- రెసిడెన్షియల్ స్కూల్ యూనిఫాం ఆర్డర్ ఇచ్చిన సర్కారు
- 18 లక్షల మీటర్ల బట్ట కావాలన్న ప్రభుత్వం
- నేతన్నలతో పాటు, టెక్స్ టైల్ పార్క్ కార్మికులకూ ఆర్డర్లు
- ఉత్పత్తి తర్వాత నేతన్నల ఖాతాల్లోకి రూ.8.11కోట్లు
రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్య లు తీసుకుంటోంది. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడంతో తీవ్ర కష్టాల్లో ఉన్న సిరిసిల్ల నేతన్నలకు ఊరట లభించే పని చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్ స్టూడెంట్స్ కోసం యూనిఫాం ఆర్డర్ ఇచ్చిన సర్కారు ఇప్పుడు స్టేట్లోని రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల కోసం యూనిఫాం క్లాత్ ఉత్పత్తి చేయాలని కోరింది. 18 లక్షల మీటర్ల బట్ట కావాలని కోరడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు పని కల్పించినందుకు సర్కారుకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
రెండు నెలల పాటు పని
సిరిసిల్ల నేతన్నలకు రెసిడెన్సియల్ స్కూల్ యూని ఫాం ఆర్డర్లు ఇవ్వడంతో రెండు నెలల పాటు ఉపాధి లభించనుంది. ఇప్పటికే వస్త్ర పరిశ్రమ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్లతో ఉపశమనం లభించనుంది. సిరిసిల్ల పట్టణంలోని నేతన్నలకు 13 లక్షల బట్ట, తంగళ్లపల్లి టెక్స్ టైల్ పార్క్ చేనేత కార్మికులకు 5 లక్షల ఆర్డర్లు వచ్చాయి. దీంతో అటు టెక్స్ టైల్ పార్క్ , ఇటు సిరిసిల్ల పట్టణ నేత కార్మికులు సంబురపడుతున్నారు. వారం రోజుల్లో రెసిడెన్సియల్ స్టూడెంట్స్ క్లాత్ ఉత్పత్తి ప్రారంభించనున్నారు. సిరిసిల్లలోని122 మ్యాక్స్ సంఘాలు, 31 ఎస్ఎస్ఐ యూనిట్స్ ఆధ్వర్యంలో ఈ క్లాత్ ఉత్పత్తి జరగబోతోంది. ఒక్కో మీటర్ షర్టింగ్ క్లాత్ ఉత్పత్తి కోసం రూ. 41.50 ఇవ్వనున్నారు. 39 ఇంచుల పన్నా పొడువుతో షర్ట్ఉత్పత్తి చేయనున్నారు. ప్రొడక్షన్ తర్వాత 18లక్షల మీటర్ల బట్టకు రూ.8.11కోట్లు నేతన్నల ఖాతాల్లో జమ కానున్నాయి.
ఫిబ్రవరిలో 65 లక్షల మీటర్ల యూనిఫాం ఆర్డర్
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే గత
ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్ స్టూడెంట్స్ కోసం 65 లక్షల మీటర్ల స్కూల్ యూనిఫాం ఆర్డర్ ఇచ్చి నేతన్నలకు ఉపాధి కల్పించింది. నాలుగు నెలల పని కల్పించి ఉపాధి చూపించింది. తాజాగా వచ్చిన సంక్షేమ హాస్టల్స్ యూనిఫాం ఆర్డర్లతో మరో రెండు నెలల పాటు పని దొరకడంతో నేతన్నల్లో హర్షం వ్యక్తం మవుతోంది. ఇప్పటికే సిరిసిల్లలో తయారైన స్కూల్ యూనిఫాం వస్త్రాన్ని టెస్కో కొనుగోలు చేసి గత నెల అన్ని పాఠశాలలకు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
నేతన్నలతో విప్ ఆది శ్రీనివాస్ సమావేశం
సిరిసిల్ల నేతన్నలతో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రెండు రోజుల కింద ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై చర్చించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి రూ. 350 కోట్లు బకాయిలు చెల్లించక పోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను గాడిలో పెట్టేందుకు, నేతన్నలకు ఏడాదంతా పని కల్పించేందుకు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చర్చలు జరిపారు. త్వరలోనే తమిళనాడు తరహాలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఆది శ్రీనివాస్ చెప్పారు.
రెసిడెన్షియల్ ఆర్డర్లు వచ్చాయి
సిరిసిల్ల నేతన్నలకు సంక్షేమ హాస్టల్ విద్యార్థుల యూనిఫాం ఆర్డర్లు వచ్చాయి. వారం రోజుల్లో దీనికి సంబంధించి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఇప్పటికే గత నెల స్కూల్ యూనిఫాం ఆర్డర్ పూర్తి చేశాం. ప్రస్తుతం18లక్షల మీటర్ల రెసిడెన్షియల్ స్టూడెంట్స్ యూనిఫాం క్లాత్ ఉత్పత్తితో నేతన్నలకు ఉపాధి లభిస్తోంది.
- సాగర్, చేనేత జౌళీ శాఖ ఏడీ, సిరిసిల్ల
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను గాడిలో పెడతాం
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నాం. సిరిసిల్ల నేతన్నలు అధైర్యపడొద్దు. సిరిసిల్ల నేతన్నల కోసం ఏడాదెల్లా పని కల్పించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నాం. గత సర్కార్ నిర్వాకంతో బతుకమ్మ చీరెల బకాయిలు విడుదల చేయకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. బీఆర్ఎస్ సర్కార్ బతుకమ్మ చీరెల బకాయిలు రూ. 300 కోట్లు పెండింగ్ పడితే మా సర్కార్ వచ్చిన తర్వాత 150 కోట్లు రిలీజ్ చేశాం. మిగితా బకాయిలను విడుతల వారీగా రిలీజ్ చేయబోతున్నాం. సిరిసిల్ల నేతన్నలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. త్వరలోనే చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎం రేవంత్ రెడ్డి లతో సిరిసిల్ల యువ నేతన్నలతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం.
- ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్