ఓల్డ్ సిటీ మెట్రోకు రూ.125 కోట్లు విడుదల

ఓల్డ్ సిటీ మెట్రోకు రూ.125 కోట్లు విడుదల
  • 2025- 26 బడ్జెట్ నుంచి నిధులు మంజూరు
  • ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: ఓల్డ్  సిటీ మెట్రో కనెక్టివిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లను విడుదల చేసింది. 2025–-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్  నుంచి  కేటాయింపులు చేస్తూ ఈ నిధులను రిలీజ్  చేసింది. ఈ మేరకు మున్సిపల్  అడ్మినిస్ట్రేషన్  అండ్  అర్బన్  డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ (ఎంఏ అండ్ యూడీ) డిపార్ట్ మెంట్  సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘మెట్రో కనెక్టివిటీ టు ఓల్డ్ సిటీ స్కీమ్’ కింద 2025–-26 ఏడాదికి మొత్తం రూ.500 కోట్లు బడ్జెట్  ప్రొవిజన్ ఉండగా.. ఇందులో నుంచి తాజాగా రూ.125 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం విడుదలైన నిధులతో పనులు మరింత వేగవంతం కానున్నాయి. 

ఇంకా ఈ స్కీమ్  కింద రూ. 250 కోట్ల బ్యాలెన్స్  అందుబాటులో ఉందని అధికారులు వెల్లడించారు. ప్రతి నెలా ఖర్చుల వివరాలు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను ప్రభుత్వానికి అందజేయాలని ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్ట్  మెట్రో ఎండీని ఆదేశిస్తూ ఎంఏ అండ్ యూడీ స్పెషల్  చీఫ్  సెక్రటరీ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. ఎంజీబీఎస్  నుంచి చాంద్రాయణగుట్ట వరకు  ఓల్డ్  సిటీ మెట్రో నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దీనిని గ్రీన్ లైన్ కారిడార్2 లో 7.5 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు భూసేకరణ పూర్తి కావొచ్చింది. నిధుల కొరత లేకుండా చూస్తూ, ప్రాజెక్టును త్వరగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.