చేయనున్నారు. ఇందులో 373 రోడ్లు ఉండగా 17 ప్యాకేజీలుగా అధికారులు విభజించారు. 17 సర్కిళ్ల వారీగా మరమ్మతులు చేపట్టాల్సిన రోడ్లు, కిలోమీటర్లు, అంచనా వ్యయాన్ని పేర్కొన్నారు. గ్రామల మధ్య రోడ్ల మరమ్మతులు, గ్రామం నుంచి మండల కేంద్రం వరకు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని వరకు పలు రోడ్లకు రిపేర్లు చేపట్టనున్నారు.
సెప్టెంబర్ నుంచి పనులు
మొత్తం మూడు దశల్లో సుమారు 12 వేల కిలోమీట్లరు రోడ్లను హ్యామ్ విధానంలో చేపట్టనున్నారు. టెండర్ వ్యాల్యూలో 60 శాతం కాంట్రాక్టర్లు భరించనుండగా, 40 శాతం ప్రభుత్వం వాయిదాల పద్దతిలో కాంట్రాక్టర్లకు చెల్లించనుంది. అర్హత ఉన్న కాంట్రాక్టర్లతో త్వరలో హైదరాబాద్ లో మీటింగ్ నిర్వహించేందుకు అర్ అండ్ బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా మరమ్మతులు చేపట్టాల్సిన రోడ్ల దగ్గర హ్యామ్ రోడ్ మరమ్మతులు అని వివరాలతో బోర్డులు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు. వచ్చే నెలలో ఫేజ్ వన్ రోడ్లపై టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు పూర్తిగా తగ్గాక సెప్టెంబర్ నుంచి పనులు స్టార్ట్ చేసే అవకాశం ఉంది.
సీఎంకు కృతజ్ఞతలు: మంత్రి వెంకట్రెడ్డి
పదేండ్లు రిపేర్లకు నోచుకోని రోడ్లకు తమ ప్రభుత్వం హ్యామ్ విధానంలో మూడు దశల్లో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించిందని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. ఫస్ట్ ఫేజ్లో పనులకు ఆమోదం తెలిపినందుకు సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం ఒక ప్రకటనలో ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి నాణ్యమైన రోడ్డు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లేన్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.
హ్యామ్ విధానంలో చేపట్టాల్సిన రోడ్ల నిర్మాణానికి సంబంధించి పలుమార్లు ఫీల్డ్ విజిట్ చేసి ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక అందించిన ఆర్ అండ్ బీ అధికారులను, మానిటరింగ్ చేసిన స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అభినందించారు. వచ్చే నెలలో టెండర్లు పిలిచి, వర్షాలు పూర్తి కాగానే వర్క్ స్టార్ట్ చేసేలా కాంట్రాక్టర్లను ఆదేశిస్తామని ఆయన పేర్కొన్నారు.