బలిమెల పోలీస్ అమరుల ఫ్యామిలీలకు ..ఎట్టకేలకు ఇండ్ల స్థలాలు

బలిమెల పోలీస్ అమరుల ఫ్యామిలీలకు ..ఎట్టకేలకు ఇండ్ల స్థలాలు
  • 2008 జూన్‌‌‌‌‌‌‌‌లో మావోయిస్టుల దాడి, 
  • 38 మంది పోలీసులు మృతి
  •  అమరుల కుటుంబ సభ్యులకు ఇండ్ల పట్టాలు అందించిన డీజీపీ శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • 18 ఏండ్ల ఎదురు చూపులకు తెర

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : బలిమెల రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌లో మావోయిస్టుల దాడిలో చనిపోయిన అమరవీరుల కుటుంబసభ్యులకు ఎట్టకేలకు ఇండ్ల స్థలాలు అందాయి. సుమారు 18 ఏండ్ల పాటు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పట్టాల పంపిణీ మంగళవారం పూర్తైంది. అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు మంగళవారం తన కార్యాలయంలో డీజీపీ బి.శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2008 జూన్‌‌‌‌‌‌‌‌ 9న మావోయిస్టులు జరిపిన ఆకస్మిక దాడిలో 32 మంది గ్రేహౌండ్స్‌‌‌‌‌‌‌‌ జవాన్లు సహా మొత్తం 38 మంది మరణించడం రాష్ట్ర పోలీస్‌‌‌‌‌‌‌‌ శాఖను తీవ్ర విషాదంలో ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆ సమయంలో తాను ఎస్ఐబీ డీఐజీగా ఉన్నానని, ఆ ఘటన చేదు జ్ఞాపకంగా వెంటాడుతోందన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకు  హైదరాబాద్ శివారులో భూమి కేటాయింపు కోసం చేసిన ప్రయత్నాలు 18 ఏండ్లకు ఫలించాయన్నారు. అమరవీరుల వారసులకు అండగా నిలవాలన్న సంకల్పంతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే ఈ సమస్య పరిష్కారం అయిందన్నారు. 

గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ... వివిధ కారణాల వల్ల గ్రేహౌండ్స్ అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇండ్ల స్థలాల పంపిణీ ఆలస్యమైందన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేసిన సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ అడిషనల్ డీజీ విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌ఐబీ చీఫ్‌‌‌‌‌‌‌‌, ఐజీ బి. సుమతి, గ్రేహౌండ్స్‌‌‌‌‌‌‌‌ కమాండర్ రాఘవేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కుత్బుల్లాపూర్‌‌‌‌‌‌‌‌ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ అశోక్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌తో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

గ్రేహౌండ్స్ ఆఫీసర్లకు ప్రత్యేక ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ మెడల్స్

గ్రేహౌండ్స్‌‌‌‌‌‌‌‌లో ప్రతిభ కనబరిచిన నలుగురు అధికారులకు 2024 సంవత్సరానికిగాను ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్’ (స్పెషల్ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ మెడల్) లభించింది. గ్రూప్‌‌‌‌‌‌‌‌ కమాండర్ జాజాల రాఘవేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సీనియర్ కమాండోలు తిప్పని రాకేశ్‌‌‌‌‌‌‌‌, ఉడుతనూరి మల్లయ్య, జూనియర్‌‌‌‌‌‌‌‌ కమాండో గంటా సాయికుమార్‌‌‌‌‌‌‌‌ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిని డీజీపీ శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అభినందించారు.

18 ఏండ్ల నిరీక్షణ తర్వాత...

బలిమెల ఘటన తర్వాత ప్రభుత్వం అమరవీరుల వారసులకు 200 గజాల చొప్పున ఇండ్ల స్థలాలను కేటాయిస్తూ 2013లో జీవో నంబర్ 339 జారీ చేసింది. తొలుత కుత్బుల్లాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం గాజులరామారంలోని సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ 23, 27లలో రెండెకరాల భూమిని కేటాయించారు. అయితే ఆ భూమిలో ఆక్రమణలు ఉండడంతో ప్రత్యామ్నాయంగా అదే గ్రామంలోని సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ 16లో 3.10 ఎకరాలను గుర్తించారు. 

జీవోలో ఉన్న సర్వే నంబర్లకు, క్షేత్రస్థాయిలో ఉన్న స్థలానికి మధ్య వ్యత్యాసం ఉండడంతో రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియలో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో స్థలాలకు సంబంధించిన పట్టాల కోసం అమరవీరుల కుటుంబాలు దాదాపు 18 ఏండ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నాయి. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం గాజులరామారంలోని సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ 16లో భూమిని కేటాయిస్తూ గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 18న జీవో నంబర్‌‌‌‌‌‌‌‌ 132తో సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 33 మంది అమరుల వారసులకు మంగళవారం ఇండ్ల పట్టాలు అందజేశారు.