3 వేల ఎకరాలు వేలానికి రెడీ..అమ్మితే రూ.12వేల కోట్లు

3 వేల ఎకరాలు వేలానికి రెడీ..అమ్మితే రూ.12వేల కోట్లు


హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ భూముల అర్రాస్​ పాటకు అంతా రెడీ అయింది. హౌసింగ్​ శాఖ పరిధిలోని ల్యాండ్స్​  లెక్క తేలింది. శాఖ పరిధిలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 3 వేల ఎకరాల భూములతోపాటు  పలు బిల్డింగ్స్​ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 12 వేల కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు. హౌసింగ్​ ల్యాండ్స్​ డిటైల్డ్​ రిపోర్ట్​ను సీఎస్  సోమేశ్​ కుమార్  నేతృత్వంలోని స్టీరింగ్​ కమిటీకి సోమవారం హౌసింగ్​ శాఖ అధికారులు అందజేశారు. హౌసింగ్ డిపార్ట్ మెంట్ పరిధిలో హౌసింగ్ బోర్డ్ , హౌసింగ్ కార్పొరేషన్ , రాజీవ్ స్వగృహ, వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రాం, దక్కన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్  అండ్​ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ ( దిల్ ) ఉన్నాయి. ఈ ఐదింటి పరిధిలో 3 వేల ఎకరాల ల్యాండ్ తో పాటు పలు భవనాలు ఉన్నట్లు అధికారులు లెక్క తీశారు.  విడివిడిగా మీటింగ్ లు భూముల వేలం టైమ్ లో సీఎస్  నేతృత్వంలోని స్టీరింగ్​ కమిటీ హౌసింగ్ , హెచ్ ఎం డీ ఏ తో పాటు  ఇతర శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించనుంది. తమకు అందిన రిపోర్ట్ లో  సందేహాలు, ల్యాండ్ పై పలు వివరాలను సదరు శాఖ అధికారుల నుంచి కమిటీ తెలుసుకునే అవకాశం ఉంది. 

లీగల్​ సమస్యలు రాకుండా..!

హౌసింగ్ డిపార్ట్ మెంట్  ల్యాండ్స్ లో  కొన్నింటిపై కోర్టు కేసులు, స్టే లు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. వీటిని రానున్న రోజుల్లో క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. న్యాయ శాఖ, అడ్వకేట్​ జనరల్ కు వీటి వివరాలు అందించి, ఎలాంటి వివాదాలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ‘‘హౌసింగ్ శాఖ పరిధిలో ఉన్న ల్యాండ్స్‌, భవనాలపై సమగ్ర నివేదిక రెడీ చేసి సీఎస్ కమిటీ కి అందచేశాం. హౌసింగ్ ల్యాండ్ వేలం ద్వారా సుమారు రూ.8 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంది. కొవిడ్ , లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా సర్కార్ దగ్గర నిధులు కొరత ఏర్పడింది. భూముల వేలంపై ఆర్థిక మంత్రి హరీశ్​  ఇటీవల సమావేశాలు ఏర్పాటు చేశారు. కొన్ని ల్యాండ్స్ పై స్టేలు, కేసులు ఉన్నాయి. న్యాయశాఖ తో సమన్వయం చేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ వివాదాలను క్లియర్ చేసుకుంటాం’’ అని హౌసింగ్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. 

రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల ద్వారా రూ. 1,200 కోట్లు

రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను కూడా త్వరలో వేలం వేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. రాజీవ్ స్వగృహ కింద బండ్లగూడ, పోచారం, గాజులరామారం, జవహర్ నగర్​లో అపార్ట్ మెంట్లు ఉన్నాయి. 2017లో వీటిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. అది కుదరకపోవడంతో బహిరంగ వేలం వేయాలని నిర్ణయించింది.  ఈ అపార్ట్ మెంట్ల వేలం ద్వారా రూ. 1,200 కోట్ల ఆదాయం వస్తుందని ఓ ప్రైవేట్ ఏజెన్సీ లెక్క తేల్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.