రాష్ట్ర సర్కార్ మరో రూ. 8 వేల కోట్ల అప్పు

రాష్ట్ర సర్కార్ మరో రూ. 8 వేల కోట్ల అప్పు


హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 8 వేల కోట్ల అప్పు తీసుకునేందుకు ఆర్బీఐకి అప్లై చేసుకుంది. ఇందులో మంగళవారం రూ. 2 వేల కోట్లు, ఈ నెలఖారులో మరో రూ. వెయ్యి కోట్లు తీసుకోనుంది. అలాగే ఆగస్టు 10న రూ. 2 వేల కోట్లు, 24న రూ. వెయ్యి కోట్లు, సెప్టెంబర్ 7న ఇంకో రూ. 2 వేల కోట్ల చొప్పున తీసుకోంది. ఈ ఫైనాన్షియల్​ఇయర్ మొదటి 3 నెలలు ఏప్రిల్, మే, జూన్‌‌‌‌లో రూ. 8 వేల కోట్ల అప్పు తీసుకునేందుకు ఆర్బీఐకి రాష్ట్రం అప్లై చేసింది. అయితే ఈ 3 నెలల్లో దాదాపు రూ.16 వేల కోట్లు తీసుకుంది. ఒక్క జూన్‌‌‌‌లోనే రూ. 10 వేల కోట్లు అప్పు చేసింది. ఈసారి కూడా అప్లై చేసుకున్న దానికంటే ఎక్కువే తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పీఆర్సీ ప్రకారం పెరిగిన జీతాలు ఇవ్వడం, చేసిన అప్పులు వాటి కిస్తీలు కట్టేందుకు ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. మరోవైపు దళిత సాధికారత స్కీమ్​, జిల్లాల పర్యటనలో సీఎం ప్రకటించిన వరాలు, ఇతరత్రా భారం కూడా ఉన్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 47,500 కోట్లు అప్పులు చేయాలని సర్కారు నిర్ణయించింది. అనుకున్న దానికంటే మరింత ఎక్కువ అప్పులు చేసేందుకే అప్పుల పరిమితిని 4 శాతం నుంచి 5 శాతంకు పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు అడుగుతోందని అంటున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎఫ్‌‌‌‌ఆర్బీఎం పరిధిలోకి రాకుండా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అన్ని రకాలుగా రూ. 4 లక్షల కోట్ల పైనే ప్రభుత్వం అప్పులు చేసింది.