ఒక్క నెలలో రూ.10 వేల కోట్ల అప్పు

ఒక్క నెలలో రూ.10 వేల కోట్ల అప్పు
  • ఆర్​బీఐ నుంచి వేలం ద్వారా రూ.8,500 కోట్లు తీసుకున్న సర్కారు
  •  ఇతర మార్గాల ద్వారా ఇంకో వెయ్యి కోట్ల పైనే
  • ఉద్యోగుల జీతభత్యాలు, రైతుబంధు, ఆసరా పెన్షన్లకు అప్పుల నుంచే నిధులు
  • సెక్రటేరియట్​ నిర్మాణానికి కూడా వీటి నుంచే!
  • అప్పులు లేకుంటే సంక్షేమం నడుసుడు కష్టమే.. అన్నింటికీ అప్పులు చేసి చెల్లించుడే
  • మూడు నెలల్లోనే రూ.16 వేల కోట్లు దాటిన అప్పులు

హైదరాబాద్, వెలుగు: ఈ ఒక్క నెలలోనే రాష్ట్ర సర్కార్​ దాదాపు రూ. పది వేల కోట్ల దాకా అప్పులు చేసింది. ఈ నెల ఒకటో తారీఖున వెయ్యి కోట్లతో మొదలై ఇప్పటిదాకా రూ. 8,500 కోట్ల లోన్లను బాండ్లు, సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్​బీఐ నుంచి పొందింది. ఫస్ట్ ​టైమ్​ ఈసారి ప్రతివారం ఆర్బీఐ ఆక్షన్​లో తెలంగాణ పాల్గొంది. ఇంకా ఇతర మార్గాలైన ఓవర్​ డ్రాఫ్ట్​ (ఓడీ)​, వేస్ అండ్​ మీన్స్​ (డబ్ల్యూఎంఎస్​) కింద కూడా ఆర్​బీఐ నుంచి మరో వెయ్యి కోట్లకు పైగా తీసుకుంది. గడిచిన రెండు నెలల్లో తీసుకున్న దానికంటే  రెట్టింపు స్థాయిలో ఈ ఒక్క నెలలోనే  సర్కారు అప్పులు చేసింది. సాధారణ టైంలో ఒక నెలలో ఎంత ఆదాయమైతే  వస్తుందో అంతకంటే ఎక్కువగా ఈ జూన్​లో  సర్కార్​ లోన్లు తీసుకుంది.తీసుకున్న అప్పుల నుంచి ఉద్యోగుల జీతభత్యాలకు, రైతుబంధుకు, ఆసరా పెన్షన్లకు, ఆఖరికి సెక్రటేరియేట్  నిర్మాణానికి కూడా చెల్లించింది. లాక్​డౌన్​ సాకుతో మరిన్ని అప్పులు చేసేందుకు రెడీ అవుతోంది. 

