- సింథటిక్ దారం అమ్మినా, వాడినా కఠిన చర్యలు తీస్కుంటామని హెచ్చరిక
- చైనా మాంజా వాడొద్దని సినీ స్టార్లు, రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రచారం
- మాంజా కట్టడికి ప్రజల సహకారం కావాలని అటవీ శాఖ, పోలీసుల విజ్ఞప్తి
- సంక్రాంతి వేళ విషాదాలు వద్దంటూ విస్తృత ప్రచారానికి శ్రీకారం
హైదరాబాద్, వెలుగు: చైనా మాంజా ప్రజలు, వాహనదారుల పాలిట యమపాశంలా మారుతోంది. ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరేసేందుకు చైనా మాంజా(సింథటిక్ దారం)ను వాడుతున్నారు. అయితే, రాష్ట్రంలో చైనా మాంజాపై నిషేధం ఉన్నా... దొంగచాటున అమ్ముతున్నారు. దీంతో మాంజా కట్టడి చేసేందుకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. కైట్ షాపులపై దాడులు చేస్తూ చైనా మాంజా విక్రయిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు.
కైట్స్ ఎగరేసేందుకు నిషేధిత సింథటిక్ (చైనా) లేదా గ్లాస్ కోటెడ్ మాంజాను వాడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ అటవీ శాఖ, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ హెచ్చరించింది. పండుగ సంతోషం మనుషులకే కాకుండా పక్షులకు కూడా ఉండాలని, ప్రజలెవరూ చైనా మాంజాను వాడొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. సింథటిక్ దారం నిషేధం అమలుపై పీసీసీఎఫ్ సువర్ణ ఆధ్వర్యంలో సోమవారం అరణ్య భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. చైనా మాంజా నిషేధం అమల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని, విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మీటింగ్‌లో నిర్ణయించారు.
చైనా మాంజాపై పర్యావరణానికి కలిగే నష్టంపై అవగాహన కల్పించేలా ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖుల సహకారంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ రెడీ చేశారు. మరోవైపు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన నియోజకవర్గంలో చైనా మాంజాను విక్రయించే వారిని, నిల్వ ఉంచిన వారిని పట్టిస్తే రూ.5 వేల నగదు బహుమతి ఇస్తానని ప్రకటించారు.
గాజు పొడి, ప్లాస్టిక్, రసాయనాలతో తయారీ..
చైనా మాంజా కేవలం దారం కాదు.. గాజు పొడి, ప్లాస్టిక్, ఇతర రసాయనాలతో తయారైన చాలా ప్రమాదకరమైన దారం. అసలు తెగదు.. మనిషి చర్మాన్ని కోసుకుంటూ వెళ్తోంది. గతంలో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో బ్రిడ్జిలపై, రోడ్లపై వెళ్తున్న బైకర్ల మెడకు చైనా మాంజా చుట్టుకుని గొంతులు తెగిపోయిన ఘటనలు ఉన్నాయి. పండుగకు ముందే పలువురు ప్రాణాలు కోల్పోవడం, పదుల సంఖ్యలో ఆసుపత్రుల పాలుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎగిరే పక్షులు ఈ దారంలో చిక్కుకుని చనిపోతున్నాయి.
అటవీ శాఖ స్టార్ క్యాంపెయిన్..
చైనా మాంజాను జరిమానాలతో అరికట్టలేమని భావించిన అటవీ శాఖ అధికారులు.. ఈసారి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సినీ ప్రముఖులను, సోషల్ మీడియా రీల్స్, వీడియో బైట్స్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ‘చైనా మాంజా వద్దు.. కాటన్ దారమే ముద్దు’అంటూ వీడియోలు రికార్డ్ చేయించి సోషల్ మీడియాలో ప్రచారం చేసేలా ప్లాన్ చేశారు. థియేటర్లలో, సోషల్ మీడియా రీల్స్ ద్వారా ఈ సందేశాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు.
చైనా మాంజా కొన్నా.. అమ్మినా.. కఠిన చర్యలు: పీసీసీఎఫ్ సువర్ణ
చైనా మాంజాను అమ్మడానికి, కొనడానికి వీల్లేకుండా అరికట్టాలని పీసీసీఎఫ్ డాక్టర్ సి.సువర్ణ అన్నారు. చైనా మాంజా వల్ల మనుషులకు, పక్షులకు, వన్యప్రాణులకు ప్రమాదాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఈ మాంజా తయారీ, సరఫరా, విక్రయాలను గుర్తించి, అడ్డుకట్ట వేయాలని ఆదేశించాలని అధికారులకు సూచించారు.
చైనా మాంజా కట్టడిపై సోమవారం అరణ్య భవన్‌లో పలు శాఖల అధికారులు, ఎన్జీవోలు, వాలంటీర్లతో చైనా మాంజాను విక్రయించే దుకాణాలు, గోదాములు, అక్రమ నిల్వలపై పోలీసు శాఖతో సమన్వయం చేసుకొని ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన షాప్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.
