
- జిల్లాలవారీగా పిలవనున్న టెండర్లు
- ఏటా అంగన్ వాడీలకు 37 కోట్ల గుడ్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీలకు సరఫరా చేసే గుడ్ల విషయంలో గతంలో రద్దు చేసిన పాత విధానానికే సర్కారు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 10 ఉమ్మడి జిల్లాలను 7 జోన్లుగా డివైడ్ చేసి టెండర్లు పిలుస్తుండగా, ఈ ఏడాది జిల్లాల వారీగా టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు సమాచారం. జిల్లాల వారీగా గుడ్ల సరఫరాలో గతంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి.
గుడ్లను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తరలించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. 2022కి ముందు కోడిగుడ్ల పంపిణీలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. కేంద్రీకృత వ్యవస్థ లేకపోవడం, జిల్లాల వారీగా కలెక్టర్ అధ్యక్షతన ఉండే డిస్ట్రిక్ట్ పర్చేసింగ్ కమిటీల ద్వారా టెండర్లు పిలవడం వల్ల సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది. ఈ అక్రమాలను అరికట్టేందుకు 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తమిళనాడు తరహా కేంద్రీకృత టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
ఐదుగురు ఐఏఎస్ అధికారులు తమిళనాడుకు వెళ్లి స్టడీ చేశారు. పది ఉమ్మడి జిల్లాల్ని శాస్త్రీయంగా ఏడు జోన్లుగా విభజించి, ఒక్కో జోనుకు ప్రత్యేకంగా టెండర్లు పిలవడం ప్రారంభించారు. మహిళా శిశుసంక్షేమ శాఖ దీనికి బాధ్యత వహించింది. ఈ విధానం వల్ల గుడ్ల నాణ్యత మెరుగుపడింది. కాగా.. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా టెండర్ల గడువు గత నెల 26 తో ముగిసిందని రాష్ట్ర మహిళ, శిశుసంక్షేమ శాఖ అధికారులు ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ టెండర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ లోని ఓ జోన్ లో గుడ్లు సరఫరా చేస్తున్న ఓ కాంట్రాక్టర్ పై పెద్ద ఎత్తున అధికారులు ఫిర్యాదు చేశారు. గుడ్లు సరఫరా చేయకుండా ఆ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టామని అధికారులు చెబుతున్నారు.
ఏటా 37 కోట్ల గుడ్ల సరఫరా
రాష్ర్టంలో 37 వేల అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా ఏటా 37 కోట్ల గుడ్లు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నారు. చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు రోజుకో గుడ్డు పంపిణీ చేస్తారు. సగటున రోజూ 10 లక్షల గుడ్లు ఉడకబెట్టి 37 వేల అంగన్ వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్నారు. లబ్ధిదారుల్లో పోషకాహార లోపం లేకుండా కోడిగుడ్లను సరఫరా చేస్తున్నారు.
కాంట్రాక్టర్ గుడ్లను సరిగా సరఫరా చేయకపోయినా, గుడ్లలో నాణ్యత లోపించినా సదరు కాంట్రాక్టర్ పై మహిళా స్ర్తీశిశు సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకుని అవకాశం ఉంటుంది. ఫుడ్ గ్యాప్ లేకుండా మరొక కాంట్రాక్టర్ ద్వారా గుడ్లను సరఫరా చేయించవచ్చు. గతంలో ఇదే జరిగింది. కానీ, జిల్లాల వారీగా గుడ్లను సరఫరా చేసే క్రమంలో ఏమైనా సమస్యలు తలెత్తితే ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఎందుకంటే జిల్లా స్థాయి అధికారులను శాసించే స్థాయిలో సప్లయర్లు, పౌల్ర్టీ వ్యాపారులు ఉంటారు కాబట్టి వారి మీద చర్యలు తీసుకునేందుకు జిల్లా అధికారులు వెనకాడుతుంటారు. అదే రాష్ట్రస్థాయి అధికారులైతే ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా కఠిన చర్యలు తీసుకుంటారని పలువురు చెబుతున్నారు.