కాళేశ్వరంపై సీబీఐ కేసుకు.. బీజేపీ కొత్త మెలిక

కాళేశ్వరంపై సీబీఐ కేసుకు.. బీజేపీ కొత్త మెలిక
  • ఓవరాల్ కాళేశ్వరం అప్పగించాలన్న స్టేట్ చీఫ్
  • బీజేపీని బద్నాం చేసేందుకే కేసు సీబీఐకి అప్పగించారన్న  పాయల్ శంకర్
  • నిన్నటి వరకు సీబీఐకి ఇవ్వాలన్న కమలనాథులు
  • ఇప్పుడు మాటమార్చుతున్న కాషాయ పార్టీ నేతలు
  • మూడు బ్యారేజీలపైనే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు
  • డ్యామేజీ అయిన వాటిపైనే విచారణ జరిపిన ఘోష్
  • ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ రిపోర్టుల ఆధారంగా విచారణ పూర్తి
  •  ఇంతకూ  సీబీఐ విచారిస్తుందా? లేదా? అనే అనుమానాలు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిని విచారించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై ఇప్పటి వరకు సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇదే తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ సీబీఐకి ఓవరాల్ కాళేశ్వరంపై విచారణను అప్పగించాలని డిమాండ్ చేశారు. 

ఇదిలా ఉండగా ఆ పార్టీ శాసన సభా పక్ష ఉప నేత పాయల్ శంకర్ నిన్న మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, బీజేపీని బద్నాం చేసేందుకే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించారని అన్నారు.  కాళేశ్వరం అవినీతిపై విచారణను సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, స్టేట్ చీఫ్ రాంచందర్ రావు నిన్నటి వరకు మాట్లాడిన సంగతి విదితమే. ఇప్పుడు మాటమార్చడం హాట్ టాపిక్ గా మారింది. 

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపైనే సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం కూడా ప్రమాదకర స్థితికి చేరడంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికను, విజిలెన్స్ రిపోర్టును బేస్ చేసుకోవడంతోపాటు ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ప్రశ్నించింది. 

అప్పటి సీఎం కేసీఆర్,  అప్పటి  నీటిపారుదల మంత్రి హరీశ్ రావు,  అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తోపాటు ఈఎన్సీలను, వివిధ హోదాల్లో పనిచేసిన ఇంజినీర్లను, అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను, డిజైనింగ్ ఇచ్చిన వ్యాప్కోస్ సంస్థ ప్రతినిధులను విచారించింది. 665 పేజీలున్న ఈ రిపోర్టులో మాజీ సీఎం కేసీఆర్  పేరును ఏకంగా  266 సార్లు ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 

దీనిపై  కేబినెట్ లో,  అసెంబ్లీలో చర్చించిన  ప్రభుత్వం కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పటి వరకు సీబీఐకి అప్పగించాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శలు చేసిన కమలనాథులు అయోమయంలో పడిపోయారు. తొలుత సీబీఐకి అప్పగించడాన్ని  స్వాగతిస్తూనే.. ఈ పని ఎప్పుడో చేయాల్సిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా కమలనాథుల స్వరం మారింది. 

బీజేపీని బద్నాం చేసేందుకే కేసును సీబీఐకి అప్పగించారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటే.. స్టేట్ చీఫ్ రాంచందర్ రావు కూడా మాటమార్చి.. ఓవరాల్  కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించాలనే కొత్త  పల్లవి ఎత్తుకున్నారు. విచారణ ప్రారంభిస్తే అన్ని విషయాలూ బయటికి వస్తాయని విశ్లేషకులు అంటున్నారు.