
- ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ప్రతినిధులతో అటవీశాఖ అధికారుల చర్చలు
- 24 గంటల్లోనే పర్మిషన్లు.. రోజుకు రూ.50 వేలు ఫీజు
- నోడల్ ఆఫీసర్‌గా చార్మినార్ సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్
హైదరాబాద్, వెలుగు: పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచే దిశగా రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాల్లో షూటింగ్‌లకు పర్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనువైన 70 అటవీ ప్రాంతాలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న 52 అర్బన్ పార్కులను జాబితాలో చేర్చారు. అటవీశాఖ అధికారులు, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు పలుమార్లు చర్చలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చారు. గుర్తించిన ప్రాంతాల్లో షూటింగ్‌లకు గల అవకాశాలపై అధ్యయనం చేయనున్నారు.
‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’ వెబ్‌సైట్
రాష్ట్రంలో సినీ రంగాభివృద్ధికి అవసరమైన అనుమతులను సింగిల్ విండో ద్వారా అందించేందుకు ‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సినిమా షూటింగ్స్, థియేటర్ల నిర్వహణకు కావాల్సిన పర్మిషన్లను ఈ వెబ్‌సైట్ ద్వారా పొందొచ్చు.
వికారాబాద్, అమ్రాబాద్, నర్సాపూర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని దట్టమైన అడవులతో పాటు, హైదరాబాద్‌కు చుట్టుపక్కల అనేక అర్బన్ ఫారెస్ట్ పార్కులు, జాతీయ పార్కులు ఉండగా.. వీటితోపాటు మరికొన్ని పార్కులు, అటవీ ప్రాంతాల్లో సిని షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని అటవీ శాఖ నిర్ణయం తీసుకున్నది.
నారపల్లి నందనవనంలో జింకల ఎన్‌క్లోజర్, దట్టమైన అడవి, పిల్లల ఆటస్థలం, చెట్ల కొమ్మల మధ్య నడకదారి వంటి ఆకర్షణలున్నాయి. కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో 50 వేలకు పైగా చెట్లతో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. మాసిద్‌గడ్డ అర్బన్ పార్కు వందల ఎకరాల పచ్చదనంతోపాటు ట్రెక్కింగ్‌కు అనువుగా ఉంది. చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్ పార్కు, బీఎన్ రెడ్డి నగర్‌లో ఆరోగ్య సంజీవని పార్కు, మహావీర్ హరిణ వనస్థలి పార్కు, మహబూబ్‌నగర్‌లోని మయూరి హరితవనం, పాలపిట్ట సైక్లింగ్ పార్క్, కవ్వాల్, అమ్రాబాద్ అభయారణ్యం ఇలా పలు అటవీ ప్రాంతాలు షూటింగ్స్‌కు సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఇంతకుముందు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని కొన్ని సన్నివేశాలు వికారాబాద్ అడవుల్లో తీసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు సుమారు 60 నుంచి 100 కిలో మీటర్ల దూరంలో ఈ లొకేషన్లు ఉండటం, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండటం సినీ రంగానికి కలిసొచ్చే అంశం.
24 గంటల్లో అనుమతులు
అటవీ ప్రాంతాల్లో షూటింగులకు 24 గంటల్లోనే అనుమతులు లభించనున్నాయి. ఒకవేళ ఆలస్యమైనా, షెడ్యూల్ ప్రకారం షూటింగ్స్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. రోజుకు రూ.50 వేల చొప్పున ఫీజును ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ)కు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ నూతన విధానం అమలు, సమన్వయం కోసం చార్మినార్ సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. అడవుల్లో షూటింగ్స్‌కు పర్మిషన్ నిర్ణయంతో విభిన్నమైన, అద్భుతమైన లొకేషన్లు అందుబాటులోకి రానున్నాయి. సినిమా నిర్మాతలకూ ఖర్చు కలిసిరానుంది.