ప్రతి పిల్లోడు డాక్టర్,ఇంజినీర్ కాలేడు ..ఇతర కోర్సుల కోచింగ్ పై కౌన్సిలింగ్

ప్రతి పిల్లోడు డాక్టర్,ఇంజినీర్ కాలేడు ..ఇతర కోర్సుల కోచింగ్ పై కౌన్సిలింగ్

ఇకపై స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో ‘టాపర్స్ బ్యాచ్’.. ‘డల్ బ్యాచ్’ అంటూ స్టూడెంట్లను వేరు చేసి చూపే పరిస్థితి మారనుంది. మార్కుల ఆధారంగా విద్యార్థులను గ్రేడింగ్ చేసి, వారి మధ్య అంతరాలు సృష్టిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల ‘సెక్షన్ల దందా’కు సర్కార్ చెక్ పెట్టింది. చదువులో వెనుకబడ్డారని వేరే సెక్షన్లకు మార్చడం, టార్గెట్లు రీచ్ కాలేదని అందరి ముందు అవమానించడం లాంటివి చేసినా క్రిమినల్​చర్యలు తప్పవని హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది

కోచింగ్ హబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై స్పెషల్ ఫోకస్

హైదరాబాద్ లాంటి మహా నగరాలకు కోచింగ్ కోసం వస్తున్న వేలాది మంది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పోటీ పరీక్షల కోసం వచ్చే పిల్లలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నందున.. అక్కడ నిరంతరం కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించింది. చదువు ఒత్తిడిని తగ్గించేలా అకడమిక్ ప్లానింగ్ ఉండాలని, దీనిపై ప్రత్యేకంగా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. కోచింగ్ సెంటర్లు, కాలేజీలు పిల్లలకు, తల్లిదండ్రులకు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కెరీర్ కౌన్సెలింగ్ ఇవ్వాలని వెల్లడించారు. అందరూ డాక్టర్లు, ఇంజినీర్లు కాలేరు కాబట్టి.. పిల్లల ఆసక్తిని బట్టి ఇతర మంచి కోర్సులు, అవకాశాల గురించి వివరించాలని, కేవలం ఒకే రకమైన చదువు గొప్పది అనే భావన కలిగించకూడదని వివరించారు. పేరెంట్స్.. పిల్లలపై అనవసరమైన ఒత్తిడి పెంచవద్దని, వారి ఇష్టాయిష్టాలను గౌరవించాలని పేర్కొన్నారు.

 కలెక్టర్లకే పవర్..

ఈ నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయో లేదో చూసేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో మానిటరింగ్ కమిటీ ఉంటుంది. వీరు స్కూళ్లు, కాలేజీలను ఆకస్మికంగా తనిఖీ చేసి, ఫిర్యాదులు స్వీకరిస్తారు. రూల్స్ పాటించని వారిపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ 'ఉమ్మీద్', 'మనోదర్పణ్', 'నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్' పథకాల నుంచి సూచనలు తీసుకుని ప్రతి కాలేజీ సొంతంగా 'మెంటల్ హెల్త్ పాలసీ'ని తయారు చేసుకోవాలి. దాన్ని వెబ్ సైట్ లో పెట్టాలి. టెలి-మానస్ వంటి హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ నెంబర్లు క్లాస్ రూమ్ గోడలపై పెద్దగా కనిపించేలా రాయించాలి. ఆత్మహత్యల నివారణకు విద్యాసంస్థలు.. లోకల్ హాస్పిటల్స్ తో లింక్ అప్ ఉండాలని సూచించారు.