- ఈ నెల 16 నుంచి వచ్చే నెల 13 వరకు ఆషాఢ బోనాలు
- వేడుకలు సక్సెస్ ఫుల్‌గా నిర్వహిస్తామన్న మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 13 వరకు గోల్కొండ నుంచి లాల్ దర్వాజ వరకు బోనాల వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల కోసం మొత్తం 3,427 దేవాలయాలకు 15 కోట్ల 5 లక్షల 41 వేల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేపట్టినట్టు హైదరాబాద్జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నెల 16న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాలు ప్రారంభం అవుతాయన్నారు. 20 నుంచి 22 వరకు బల్కంపేటలో.. 21న అమ్మవారి కల్యాణం, 22న రథోత్సవం అత్యంత వైభవంగా సాగనున్నాయని తెలిపారు. ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, 3న రంగం కార్యక్రమం, 9న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలతో పాటు సిటీలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు చేసినట్టు మంత్రి పొన్నం పేర్కొన్నారు. సిటీలోని 30 ప్రధాన ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, ఇతర ముఖ్య నేతలు, అధికారులు సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్టు తెలిపారు. బోనాల ఉత్సవాల అనంతరం ఫలహారం బండ్ల ఊరేగింపు ఉంటుందన్నారు.
