 
                                    - రాష్ట్రంలో చికిత్సకు వచ్చే బీపీ పేషెంట్ల సంఖ్య ఐదేండ్లలో డబుల్
- ఇండియా హైపర్టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ సర్వేలో వెల్లడి
- 14 శాతం నుంచి 26 శాతానికి పెరిగిన చికిత్సలు
- మెడిసిన్ సప్లై 63 శాతం నుంచి 91 శాతానికి
- పీహెచ్సీల్లో అన్ని మందులు అందుబాటులో
- తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్రలో స్టడీ చేసిన సంస్థ
హైదరాబాద్, వెలుగు:బీపీ(బ్లడ్ ప్రెషర్) పేషెంట్ల చికిత్సకు సర్కార్ ఆస్పత్రులు కేరాఫ్ గా మారుతున్నాయి. ఇదివరకు బీపీ అనగానే ఎక్కువ మంది పేషెంట్లు ప్రైవేటు హాస్పిటల్స్ వైపు మొగ్గుచూపేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీపీ బాధితులు సర్కార్ దవాఖానకు జై కొడుతున్నారు. గత ఐదేండ్లతో పోలిస్తే ప్రభుత్వ హాస్పిటల్స్ లో బీపీకి ట్రీట్మెంట్ పొందుతున్న వారి సంఖ్య రెట్టింపు కావడం విశేషం. మెరుగైన వైద్య సేవలు అందడం, ఫ్రీగా మందులు ఇస్తుండడంతో.. పేషెంట్లు ప్రభుత్వ హాస్పిటల్స్ వైపే అడుగులేస్తున్నారని ‘‘ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్(ఐహెచ్సీఐ)’’ నిర్వహించిన నేషనల్ సర్వేలో వెల్లడైంది.
ప్రభుత్వ ఆస్పత్రులకు పెరిగిన ప్రాధాన్యం..
ఐదేండ్లలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నవారి సంఖ్య పెరిగింది. ఐదేండ్ల కింద అంటే 2018–-19 లో బీపీ ఉన్నవాళ్లలో కేవలం 14.4 శాతం మంది మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించేవారు. కానీ 2023–-24 నాటికి ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయి 26.2 శాతానికి చేరడం విశేషం. ముఖ్యంగా గ్రామాలు, సిటీల్లోని హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సర్వే స్పష్టం చేసింది.
అలాగే, ప్రభుత్వ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో బీపీ కంట్రోల్ లో ఉన్నవారి సంఖ్య 40 శాతం నుంచి 43 శాతానికి పెరిగింది. నేషన్ వైడ్ గా ఈ పెరుగుదల 37 శాతం నుంచి 48 శాతంగా నమోదైంది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో బీపీ కంట్రోల్ లో ఉన్నవారి సంఖ్య 40 శాతం నుంచి 43 శాతానికి పెరిగింది. జాతీయ స్థాయిలో ఈ పెరుగుదల 37 శాతం నుంచి 48 శాతంగా నమోదైంది.
ఉచిత మందులతో పెరుగుదల
ప్రభుత్వ ఆస్పత్రులకు బీపీ పేషెంట్ల సంఖ్య పెరగడానికి ముఖ్యంగా మందులు అందుబాటులో ఉండటమేనని సర్వే స్పష్టం చేసింది. 2018–19 లో రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో మందులు నిరంతరం అవైలబుల్ గా ఉన్నాయని చెప్పిన పేషెంట్ల సంఖ్య 63 శాతం ఉండగా, 2023–24 నాటికి ఆ సంఖ్య ఏకంగా 91 శాతానికి పెరిగింది. బీపీ పేషెంట్లు రెగ్యులర్ మందులు వాడాల్సి ఉంటుంది.
ఇదివరకు ప్రభుత్వ హాస్పిటల్స్ లో అన్ని రకాల బీపీ మందులు అందుబాటులో ఉండేవి కాదు. అయితే, 2024 నాటికి సర్కార్ హాస్పిటల్స్ కు మెడిసిన్ సప్లై మెరుగుపడింది. దీంతో బయట మందులు కొనుగోలు చేసే పేషెంట్ల శాతం 47 నుంచి 9శాతానికి పడిపోవడం విశేషం. వందల రూపాయలు వెచ్చించాల్సిన మందులు ఫ్రీగా అందుబాటులో ఉంటుండటంతో..గవర్నమెంట్ హాస్పిటలస్ కు పేషంట్లు పెరుగుతున్నట్టు సర్వేలో వెల్లడైంది.
ఐదు రాష్ట్రాల్లో భారీగా పెరుగుదల..
ఈ సర్వేను దేశంలో పంజాబ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్రలో నిర్వహించారు. ఈ ఐదు రాష్ట్రాల నుంచి మొత్తం తొమ్మిది జిల్లాలను ఎంపిక చేశారు. ఒక్కో రాష్ట్రం నుంచి రెండు జిల్లాలను ఎంపికచేసి, మహారాష్ట్ర నుంచి మాత్రం ఒక్క జిల్లానే ఎంపిక చేసి బేస్ లైన్, ఫాలో-అప్ పేరుతో రెండు స్టేజుల్లో ఇన్ఫర్మెషన్ సేకరించారు. బేస్ లైన్ (2018–2019) సర్వేలో బీపీ ఉండి చికిత్స తీసుకుంటున్న 2,873 మందిపై విశ్లేషణ చేశారు. ఫాలో-అప్ సర్వే (2023–-24) లో 3,276 మందిపై విశ్లేషణ చేశారు.
బేస్ లైన్ లో 20శాతం మంది ప్రభుత్వ హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటే ఫాలో-అప్ నాటికి ఆ సంఖ్య 32శాతానికి పెరిగింది. ప్రభుత్వ హాస్పిటళ్లలో బీపీ కంట్రోల్ లో ఉన్నవారి శాతం 37 శాతం నుంచి 48 శాతానికి పెరిగింది. ప్రభుత్వ హాస్పిటళ్లలో మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పిన వారి శాతం 72 శాతం నుంచి 81శాతానికి పెరగడం విశేషం. అలాగే, మందుల కోసం డబ్బులు చెల్లించాల్సి వస్తోందని చెప్పిన వారి శాతం 47 శాతం నుంచి భారీగా తగ్గి 9 శాతాకి చేరడం.. గవర్నమెంట్ హాస్పిటల్స్ పై పెరిగిన నమ్మకాన్ని స్పష్టంచేస్తుంది.

 
         
                     
                     
                    