
- ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ట్యాబ్ ల ద్వారా వివరాల సేకరణ
- త్వరలో ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: ఎంపీ ఎన్నికల కోడ్ ముగియనుండటంతో కుల గణన కోసం రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతున్నది. దీనిపై రెండు నెలలుగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్, బీసీ కమిషన్ కసరత్తు చేస్తున్నాయి. కుల గణన ఎలా చేయాలి, అవలంబించాల్సిన విధానాలు ఏమిటి, మెథడాలజీ, గైడ్ లైన్స్ ఎలా ఉండాలన్న అంశాలపై డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించడానికి వీలుగా ప్రశ్నలతో క్వశ్చనీర్ ను తయారు చేసే పనిలో అధికారులు ఉన్నారు. అదేవిధంగా ప్రత్యేక సాఫ్ట్ వేర్‌ను రూపొందించి, ట్యాబ్‌ల ద్వారా సమాచారం సేకరించాలనుకుంటున్నారు.
క్యాస్ట్ సెన్సస్ లో ప్రజల నుంచి వివరాలు తీసుకునేందుకు మొత్తం 55 ప్రశ్నలతో క్వశ్చనీర్ ను రెడీ చేస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఒక్కో వ్యక్తి నుంచి అన్ని వివరాలు తీసుకునేందుకు సుమారు 20 నిమిషాలు పట్టే చాన్స్ ఉంది. కులగణన విధుల కోసం లక్ష మంది అవసరం అవుతారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ విధుల్లో ఎక్కువగా టీచర్లను భాగస్వామ్యం చేసే అవకాశం ఉంది.
పారదర్శకంగా..!
గత బీఆర్ ఎస్ సర్కారు 2014 లో సమగ్ర సర్వే చేసి వివరాలు గోప్యంగా ఉంచడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కులగణనలో ఎలాంటి వివాదాలు, ఆరోపణలు రాకుండా పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ అంశంలో సామాజికవేత్తలు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు, పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సస్ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించింది. పలు పార్టీల నేతలు ఈ అంశంపై మంత్రులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. అన్ని పార్టీల సలహాలను, సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. కాగా.. దేశంలో ప్రస్తుతం బీహార్, ఏపీ, కర్నాటక తో పాటు కొన్నేండ్ల కింద తమిళనాడు క్యాస్ట్ సెన్సస్ చేపట్టింది. ఈ అంశంపై రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, మెంబర్లు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ జరిగిన క్యాస్ట్ సెన్సస్ను అధ్యయనం చేశారు. న్యాయ పరమైన చిక్కులు రాకుండా కులగణన చేపట్టాలని ముందుకు వెళ్తున్నారు.