పథకాలకు సర్దేశారు

అప్పు చేయకుంటే సంక్షేమం ఆగిపోతదన్న పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణానికి, ఇతర క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్​ కోసమే లోన్లు తీసుకుంటున్నామని పదే పదే చెప్తున్న ప్రభుత్వం.. ఈ నెలలో తీసుకున్న అప్పులన్నింటినీ స్కీంకే ఖర్చు చేసింది. తీసుకున్న దాంట్లో దాదాపు రూ. 6 వేల కోట్లు రైతుబంధుకు ఇచ్చింది. జూన్​ కంటే ముందే ఇవ్వాల్సిన రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఈ నెల 15కు మార్చడం కూడా అందులో భాగమే. ఆర్బీఐ నుంచి ఈ నెల 8న తీసుకున్న రూ. 2,500 కోట్లు,  15న తీసుకున్న రూ. 3వేల కోట్లు, 22న తీసుకున్న వెయ్యి కోట్లను  రాష్ట్ర అకౌంట్​లో నుంచి  డిపార్ట్​మెంట్ కు, అక్కడి నుంచి రైతుల బ్యాంకు అకౌంట్లకు ఫేజ్ ల వారీగా పంపించింది. అంతకంటే ముందు ఈ నెల 1న తీసుకున్న వెయ్యి కోట్ల అప్పును ఉద్యోగుల జీతాలకు, ఈ నెల 29న తీసుకున్న ఇంకో రూ. వెయ్యి కోట్ల లోన్​ నుంచి ఆసరా పెన్షన్లకు చెల్లించింది. కొత్త సెక్రటేరియేట్​ నిర్మాణానికి కూడా ఈ అప్పుల నుంచే ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. సెక్రటేరియెట్​ పనులకు ప్రభుత్వం ఇటీవల రూ. 200 కోట్లు ఖర్చు చేసింది. అలాగే హుజూరాబాద్​ నియోజకవర్గంపై స్పెషల్​ ఫోకస్​ పెట్టిన సర్కార్​ అక్కడ అభివృద్ధి పనులకు కూడా అప్పులో నుంచే రూ. 40 కోట్లు ఇస్తోంది. ఎల్ఎమ్​డీ ప్రాజెక్టుకు రూ. 310 కోట్లు ఇచ్చింది. ఇట్లా ఈ మధ్య కాలంలో రిలీజ్​ చేసిన నిధులన్నీ అప్పుల ఖాతాలోనివే.

ఎఫ్​ఆర్బీఎం పరిమితి పెంచాలంటూ..

కరోనా, లాక్ డౌన్​ సాకుతో మరిన్ని అప్పులు తీసుకునేందుకు రాష్ట్ర సర్కార్​ రెడీ అవుతోంది. అందులో భాగంగానే అప్పుల పరిమితిని పెంచాలని జీఎస్టీ కౌన్సిల్​ మీటింగ్స్​లో కేంద్రాన్ని కోరతూ వస్తోంది. గతేడాది కరోనా, లాక్​డౌన్​ ఇబ్బందులతో కేంద్రం ఎఫ్​ఆర్బీఎం పరిధిని 5 శాతానికి పెంచింది. ఇప్పుడు నాలుగు శాతం కంటిన్యూ అవుతోంది. దీని ప్రకారం రూ. 49,300 కోట్ల అప్పులు  తీసుకోవచ్చు. ఇంకో ఒక్క శాతం పెరిగితే తీసుకునే అప్పు రూ. పదివేల కోట్లు పెరుగుతుంది. ఇప్పటికే ఏడేండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల మొత్తం ఇంచుమించు రూ. 4 లక్షల కోట్లకు చేరుకుంది. ఎఫ్ఆర్బీఎం చట్ట పరిధిలో చేసిన అప్పులు 2022 మార్చి నాటికి రూ. 2,86,804 కోట్లు. దీనికి తోడు ఇరిగేషన్  ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిట  రూ.1,05,006 కోట్ల రుణాలకు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది. వీటిని కూడా కలిపితే.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల అసలు లెక్క  రూ. 3,91,810 కోట్లు అని తేలుతోంది. 

మూడు నెలల్లో రూ.16 వేల కోట్లు దాటేసింది

ఈ ఆర్థిక సంవత్సరం  3 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ. 16 వేల కోట్ల అప్పులు చేసింది. వాస్తవానికి ఆర్బీఐ ఈ క్వార్టర్ ఇయర్​కు రిలీజ్​ చేసిన ప్లాన్​ ప్రకారం రూ. 8 వేల కోట్లే అప్పు తీసుకోవాలి. కానీ అంతకంటే డబుల్​ స్థాయిలో ప్రభుత్వం తీసుకుంది. మే నెల వరకు తీసుకున్న ఆర్బీఐ, ఇతర అప్పులు రూ. 6 వేల కోట్లు ఉంటే.. ఈ నెలలో తీసుకున్న అప్పుతో కలిపి అది దాదాపు రూ. 16 వేల కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం తీసుకోవాల్సిన లోన్లలో 32 శాతం ఇప్పటికే తీసుకుంది.