పబ్లిక్​ హెల్త్​కు పైసల్లేవ్​..నిధుల ఖర్చులో 12వ ప్రయారిటీ

పబ్లిక్​ హెల్త్​కు పైసల్లేవ్​..నిధుల ఖర్చులో 12వ ప్రయారిటీ
  • సర్కారు దవాఖాన్లపై పట్టింపు లేదు
  • మెడిసిన్లు,పరికరాలు కొనుట్ల కోత
  • నిధుల ఖర్చులో 12వ ప్రయారిటీ

హైదరాబాద్, వెలుగు: కరోనా కష్టకాలంలో ఎక్కువ నిధులు హెల్త్ కు ఖర్చు చేసి ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పాత ప్రయారిటీలకే మొగ్గు చూపింది.  ఇరిగేషన్​, రోడ్లు, పోలీసింగ్, ఎడ్యుకేషన్​.. ఈ వరుస చూస్తే నిధుల కేటాయింపులో హెల్త్ సెక్టార్​ పన్నెండో  నెంబర్​లో ఉంది. ఇరిగేషన్​ ప్రాజెక్టులకు  రూ. 20 వేల కోట్లు, రైతుబంధు, రైతుల పంట రుణాల మాఫీ, వడ్డీ లేని రుణాలకు రూ. 20 వేల కోట్లు, ఆసరా పెన్షన్లకు రూ. 12 వేల కోట్లు, డబుల్​ బెడ్రూం ఇండ్లకు రూ. 5 వేల కోట్లు ప్రభుత్వం నిరుడు ఖర్చు చేసింది. ఈ ఏడాది కూడా అవే రిపీట్​ చేసింది. ఈసారి బడ్జెట్​లో సెక్రటేరియట్​ కొత్త బిల్డింగ్​కు రూ. 610 కోట్లు, రీజనల్​ రింగ్​ రోడ్​కు రూ. 750 కోట్లు, జిల్లాల్లో పోలీసింగ్​కు రూ. 3,000 కోట్లు, రోడ్లు, బ్రిడ్జీలకు రూ. 4,000 కోట్లు, చెక్​ డ్యామ్​లకు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేయాలని టార్గెట్​ పెట్టుకుంది.  

కరోనాను కట్టడి చేసేందుకు కోట్లు ఇస్తామన్న కేసీఆర్​ స్పీచులతో ఈ ఏడాదైనా హెల్త్ ప్రయారిటీ పెరుగుతుందనుకుంటే.. నిరుటి కంటే తగ్గింది. నిరుడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తం రూ. 1.66 లక్షల కోట్లలో హెల్త్ కు ఖర్చు చేసింది రూ. 5,600 కోట్లు దాట లేదు. అంటే మొత్తం ఖర్చులో మూడు శాతం కూడా మించలేదు. ఈ ఏడాది మొత్తం 2.30 లక్షల కోట్ల బడ్జెట్​లో  హెల్త్​కు  2.5 శాతమే కేటాయించారు. హెల్త్ కు రూ. 5,868 కోట్లు కేటాయిస్తే.. అందులో జీతాలు, నిర్వహణ ఖర్చులకే సగానికిపైగా రూ.3,800 కోట్లు అవసరం. మిగతా రెండు వేల కోట్లలో కేంద్రం అమలు చేసే నేషనల్​ హెల్త్ మిషన్​ స్కీమ్​కు రాష్ట్రం వాటా రూ. వెయ్యి కోట్లు. ఆరోగ్య శ్రీ బిల్లులు, ఈహెచ్​ఎస్​ కేటాయింపులు పోతే మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసే నిధులు అరకొరే. మెడిసిన్​, సర్జికల్ ఎక్విప్​మెంట్​ కొనుగోళ్లకు నిధుల్లో కోత పెట్టింది. అందుకే కరోనా టైమ్‌లో ఇంజక్షన్లు, ఆక్సిజన్​ సిలిండర్లు, అన్నింటికి షార్టేజ్​ ఏర్పడింది. సర్కారీ​ హాస్పిటళ్లలో కరోనా ట్రీట్​మెంట్​కు సరిపడే సదుపాయాలు, మెడిసిన్​ అందుబాటులో లేవనే ఫిర్యాదులు పెరిగిపోయాయి. నిధుల్లేక ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. కరోనా ట్రీట్​మెంట్​ను ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడంతో పేదలు వైద్యసేవలు అందక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రైవేటు హాస్పిటళ్లలో చేరిన వాళ్లు ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నారు. అవి కూడా సరిపోనివాళ్లు అప్పులపాలవుతున్నారు. 

సెక్రటేరియట్​కు 610 కోట్లు.. టిమ్స్​కు  రూ. 27 కోట్లే

కరోనా విలయంలో ప్రజలను ఆదుకునేందుకు అత్యవసరమైన గవర్నమెంట్​ హాస్పిటళ్లు, వైద్య సదుపాయాలు, మెడిసిన్​, సర్జికల్​ పరికరాల కొనుగోలు, అంబులెన్స్​ సేవలను సర్కారు మరిచిపోయింది. కొత్త సెక్రటేరియట్​ బిల్డింగ్​లకు రూ. 61‌0 కోట్లు రిలీజ్​ చేసిన ప్రభుత్వం.. కొవిడ్​ స్పెషాలిటీ హాస్పిటల్​గా చెప్పుకుంటున్న టిమ్స్​కు మాత్రం రూ.  27 కోట్లే ఇచ్చింది. ఫస్ట్ వేవ్​ కరోనా విజృంభించిన  టైమ్​లో నిమ్స్ కంటే స్టాండర్డ్ హాస్పిటల్​గా, కొత్తగా గచ్చిబౌలిలో టిమ్స్​ హాస్పిటల్​ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కార్పొరేట్​ హాస్పిటల్​కు తీసిపోని విధంగా అద్భుతంగా టిమ్స్​లో వైద్య సదుపాయాలు ఉంటా యన్నారు. 1,500 బెడ్ల కెపాసిటీతో ఏర్పాటు చేస్తామన్న ఈ హాస్పిటల్​కు నిరుడు రూ. 25 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్​లో తూతూ మంత్రంగా రూ. 2 కోట్లు ఇచ్చింది. వంద కోట్లతో టిమ్స్​ను అద్భుతంగా తీర్చిదిద్దుతా మన్న ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏ మూలకు సరిపోతాయని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఖర్చులో సర్కారు ప్రయారిటీ ఇలా

  • ప్రాజెక్టులు, చెక్​ డ్యామ్​లు
  • రైతు బంధు, 
  • పంట రుణమాఫీ    
  • ఇటీవల ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీలు
  • సెక్రటేరియట్​ నిర్మాణం 
  • రీజనల్​ రింగ్​ రోడ్​
  •  పోలీసింగ్​
  • హెల్త్

‘‘వెయ్యి కోట్లు ఖర్చు పెట్టయినా సరే...  అసలు కరోనాను  రానే రానియ్యం..’’ అని రాష్ట్రంలో నిరుడు కరోనా ఎంటరైన కొత్తలోనే సీఎం కేసీఆర్​ అసెంబ్లీలో స్పీచ్​ ఇచ్చారు.
‘‘మాట వరుసకు వెయ్యి కోట్లు అంటున్నం కానీ.. వెయ్యి కాదు, అయిదు వేల కోట్లయినా పెడ్తం. ఎంతటి ఖర్చుకైనా వెనుకాడం..’’ అని అదే సెషన్​లో చెప్పారు.

-సీఎం కేసీఆర్