ఈసీకి ఆఫీసర్ల లిస్ట్..ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లు

ఈసీకి ఆఫీసర్ల లిస్ట్..ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లు
  • బదిలీ చేసిన పోస్టుల భర్తీకి ప్యానెల్ జాబితా పంపిన సీఎస్ 
  • ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లు
  • అందులో ఒకరిని ఎంపిక చేయనున్న ఈసీ 
  • ఇయ్యాల సాయంత్రానికి రాష్ట్రానికి సెలక్షన్ లిస్ట్ 

హైదరాబాద్, వెలుగు: నలుగురు కలెక్టర్లు సహా పోలీసు, ఇతర అధికారులు కొందరిని బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం పంపిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఈ మేరకు అధికారుల బదిలీ, ఆ స్థానాల్లో కొత్త అధికారుల నియామకం కోసం ప్యానెల్‌‌ జాబితాను సిద్ధం చేసి ఈసీకి పంపింది. నలుగురు కలెక్టర్లు, ముగ్గురు సీపీలు, 10 మంది ఎస్పీలతో పాటు రవాణా శాఖ సెక్రటరీ, ఎక్సైజ్‌‌ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ డైరెక్టర్ ను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ బుధవారం ఆదేశాలిచ్చింది. ఆయా పోస్టుల్లో కొత్త అధికారుల నియామకానికి సంబంధించి ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారుల చొప్పున ప్యానెల్‌‌ జాబితాను సిద్ధం చేసిన సీఎస్ శాంతికుమారి.. ఆ లిస్టును ఈసీకి గురువారం పంపించారు. అందులో నుంచి ఒక్కో అధికారిని ఈసీ ఎంపిక చేయనుంది. ఎంపిక చేసిన అధికారుల లిస్టును శుక్రవారం సాయంత్రానికల్లా సీఎస్ కు పంపనుంది. కాగా, ఒక్కో పోస్టుకు సీనియారిటీ ప్రాతిపదికన ముగ్గురు అధికారుల పేర్లను పంపాలని సీఎస్ ను ఈసీ ఆదేశించింది. ఆ మేరకు జాబితాను సిద్ధం చేసి ఈసీకి సీఎస్ పంపించారు. 

20 పోస్టులకు 60 మంది పేర్లు.. 

హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లతో పాటు 10 జిల్లాలకు ఎస్పీల పేర్లను సీఎస్​కు డీజీపీ పంపించారు. ఇక సీఎస్, జీఏడీ సెక్రటరీ కలిసి రంగారెడ్డి, మేడ్చల్​మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లా కలెక్టర్ పోస్టుల కోసం పలువురు ఐఏఎస్ ల పేర్లను ఎంపిక చేశారు. ఒక్కో జిల్లాకు ముగ్గురి చొప్పున మొత్తం 12 మంది ఐఏఎస్​ల పేర్లను ఈసీకి పంపించారు. రవాణా శాఖ సెక్రటరీ, ఎక్సైజ్‌‌ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ డైరెక్టర్ పోస్టుల కోసం ముగ్గురి చొప్పున 9 మంది పేర్లు ప్రతిపాదించారు. మొత్తం 20 పోస్టులకు సంబంధించి 60 మంది పేర్లు ఈసీకి పంపినట్లు తెలిసింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రతి అధికారికి సంబంధించిన పూర్తి వివరాలు నివేదికలో పొందుపరిచారు. ఒక్కో అధికారికి సంబంధించి ఐదేండ్ల  పనితీరు, విజిలెన్స్ రిపోర్టులు అందజేశారు. 

హైదరాబాద్ సీపీగా ఎవరు? 

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పై ఈసీ బదిలీ వేటు వేయడంతో కొత్తగా ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ పోస్టు అడిషనల్ డీజీ హోదా కావడంతో.. ఆ హోదా కలిగిన సీనియర్ ఐపీఎస్​ల పేర్లను డీజీపీ పంపించినట్లు తెలుస్తోంది. అడిషనల్ డీజీల సీనియారిటీలో మొదట కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఆ తర్వాత శివధర్ రెడ్డి, అభిలాష బిస్త్, షికాగోయల్, వీవీ శ్రీనివాస్ రావు, మహేశ్ భగవత్, సజ్జనార్, నాగిరెడ్డి ఉన్నారు. వీరిలో ముగ్గురి పేర్లను పంపాల్సి ఉండగా, ఎవరెవరి పేర్లు ఈసీకి వెళ్లాయనేది ఆసక్తికరంగా మారింది. ఇక వరంగల్, నిజామాబాద్ కమిషనర్ పోస్టుల కోసం ఐజీ ర్యాంకు ఉన్న ఐపీఎస్​ల పేర్లు పంపించారు. జిల్లాల్లో ఎస్పీల పోస్టింగ్​ల కోసం పలువురు ఐపీఎస్​ల పేర్లు ప్రతిపాదించారు. ముగ్గురు కమిషనర్లు, 10 ఎస్పీ పోస్టులకు గాను మొత్తం 39 మంది పేర్లతో కూడిన జాబితాను ఈసీకి సీఎస్ పంపించారు.