
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీ ఐఐసీ) కంపెనీ స్థితిని “ప్రైవేట్ లిమిటెడ్” నుంచి “పబ్లిక్ లిమిటెడ్”గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంపెనీలోని షేర్ల సంఖ్యను 4 నుంచి 7కు పెంచడంతోపాటు అదనంగా ముగ్గురు షేర్‌హోల్డర్లను నామినేట్ చేసింది. టీజీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ మార్పులను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ గత నెల 15న స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయం ద్వారా కంపెనీ బాండ్లు/డిబెంచర్లను సెకండరీ మార్కెట్‌లో ఎక్కువ మంది పెట్టుబడిదారులకు అందుబాటులోకి తీసుకురావడం, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ ప్రక్రియలో భాగంగా టీజీఐఐసీ ఇప్పటికే రూ.10వేల కోట్ల విలువైన బాండ్లు/డిబెంచర్లను జారీ చేసింది. 2024 అక్టోబర్ 11న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ బాండ్లు లిస్ట్ అయ్యాయి. దీంతో కంపెనీ స్థితి “హై వాల్యూ డెట్ లిస్టెడ్ ఎంటిటీ” (హెచ్వీడీఎల్ )గా మారింది.
పెట్టుబడిదారులను ఆకర్షించేందుకే..
ప్రస్తుతం టీజీఐఐసీ.. “ప్రైవేట్ లిమిటెడ్” కేటగిరీలో ఉంది, దీనివల్ల షేర్ల బదిలీ, సభ్యుల సంఖ్య (గరిష్టంగా 200 మంది), పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్‌పై కొన్ని పరిమితులు ఉన్నాయి. వీటిని తొలగించి, సెకండరీ మార్కెట్‌లో ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం మార్పులు చేసింది. దీంతో టీజీఐఐసీ కంపెనీ అనుబంధ సంస్థలన్నీ కూడా “ప్రైవేట్ లిమిటెడ్” నుంచి “డీమ్డ్ పబ్లిక్ కంపెనీ”గా మారనున్నాయి. కొత్త షేర్‌హోల్డింగ్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడుగురు నామినీలు ఉంటారు.