
తొమ్మిది నెలల్లో ఒక్క పైసా రాలేదంటున్న ఎమ్మెల్యేలు
రెండేండ్లలో సగం నిధులు కూడా ఇవ్వలె
సీఎంఓ చుట్టూ తిరిగినా విడుదల కాని ఫండ్స్
గత ప్రభుత్వంలో చేసిన పనులకు పైసలు రాలె
వచ్చే బడ్జెట్ లో సీడీపీ ఉంటుం దా.. ఉండదా?
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎమ్మెల్యేల నిధులకు కత్తెర పడింది. తమ సెగ్మెంట్లలో అభివృద్ధి పనులకు ‘నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ)’ కింద ఇచ్చే నిధులను ప్రభుత్వం ఆపేసింది. దీంతో నియోజకవర్గాల్లో చిన్న చిన్న అభివృద్ధి పనులు సైతం చేయించలేక మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు. తాము ఎన్నికై తొమ్మిది నెలలు గడుస్తున్నా.. ఇంత వరకు ఒక్క పైసా తమకు రాలేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం సెక్రటేరియెట్ చుట్టూ తిరుగుతున్నారు.
ఓటాన్ అకౌంట్బడ్జెట్ లో ప్రభుత్వం సీడీపీ కింద రూ.480 కోట్లు కేటాయించింది. కానీ ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. ఎన్ని సార్లు అడిగినా… అదిగో చూద్దాం.. ఇదిగో చూద్దాం అంటూ సీఎంఓ అధికారులు సర్ది చెపుతున్నారే తప్పా నిధులు ఇవ్వడం లేదంటూ స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు. ప్రతి ఏడాది మూడు విడతల్లో ప్రణాళిక విభాగం ఈ నిధులను విడుదల చేస్తుంది. కానీ.. గత ఏడాది ఇవ్వాల్సిన నిధులనే ఇప్పటికీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. సీడీపీలో భాగంగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.3 కోట్ల చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనులకు వీటిని మంజూరు చేస్తారు. రాష్ట్రంలోని 120 మంది ఎమ్మెల్యేలు(నామినేటేడ్ సహా), 20 మంది ఎమ్మెల్సీలు.. మొత్తం 140 సెగ్మెంట్లకు ప్రభుత్వం ఏటా రూ.420 కోట్లు విడుదల చేయాలి. కానీ.. గత రెండేళ్లుగా కేవలం రూ.217 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వకపోవటంతో ప్రభుత్వం సీడీపీని రద్దు చేసిందేమో అని ఎమ్మెల్యేలే అనుమానం
వ్యక్తం చేస్తున్నారు.
కోటిన్నర నుంచి మూడు కోట్లకు పెంచిన కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రం నుంచే నియోజకవర్గ అభివృద్ధి పథకం అమల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఎమ్మెల్యేలకు మరింత అధికారాలుండాలని, ప్రత్యేకంగా నిధులుండాలని సీఎం కేసీఆర్ ఈ పథకం తీరుతెన్నులను మార్చేశారు. అప్పటివరకు సీడీపీలో సగం నిధులు ఇన్ఛార్జీ మంత్రుల పెత్తనంలో ఉండేవి. అందుకు భిన్నంగా సీడీపీ నిధులపై పూర్తి పెత్తనాన్ని ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు రూ.కోటి చొప్పున నిధులు కేటాయిస్తే.. 2015లో రూ.కోటిన్నరకు పెంచారు. మరుసటి ఏడాది 2016-–17లో ఏకంగా రూ.3 కోట్లకు పెంచారు. ఈ నిధులుంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్యారం, అత్యవసర పనులను అప్పటికప్పుడు మంజూరు చేసేవారు. రూ.అయిదు లక్షల లోపు పనులను తమకు నచ్చిన వారికి నామినేషన్ పద్దతిపై ఇచ్చేవారు. పనులు పూర్తికాగానే నాలుగైదు నెలల్లో నిధులు విడదలయ్యేవి. వీటితో అనుచరులు, సన్నిహిత కార్యకర్తలను సైతం ఎమ్మెల్యేలు సంతృప్తి పరిచేవారు. కానీ నిరుటి నుంచి సీడీపీ నిధులకు బ్రేక్ పడింది. చేసిన పనులకు సైతం బిల్లులు పెండింగ్ లో పడటంతో ఎమ్మెల్యేలు తలపట్టు కుంటున్నారు. ఫలాన పనికి నిధులు కావాలని ఎ వరైనా అడిగితే భయపడే పరిస్థితి ఉందంటున్నారు.
భారీ స్థాయిలో పెండింగ్ బిల్లులు
ముందుస్తుగా అసెంబ్లీ రద్దు చేస్తారనే కారణంతో గతేడాది జులై,అగస్టు మాసంలో హడావుడీగా అనేక పనులకు శంకుస్థాపనలు చేసారు. పనులను వెంటనే ప్రారంభించారు. అసెంబ్లీ రద్దువుతోందని వెంటనే సీడీపీ కింద పనులకు అనుమతి తీసుకోవాలంటూ సీఎంఓ అధికారులే స్వయంగా ఎమ్మెల్యేలకు పోన్ చేసి మరి పనులు ఇచ్చారు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు తమకు తెలిసిన వారికి పనులు అప్పగించారు. కాని అసెంబ్లీ రద్దై ఈనెల 6తో ఏడాది పూర్తవుతుంది. ఇంతవరకు నిధులు విడుదల కాలేదు. దీంతో గత ఏడాది మంజూరు చేసిన పనులకు బిల్లులివ్వాలంటూ సెక్రెటేరియట్ చుట్టూ తిరిగినా లాభం లేదని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఈ ఏడాది సీడీపీఏమో కానీ.. పాత బిల్లులే రావటం లేదని నిట్టూరుస్తున్నారు.
సీడీపీ ఎందుకు?
సీడీపీ కింద నిధుల విడుదల జాప్యంపై టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎం అధీనంలో ఉన్న ఎస్డీఎఫ్ నిధులున్నాయి. గతేడాది రూ.500 కోట్లు సీఎం కోటాలో ఎస్డీఎఫ్గా కేటాయించారు. ఇవి నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కదా.. మళ్లీ సీడిపీ ఎందుకని సీఎం ప్రశ్నించినట్లు నేతలు చెబుతున్నారు. ఈ అభిప్రాయంతోనే ఈ నిధులను ఆపేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. అందుకే నిరుడు చేపట్టిన పనులకు సైతం నిధులు విడుదల చేయలేకపోతున్నామని అధికారులు చేతులెత్తేస్తున్నారు. బడ్జెట్ లో ఈ పథకం ఉంటుందా.. లేదా అనే అనుమానాలున్నాయి.