
- త్వరలో సీఎం రేవంత్ దగ్గరకు డిజైన్లు
- ఆరు డిజైన్లు రెడీ చేసిన ఆర్కిటెక్ ఏజెన్సీలు
- ఆర్ అండ్ బీకే నిర్మాణ బాధ్యతలు
- ఐదేండ్లలో అన్ని నియోజకవర్గాల్లో పూర్తి
- బడ్జెట్ లో రూ.2 వేల కోట్లు కేటాయించిన సర్కారు
హైదరాబాద్, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 20 చోట్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్(సమీకృత గురుకుల విద్యాలయాలు)లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలను వేర్వేరు చోట్ల కాకుండా.. అన్నింటినీ కలిపి ఒకే చోట ఎడ్యుకేషనల్ హబ్‌గా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు సుమారు ఆరు డిజైన్లను ఆర్కిటెక్ సంస్థలు రెడీ చేశాయి. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాటిని పరిశీలించారు. మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడంతో వాటిని ఫైనల్ చేయలేదు. త్వరలో వాటిని సీఎంకు అందజేసి, వాటిలో ఒక డిజైన్ ను ఫైనల్ చేయనున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఒక్కో నియోజకవర్గం లో 20 నుంచి 25 ఎకరాల్లో రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వ్యయంతో ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పైలట్ ప్రాజెక్టులుగా కొడంగల్, మధిర
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌ల నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గాలైన కొడంగల్, మధిరను అధికారులు ఎంపిక చేశారు. ఇక్కడ రెవెన్యూ అధికారులు స్థలాలను కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. వీటితో పాటు తొలిదశలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ తో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 20 చోట్ల నిర్మించనున్నారు.
నియోజకవర్గ కేంద్రంలో 20 ఎకరాల స్థలం ఒకే చోట లేనట్లయితే అదే సెగ్మెంట్‌లోని మరో పట్టణం లేదా మండల కేంద్రంలో కట్టాలని సర్కారు భావిస్తున్నది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కోసం రాష్ట్రవ్యాప్తంగా అనువైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించగా.. సుమారు 38 చోట్ల స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇటీవల బడ్జెట్ లో ప్రభుత్వం వీటి నిర్మాణానికి రూ.2 వేల కోట్లు కేటాయించింది. బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో పాటు విరాళాలు కూడా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ జిల్లా లేదా నియోజకవర్గాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, ఉన్నత స్థానంలో ఉన్న వారు విరాళాలు ఇచ్చేందుకు కూడా ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది.
ఆర్ అండ్ బీకే నిర్మాణ బాధ్యతలు
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ల నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం ఆర్ అండ్ బీ కే అప్పగించింది. గత పదేండ్లుగా రాష్ట్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు, సెక్రటేరియెట్, కమాండ్ కంట్రోల్ బిల్డింగ్, ప్రగతి భవన్, అమరవీరుల స్తూపం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నీ ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో పూర్తయ్యాయి. దీంతో ఈ బిల్డింగ్ ల నిర్మాణాలను కూడా ప్రభుత్వం ఆర్ అండ్ బీకే అప్పగించిందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.