ఇంజినీరింగ్ సీట్లపై సర్కార్ తర్జనభర్జన

ఇంజినీరింగ్ సీట్లపై సర్కార్ తర్జనభర్జన
  • ఈ నెల 4 నుంచి ఎప్ సెట్ అడ్మిషన్ల ప్రక్రియ 
  • ఇప్పటికీ ప్రైవేటు కాలేజీలు, సీట్లపై స్పష్టత కరువు 
  • ఈ ఏడాది 20 వేల సీట్ల పెంపునకు ఏఐసీటీఈ పర్మిషన్
  • మరోపక్క 9 వేల సీట్ల కన్వర్షన్​కూ మేనేజ్మెంట్ల విజ్ఞప్తులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల అఫిలియేషన్లు, సీట్లపై సర్కారు తర్జనభర్జన పడుతున్నది. ఈ నెల 4 నుంచి ఎప్​సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొన్నది. అయితే, ఈ ఏడాది కూడా ఆయా కాలేజీల్లో భారీగానే సీట్ల పెంపునకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) పర్మిషన్ ఇచ్చింది. వీటిలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నింటికి అనుమతి ఇస్తుందో త్వరలో తేలనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 159 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా.. వాటిలో 1.10 లక్షల వరకు సీట్లున్నాయి. ఈ ఏడాది కూడా ఏఐసీటీఈ దాదాపు అన్ని కాలేజీలకు గుర్తింపు ఇచ్చింది. మరోపక్క ఇప్పుడున్న సీట్లకు అదనంగా మరో 20 వేలకు పైగా సీట్ల పెంపునకు అనుమతిచ్చింది. ప్రస్తుతం 159 ఇంజినీరింగ్ కాలేజీల్లో 139 కాలేజీలూ జేఎన్టీయూ పరిధిలోనే ఉన్నాయి. ఏఐసీటీఈ నుంచి ఇప్పటి వరకు అనుమతులు వచ్చిన కాలేజీల వివరాలు, సీట్లు పెంపునకు వచ్చిన డీటెయిల్స్​ను ప్రభుత్వానికి ఆయా వర్సిటీలు పంపించాయి. అయితే, అఫిలియేషన్ల వరకు ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నా.. సీట్ల పెంపుపైనే తర్జన భర్జన పడుతున్నది.

సర్కార్​పై ఫీజు రీయింబర్స్​మెంట్ భారం

కొత్తగా 20 వేల సీట్లు వస్తే.. ఆ సీట్లలో చేరే విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ భారం సర్కారుపై పడనున్నది. దీంతో అనుమతి ఇవ్వాల్సి వస్తే.. ఆ సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో భర్తీ చేసే దాని గురించి ఆలోచన చేస్తున్నది. మరోపక్క ఇప్పుడున్న సీట్లలో 9 వేల సీట్లను కన్వర్షన్​కు పెట్టుకున్నాయి. దీంట్లో ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సులే ఉన్నాయి. ఇతర ఇంజినీరింగ్ రెగ్యులర్ కోర్సుల నుంచి సీఎస్ఈ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర వాటిలోకి సీట్లను కన్వర్షన్​కు పెట్టుకున్నారు. వీటిలోనూ ఎన్ని సీట్లకు కన్వర్షన్​కు పర్మిషన్ ఇస్తుందనే దానిపై సమాలోచనలు చేస్తున్నది. మరోపక్క కొత్త సీట్లకు అనుగుణంగా ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్ ఉన్నాయో..లేదో.. అనే వివరాలను సేకరించడానికి జేఎన్టీయూ ఐదుగురితో కూడిన కమిటీ వేసింది. ఆ కమిటీ వాటిని పరిశీలించి, ఇచ్చే నివేదిక ఆధారంగానే సీట్లపెంపు ఉండనున్నది. ఈ నెల 4 నుంచి ఎప్​సెట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నది. ఇప్పటికే జూన్ 27 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఇంజినీరింగ్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తిగాకపోవడంతో పాటు సీట్ల పెంపుపై 
స్పష్టత లేకపోవడంతో అడ్మిషన్ కౌన్సెలింగ్ ఈ నెల 4కు వాయిదా వేశారు. అయితే, ఇప్పుడైనా అనుకున్న సమయానికి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందా అనే అనుమానాలు 
వ్యక్తమవుతున్నాయి.