సర్కారీ బకాయిలు 57 వేల కోట్లు.. బీఆర్‌‌‌‌ఎస్‌‌ పెట్టినవే 50 వేల కోట్లు

సర్కారీ బకాయిలు 57 వేల కోట్లు.. బీఆర్‌‌‌‌ఎస్‌‌ పెట్టినవే 50 వేల కోట్లు
  • డిస్కంలకు గుదిబండలా మారిన డ్యూస్​
  • భారీగా మోటార్లు పెట్టి ఆర్భాటంగా ప్రాజెక్టులు
  • డిస్కంలకు ఆ మోటార్ల కరెంట్ బిల్లుల ఎగవేత  
  • లిఫ్ట్‌‌ ఇరిగేషన్, వాటర్ వర్క్స్, మిషన్ భగీరథదే సింహభాగం
  • 2025–26లో  రూ. 3,245  కోట్ల బకాయిలు
  • వాయిదాల్లో చెల్లిస్తామన్న హామీ అమలుకాలే..
  • అంతిమంగా ప్రజలపైనే పడుతున్న భారం ?

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్​ఎస్ సర్కారు ఉదాసీనత డిస్కంల పాలిట శాపంలా మారింది. ఏకంగా యాభై వేల కోట్ల పైచిలుకు బకాయిలు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడంతో డిస్కంలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి.  ప్రస్తుతం  రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఏకంగా రూ. 57,336.42 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలే రూ. 3,245 కోట్ల వరకు ఉన్నాయి.  కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్  సర్కారు బడ్జెట్‌‌లో కరెంట్ బిల్లులకు పైసలు కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడంతో ఈ పెండింగ్ బిల్లులు ఏటేటా పెరుగుతూ వచ్చాయి.  దీంతో డిస్కంలు  బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు నిధులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి.  

నీటి పారుదల, తాగునీటి పథకాలదే 75 శాతానికిపైగా వాటా

మొత్తం రూ. 57,336 కోట్ల ప్రభుత్వ శాఖల బకాయిల్లో సాగు, తాగునీటి ప్రాజెక్టులదే దాదాపు 80 శాతానికిపైగా ఉన్నాయి. కేవలం ఎత్తిపోతల పథకాలు, హైదరాబాద్ వాటర్ బోర్డు, మిషన్ భగీరథ పథకాల నుంచే డిస్కంలకు రూ. 45,934.34 కోట్లు రావాల్సి ఉంది.  ఇందులో హెచ్‌‌టీ (హైటెన్షన్) పరిధిలోని ప్రభుత్వ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌‌ల వాటానే అత్యధికంగా రూ. 29,264.88 కోట్లు.  ఈ ఒక్క ఏడాది బకాయే రూ. 1,603.21 కోట్లని గణాంకాలు చెబుతున్నాయి. తర్వాతి  స్థానంలో  హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు ఏకంగా రూ. 9,161.29 కోట్లు బాకీ పడి ఉంది. (ఇందులో ఈ ఏడాది వాటా రూ. 576.54 కోట్లు).  గత సర్కారు ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న మిషన్ భగీరథ కింద రూ. 7,508.17 కోట్లు డిస్కంలకు చెల్లించలేదు.  

గత పాలకులు భారీ పంపింగ్ మోటార్లు పెట్టి ప్రాజెక్టులను ఆర్భాటంగా ప్రారంభించి.. రాజకీయ లబ్ధి పొందారే తప్ప, ఆ మోటార్లు తాగే కరెంట్ బిల్లులను విద్యుత్ సంస్థలకు చెల్లించే బాధ్యతను గాలికొదిలేశారు. బడ్జెట్‌‌లో టోకెన్ నిధులు కూడా ఇవ్వకుండా డిస్కంల నుంచి ఉచితంగా సేవలు పొందడంతో ఈ మూడు శాఖల విద్యుత్ బకాయిలే రాష్ట్ర విద్యుత్ రంగానికి పెను శాపంగా మారాయి.

పంచాయతీలు, మున్సిపాలిటీలు, కేంద్ర సంస్థలదీ అదే బాట

క్షేత్రస్థాయి స్థానిక సంస్థలు, పరిపాలనా విభాగాలు కూడా కరెంట్ బిల్లుల చెల్లింపును పూర్తిగా పక్కనబెట్టేశాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి డిస్కంలకు రూ. 6,520.79 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో ఈ ఏడాది పెండింగ్ బిల్లులే రూ. 275.24 కోట్లు.  పల్లెల్లో వీధి దీపాలు, తాగునీటి మోటార్ల బిల్లులను నిధుల కొరత పేరుతో స్థానిక సంస్థలు ఏళ్ల తరబడి పక్కనబెట్టేశాయి. అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌‌మెంట్ పరిధిలోని పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు రూ. 2,852.72 కోట్ల బకాయిలను మోస్తున్నాయి. 

ఈ ఏడాది బకాయి రూ. 97.15 కోట్లుగా ఉంది. ఆశ్చర్యకరంగా రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా రూ. 1,021.89 కోట్ల విద్యుత్ బిల్లులను పెండింగ్​పెట్టాయి. ఇందులో ఈ ఏడాది రావాల్సినవి రూ. 36.22 కోట్లు. సెక్రటేరియెట్‌‌, కలెక్టరేట్లు, పోలీస్, వైద్యారోగ్య తదితర ఇతర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు మరో రూ. 1,006.69 కోట్లు డిస్కంలకు బాకీ పడ్డాయి.  అయితే మున్సిపాలిటీలు, కేంద్ర సంస్థలు, సెక్రటేరియెట్‌‌, కలెక్టరేట్లకు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించే ఆర్థిక స్తోమత, సొంత ఆదాయం ఉన్నప్పటికీ కావాలనే చెల్లించడం లేదని  తెలుస్తోంది.  

వడ్డీలకే వేలకోట్లు

గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన ఈ బకాయిలను విడతలవారీగా, వాయిదాల పద్ధతిలో బడ్జెట్ ద్వారా డిస్కంలకు రీయింబర్స్ చేస్తామని నాటి పాలకులు పదేపదే హామీలు ఇచ్చినా.. అవి కాగితాలకే పరిమితమయ్యాయి. నిధులు విడుదల చేయకపోవడంతో డిస్కంలు బహిరంగ మార్కెట్లో అధిక వడ్డీలకు స్వల్పకాలిక రుణాలు తెచ్చి జెన్‌‌కో, ట్రాన్స్‌‌కో, కేంద్ర విద్యుత్ సంస్థలకు చెల్లింపులు చేయాల్సి వచ్చింది. ఆ అప్పులకు ఏటా వేల కోట్ల రూపాయల వడ్డీలు కడుతూ డిస్కంలు విషవలయంలో చిక్కుకున్నాయి. ఇప్పుడు బ్యాంకులు కూడా డిస్కంలకు కొత్తగా రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల ఈ నిర్లక్ష్యంతో అంతిమంగా సామాన్యుడిపైనే భారం పడుతున్నది.