బీటెక్ చదివినా టీచర్ కావొచ్చు..బీటెక్ బీఈడీ అభ్యర్థులకు డీఎస్సీకి చాన్స్

బీటెక్ చదివినా టీచర్ కావొచ్చు..బీటెక్ బీఈడీ అభ్యర్థులకు డీఎస్సీకి చాన్స్
  • త్తర్వులు జారీ చేసిన సర్కార్ 
  • ఇయ్యాల్టి నుంచి దరఖాస్తులకు అవకాశం 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ అభ్యర్థులతో పాటు బీటెక్​తో బీఈడీ చేసిన అభ్యర్థులూ ఇక టీచర్లు కావొచ్చు. బీటెక్, బీఈతో బీఈడీ చేసిన అభ్యర్థులకు డీఎస్సీ–2023 దరఖాస్తుకు సర్కార్ అవకాశమిచ్చింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ పోస్టులకు వాళ్లు పోటీ పడొచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. తొలిసారిగా బీటెక్, బీఈ చదివిన స్టూడెంట్లకు 2015–17 నుంచి బీఈడీకి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత 2017లో తొలిసారిగా టీఎస్ టెట్ కూ వారికి అవకాశమిచ్చారు.

అయితే టీఆర్టీ–2017కు బీటెక్, బీఈ అభ్యర్థులకు చాన్స్ ఇవ్వలేదు. దీనిపై అప్పట్లో కొందరు కోర్టును ఆశ్రయించారు. తాజాగా 5,089 టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీ–2023 నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో టెట్​కు చాన్స్ ఇచ్చిన నేపథ్యంలో డీఎస్సీకీ అవకాశమివ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారుకు విజ్ఞప్తి చేయగా, ప్రభుత్వం అంగీకరించింది.

దీంతో ప్రస్తుత ఆన్​లైన్​ దరఖాస్తు ప్రక్రియలోనూ మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నుంచి బీటెక్, బీఈతో బీఈడీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం రానున్నది. కాగా, ఇప్పటికే 71వేల దరఖాస్తులు అందాయి. తొలిసారిగా బీటెక్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.