బ్లాక్​ స్పాట్స్ వద్ద అంబులెన్సులు.. అన్ని హైవేలపై అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం

బ్లాక్​ స్పాట్స్ వద్ద అంబులెన్సులు.. అన్ని హైవేలపై అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం
  • రోడ్డు ప్రమాద బాధితులను ఇన్ టైంలో ట్రామాకేర్ సెంటర్​కు తరలించేలా ఏర్పాట్లు
  • 35 కిలోమీటర్లకు ఒక సెంటర్
  • బాధితులకు గోల్డెన్ అవర్​లో చికిత్స అందించడమే ధ్యేయం

హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్య సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 73 ట్రామాకేర్  సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా హైవేలపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే  బ్లాక్ స్పాట్స్  వద్ద అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని డిసైడ్  అయింది. దీంతో ప్రమాదాల్లో గాయపడిన వారిని సమీప ట్రామాకేర్  సెంటర్లకు వేగంగా తరలించి, సకాలంలో చికిత్స అందించచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో రోడ్  యాక్సిడెంట్స్  విపరీతంగా పెరిగిపోతున్నాయి. బాధితులకు చికిత్స అందించాలంటే కొన్నిసార్లు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

 గోల్డెన్  అవర్ లో చికిత్స అందక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో హైవేలలో ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్  సెంటర్  ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పుడు బ్లాక్  స్పాట్స్ వద్ద అంబులెన్సులు పెట్టి, సకాలంలో చికిత్స అందించాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. 

73 ట్రామాకేర్  సెంటర్ల ఏర్పాటు

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో చికిత్స అందించేలా రాష్ట్రవ్యాప్తంగా73 ట్రామాకేర్  సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఇందుకోసం మ్యాపింగ్  ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ ట్రామాకేర్  సెంటర్లకు ‘తెలంగాణ లైఫ్‌‌‌‌లైన్  ఫర్  మెడికల్ ఎమర్జెన్సీ (టెల్‌‌‌‌మీ)’  ‘తెలంగాణ హైవే యాక్సిడెంట్  లైఫ్‌‌‌‌లైన్  ఇనీషియేటివ్ (తల్లి)’ పేర్లలో ఒకటి ఖరారు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ట్రామాకేర్  సెంటర్ల ఏర్పాటును మూడు దశల్లో పూర్తి చేయాలని ప్లాన్  చేసింది. మొదటి, రెండో దశల్లో 24 సెంటర్లు, మూడో దశలో 25 సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఒక్కో సెంటర్‌‌‌‌లో సుమారు 72 మంది డాక్టర్లు, సిబ్బంది పనిచేయనున్నారు. 

ఈ సెంటర్లలో అత్యవసర వైద్య సేవలతో పాటు, రిహాబిలిటేషన్  సౌకర్యాలను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ చర్యలతో ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు  చెబుతున్నారు.

ఇన్ టైమ్​లో వైద్య సేవలు అందేలా  

ప్రమాద బాధితులను అంబులెన్సుల ద్వారా ట్రామాకేర్ సెంటర్లకు తరలించే సమయంలో పేషెంట్  హెల్త్  కండిషన్, అంబులెన్స్ హాస్పిటల్ కు చేరే సమయం వంటి వివరాలను ముందుగా తెలియజేసేందుకు టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేసి, జీపీఎస్  సాయంతో అంబులెన్స్ లు ఎక్కడిదాకా వచ్చాయి, హాస్పిటల్ కు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలిసేలా స్క్రీన్​పై సమయాన్ని ప్రదర్శించనున్నారు. 

అంబులెన్స్‌‌‌‌లోని వైద్య సిబ్బంది పేషెంట్ కండిషన్ ను ఆ స్క్రీన్‌‌‌‌ల ద్వారా అప్‌‌‌‌డేట్  చేస్తారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది ముందుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు, సంబంధిత డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఒక్కో ట్రామాకేర్  సెంటర్ కు ఒక అంబులెన్స్ ను కొనుగోలు చేయనున్నారు. ఈఎంఆర్ఐ 108 అంబులెన్స్ ల సహకారం కూడా తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.