కొత్త పంచాయతీలు లేనట్లే!.. జీపీలు ఏర్పాటు చేయాలని 250 దరఖాస్తులు

కొత్త పంచాయతీలు లేనట్లే!..  జీపీలు ఏర్పాటు చేయాలని 250 దరఖాస్తులు
  • ఇందులో 500 జనాభా ఉన్న గ్రామాలు 37 మాత్రమే..
  • సర్కార్​పై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఒత్తిళ్లు
  • ఎన్నికల టైమ్​లో ఇచ్చిన హామీ అమలు చేయాలని రిక్వెస్ట్​లు
  • చిన్న పంచాయతీలతో ఆర్థిక భారమని సర్కార్ ఆలోచన 
  • గైడ్​లైన్స్ రూపొందించి ముందుకెళ్లాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: కొత్త పంచాయతీల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది. గత ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు పంచాయతీలు ఏర్పాటు చేయడంతో ఎన్నో సమస్యలు వస్తున్నాయని ఆరోపిస్తున్నది. ఈ మేరకు కొత్త పంచాయతీల ఏర్పాటుకు పక్కా గైడ్​లైన్స్ రూపొందించి ముందుకెళ్లాలని నిర్ణయించింది. ప్రధానంగా 500 కంటే తక్కువ జనాభా ఉన్న పల్లెలను పంచాయతీలుగా మార్చడంతో ప్రభుత్వానికి అదనపు భారమే తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆఫీసర్లు చెప్తున్నారు.

 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త పంచాయతీల ఏర్పాటు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వానికి పెద్దసంఖ్యలో ప్రతిపాదనలు వచ్చాయి. కొత్త పంచాయతీలు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో హామీ ఇచ్చినట్లు నేతలు చెప్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై వీళ్లంతా ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పంచాయతీల కోసం 250 వరకు పంచాయతీరాజ్​శాఖకు దరఖాస్తులు వచ్చాయి. అప్లికేషన్లతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలు కూడా జతచేసి ఉన్నాయి. దీనిపై పంచాయతీరాజ్​శాఖ అధికారులు క్షేత్రస్థాయి నుంచి వివరాలు తెప్పించారు. చాలా దరఖాస్తులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోవడంతో పెండింగ్ లో పెట్టినట్లు తెలిసింది.

3 కిలో మీటర్ల దూరం ఉండాలి 

రాష్ట్రంలో ప్రస్తుతం 12,777 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్త పంచాయతీల కోసం సుమారు 250 దరఖాస్తులు రాగా.. అందులో 37 గ్రామాల్లో మాత్రమే 500 జనాభా ఉన్నట్లు తేలింది. మిగిలిన గ్రామాల్లో 500లోపు జనాభా ఉంది. వికారాబాద్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో కేవలం 90 కుటుంబాలు ఉన్న ఓ పల్లెను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని అక్కడి ఎమ్మెల్యే సిఫార్సు లేఖ పంపినట్లు తెలిసింది. 

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయాలంటే కనీసం 500 జనాభా ఉండాలని, పల్లెకు, పల్లెకు మధ్య 3 కిలో మీటర్ల దూరం ఉండాలని పంచాయతీరాజ్ చట్టంలో స్పష్టంగా ఉంది. దీంతో ఇలాంటి  దరఖాస్తులను పెండింగ్ లో పెట్టారు. త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కొత్త పంచాయతీల ఏర్పాటు సాధ్యం కాదని పంచాయతీరాజ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇప్పుడు కాకుంటే.. ఇప్పట్లో కావు

త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పంచాయతీలు ప్రకటించాలని, ఇప్పుడు కాకుంటే ఇప్పట్లో కావని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. అందుకే, కొత్త పంచాయతీల కోసం పంచాయతీరాజ్ అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయకుండా ఎన్నికలకు వెళ్తే.. తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయలేమని, ఇచ్చిన మాట నిలుపుకోలేదని ప్రజల్లో వ్యతిరేక భావన వస్తుందని, ఇది పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త పంచాయతీల ఏర్పాటుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వస్తాయని, గ్రామాల అభివృద్ధికి అవకాశం ఉంటుందని ఆయా పల్లెవాసులు అభిప్రాయ పడుతున్నారు. కాగా, కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుతో ఆర్థిక భారం పడుతుందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఇష్టారీతిన పంచాయతీల ఏర్పాటు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 3 వేలకు పైగా తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్ మార్గదర్శకాలు  పాటించకుండా ఇష్టారీతిన ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జనాభాను పరిగణనలోకి తీసుకోకుండా ఆ నాటి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కోరిన గ్రామాలను ఏర్పాటు చేయడంతో విమర్శలు వచ్చాయి.  పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేశామని గత పాలకులు చెప్పినా.. వసతుల కల్పించడంలో విఫలమయ్యారని ప్రజలు వాపోతున్నారు. కొన్ని గ్రామపంచాయతీలకు నేటికీ రోడ్డు సౌకర్యం లేదు. అనేక గ్రామాలకు కనీస సౌకర్యాల్లేక సమస్యలతో సతమతమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేస్తే ఎలా అనేదానిపై పంచాయతీరాజ్ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. దీంతో దరఖాస్తులను పెండింగ్ లో పెట్టారు.