
- 2023 డిసెంబర్ 7 నుంచి అమల్లోకి
- గల్ఫ్ బాధితుల కోసం ‘ప్రవాసీ ప్రజావాణి కౌంటర్’
- కార్మికుల సమస్యలపై అధ్యయనానికి కమిటీ
- కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రత్యేక పాలసీ
హైదరాబాద్, వెలుగు: గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల్లో పని కోసం వెళ్లిన వాళ్లను గల్ఫ్ కార్మికులుగా గుర్తించనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన (డిసెంబర్ 7, 2023) తర్వాత గల్ఫ్‌లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.హైదరాబాద్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరిగే ప్రజావాణిలో గల్ఫ్ బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గురుకుల స్కూల్స్, కాలేజీల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు అడ్మిషన్లలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
సమస్యలపై అధ్యయనానికి కమిటీ
గల్ఫ్ కార్మికుల సంక్షేమం, వారికున్న సమస్యలపై అధ్యయనం చేయడానికి సలహా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఈ కమిటీలో గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో పాటు ఉన్నతాధికారులను సభ్యులుగా నియమించనున్నట్లు తెలుస్తున్నది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పూర్తి స్థాయిలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీని రూపొందిస్తారని అధికారులు చెప్తున్నారు.