ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత ఆర్డినెన్స్ సిద్ధం.. గవర్నర్ ఆమోదించగానే ఇంప్లిమెంట్..!

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత ఆర్డినెన్స్ సిద్ధం.. గవర్నర్ ఆమోదించగానే ఇంప్లిమెంట్..!

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే ఆర్డినెన్స్‎ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఫైల్‎పై సంతకం చేసి సీఎంకు పంపించారు. ఇవాళ లేదా రేపు ఈ ఫైల్‎పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ మేరకు లోకల్ బాడీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనకు రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేయనుంది. ఆర్డినెన్స్ విడుదల తర్వాత ఆమోదం కోసం గవర్నర్‎కు పంపనుంది ప్రభుత్వం. గవర్నర్ ఆమోదం తెలపగానే ఆర్డినెన్స్‎ను ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయనుంది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ ఇటీవల రేవంత్ రెడ్డి కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

కాగా, 1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 1994 తర్వాత మూడో సంతానం కలిగితే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇద్దరు పిల్లల నిబంధనను టచ్ చేయలేదు. 

పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారు అనర్హులు. అయితే.. ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి. గతేడాది డిసెంబర్ 20న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన రాగా మంత్రి వర్గం ఆమోదించలేదు. 

►ALSO READ | Weather: బంగాళాఖాతంలో వాయుగుండం!.. నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ పొరుగు రాష్ట్రం ఏపీలో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లులన్న వారు పోటీకి అనర్హులనే నిబంధనను ఎత్తేశారు. దీంతో తెలంగాణలో కూడా ఈ నిబంధనను సవరించాలని డిమాండ్లు పెరిగాయి. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు నిబంధనను ఎత్తివేస్తూ తెలంగాణ కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది.