కొత్త చట్టం : తహసీల్దార్ల అధికారాల్లో కోత!

కొత్త చట్టం : తహసీల్దార్ల అధికారాల్లో కోత!
  • నాలా చార్జీల వసూలు ఎంపీడీవోలకు.. ‘అగ్రి’ పనులు వ్యవసాయ శాఖకు
  • రేషన్‌‌‌‌ కార్డుల జారీ, బియ్యం పంపిణీ సివిల్‌‌‌‌ సప్లైస్‌‌‌‌కు
  • వ్యవసాయ శాఖలో వీఆర్వో, వీఆర్‌‌‌‌ఏల విలీనంపై చర్చ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కొత్త రెవెన్యూ యాక్ట్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ సిద్ధమైంది. రెవెన్యూ అధికారుల పవర్స్‌‌‌‌‌‌‌‌లో కోత పెట్టేలా చట్టం తీసుకొస్తున్నట్టు తెలిసింది. తహసీల్దార్ల అధికారాలను సగం వరకు కట్‌‌‌‌‌‌‌‌ చేయనున్నట్టు సమాచారం. అలాగే కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగులను వేరే శాఖలకు అలాట్‌‌‌‌‌‌‌‌ చేయాలని, వాళ్లకు కొత్త పనులు అప్పగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. కొత్త రెవెన్యూ పాలసీపై నల్సార్ లా వర్సిటీ ప్రొఫెసర్లు, రెవెన్యూ రిటైర్డ్ ఆఫీసర్లతో ఏడాదిగా సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కసరత్తు చేశారు. గత 150 చట్టాల్లోని అవసరమైన వాటిని తీసుకుని కొన్ని మార్పులతో కొత్త  డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.

పని భారం తగ్గించాలని

మండల స్థాయిలో ప్రభుత్వ స్కీమ్‌‌‌‌‌‌‌‌లకు లబ్ధిదారుల ఎంపిక, వివిధ రకాల సర్టిఫికెట్ల మంజూరులో తహసీల్దార్లే కీలకం. రేషన్ కార్డుల మంజూరు, కల్యాణలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక, ల్యాండ్ మ్యుటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌, క్యాస్ట్, ఫ్యామిలీ మెంబర్, ల్యాండ్ కన్వర్జేషన్ సర్టిఫికెట్ల జారీ లాంటి 53 రకాల అధికారాలు వీళ్ల దగ్గరే ఉన్నాయి. అయితే కొత్త రెవెన్యూ యాక్ట్‌‌‌‌‌‌‌‌ ద్వారా తహసీల్దార్లకు కొన్ని రకాల సర్టిఫికెట్ల జారీ, ప్రొటోకాల్ బాధ్యతలనే పరిమితం చేసి పని భారం తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

అగ్రికల్చర్ ల్యాండ్‌ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్‌గా మార్చడంలో తహసీల్దార్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలున్నాయి. అందుకే నాలా చార్జీల వసూలు, ల్యాండ్ కన్వర్జేషన్ అధికారాలు ఇకపై ఎంపీడీఓలకు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. రేషన్ కార్డుల జారీ, రేషన్ సరుకుల పంపిణీలో తహసీల్దార్లు, డీటీల ప్రమేయం లేకుండా పూర్తిగా సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్‌కే అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. రైతు బంధు, రైతు బీమా అమలు, అగ్రికల్చర్ ఇన్‌కమ్‌ సర్టిఫికెట్, అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూ అసెస్‌మెంట్, వ్యవసాయ భూముల్లో బోర్‌ వెల్స్ కు పర్మిషన్‌తో పాటు త్వరలో అమలు చేయనున్న షరుతుల సాగు అమలు బాధ్యతను రెవెన్యూ శాఖతో ప్రమేయం లేకుండా వ్యవసాయ శాఖకే అప్పగించనున్నట్లు తెలిసింది.

వీఆర్వోలు, వీఆర్‌ఏలకు కొత్త బాధ్యతలు

ఇప్పటికే 9‌‌0 శాతం భూ రికార్డులను ఆన్​లైన్ చేసినందున ఇకపై వీఆర్వోల ప్రమేయం లేకుండానే భూముల మ్యుటేషన్ జరిగిపోనుంది. అందుకే వీఆర్వోలను భూ రికార్డుల నిర్వహణ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు వ్యవసాయ శాఖ విధులను పెంచుతున్నందున ఆ శాఖకు అదనపు సిబ్బంది అవసరమనే చర్చ జరుగుతోంది. దీంతో క్షేత్ర స్థాయిలో వీఆర్వోలు, వీఆర్‌ఏలను వ్యవసాయ శాఖలో విలీనం చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.

మున్సిపల్‌ చట్టంతో పాటే పెడ్దమనుకున్నరు

రెవెన్యూ శాఖ అవినీతికి కేరాఫ్‌గా మారిందని.. అవినీతి, భూ వివాదాలకు తావులేని కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్  ఇప్పటికే  చాలాసార్లు ప్రకటించారు. మున్సిపల్‌ చట్టంతో పాటే కొత్త రెవెన్యూ పాలసీనీ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని తొలుత అనుకున్నారు. కానీ ఆ బిల్లుకు తుదిరూపు రాకపోవడం, కొద్ది రోజుల్లోనే మున్సిపల్‌ ఎన్నికలుండటంతో ముందు మున్సిపల్‌ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ చట్టంపై చర్చ టైమ్‌లోనే రెవెన్యూ శాఖలో వీఆర్వోల అక్రమాలపై కేసీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వీఆర్వోలకున్న పవర్స్‌ స్పీకర్‌, సీఎస్‌, సీసీఎల్‌ఏకు కూడా లేవని.. వాళ్లు జనాన్ని హరాస్‌ చేస్తున్నారని సీఎం కాస్త కటువుగానే మాట్లాడారు.

రాష్ట్రంలో 100 దాటిన కరోనా మరణాలు