అక్కెర తీరింది.. ఇక వెళ్లిపోండి.. హెల్త్​ స్టాఫ్​ను తొలగిస్తున్న సర్కారు

అక్కెర తీరింది.. ఇక వెళ్లిపోండి.. హెల్త్​ స్టాఫ్​ను తొలగిస్తున్న సర్కారు

కరోనా టైంలో తీసుకున్న హెల్త్​ స్టాఫ్​ను తొలగిస్తున్న సర్కారు

పలు జిల్లాల్లో ఇంటికి పంపుతున్న ఆఫీసర్లు

ఇది అన్యాయమంటూ బాధితుల ఆందోళన

కరీంనగర్ , వెలుగు: కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటుచేసిన కోవిడ్​సెంటర్లలో ట్రీట్​మెంట్​అందించేందుకు ఔట్​సోర్సింగ్​కింద తీసుకున్న మెడికల్​ స్టాఫ్​ను సర్కారు ఇంటికి పంపించేస్తోంది. కరోనా పీక్​టైంలో ప్రాణాలకు తెగించి పేషెంట్లకు సేవలందించిన  స్టాఫ్​ నర్సులు, ల్యాబ్​టెక్నీషియన్లు, వార్డుబాయ్​లను బలవంతంగా వెళ్లగొడుతోంది. ‘గంగలో ఓడ మల్లన్న.. గట్టెక్కినంక బోడి మల్లన్న’ అన్నట్లుగా మీ సేవలు ఇక అక్కర్లేదు అంటోంది. ఇటీవలే యాదాద్రి జిల్లాలో  30 మంది ఔట్​సోర్సింగ్​ స్టాఫ్​ను తొలగించగా, తాజాగా కరీంనగర్​లో 42మందికి జనవరి 1 నుంచి రానక్కర్లేదని ఆఫీసర్లు చెప్పడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

కరోనా కట్టడి కోసం తీసుకున్నరు..

కరోనాతో అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్న ఏప్రిల్​, మే నెలల్లో ప్రభుత్వం కోవిడ్​ పేషెంట్లకు ట్రీట్​మెంట్​అందించేందుకు కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ విధానంలో హెల్త్​ స్టాఫ్​ను రిక్రూట్​ చేసుకుంది. స్టేట్​వైడ్​ఉన్న టీచింగ్​ హాస్పిటల్స్​లో1600 స్టాఫ్​నర్స్​,ల్యాబ్​టెక్నీషియన్​, వార్డుబాయ్​ లాంటి పోస్టులకు నోటిఫికేషన్​ వేసి, రిక్రూట్​చేసుకుంది. ఇవిగాక జిల్లాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్​ వార్డుల కోసం ఎక్కడిక్కడ వందల మందిని నియమించారు.  కరోనా వచ్చిన పేషెంట్లను కుటుంబసభ్యులు సైతం తాకేందుకు ముందుకురాని పరిస్థితుల్లో వీళ్లంతా ప్రాణాలకు తెగించి మరీ కోవిడ్​ వార్డుల్లో సేవలందించారు. పీపీఈ కిట్లు తొడుక్కొని దినమొక గండంగా గడిపారు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో పనిచేసిన తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్​ చేస్తుందని ఆశించారు. కానీ కరోనా కేసులు ఇంకా నమోదవుతున్న దశలోనే ఔట్​సోర్సింగ్​ స్టాఫ్​ను తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి.

బడ్జెట్‍ లేదని  పొమ్మంటున్నరు..

కరోనా పీక్​స్టేజీలో ఉండి, కరీంనగర్​ జిల్లాలో పదుల సంఖ్యలో జనం చనిపోతున్న టైంలో జిల్లా ఆసుపత్రిలోని కోవిడ్​వార్డులో సేవలందించేందుకు ‘కరీంనగర్ వారధి సొసైటీ’ ద్వారా 42మంది స్టాఫ్‍ నర్సులు, ల్యాబ్‍ టెక్నీషియన్లను నియమించారు. వీరంతా ఇంతకాలం ప్రాణాలకు తెగించి పీపీఈ కిట్లతో  కరోనా స్పెషల్​వార్డులో సేవలు అందించారు. వీరిలో 27మంది  స్టాఫ్‍ నర్సులకు రూ. 18500, 15మంది ల్యాబ్‍టెక్నీషియన్లకు రూ. 15వేల చొప్పున వేతనాలు ఇచ్చారు. తమకూ, తమ కుటుంబసభ్యుల ప్రాణాలకు రిస్క్​ ఉందని  తెలిసినప్పటికీ భవిష్యత్​లో పర్మినెంట్ చేస్తారనే ఆశతో క్రమం తప్పకుండా డ్యూటీ చేశారు. జూన్ నుంచి డిసెంబర్  దాకా కలెక్టర్‍ స్పెషల్​ఫండ్​ నుంచే వీళ్లకు సాలరీస్​ ఇచ్చారు. తీరా ఇప్పుడు బడ్జెట్‍ చాలడం లేదంటూ తొలగిస్తున్నారు. మొదటివిడతలో 15మందిని  విధుల్లో నుంచి తొలగిస్తూ ఇటీవలే ఆర్డర్స్​ ఇచ్చారు. జనవరి నుంచి మిగతావారు రానక్కర్లేదని చెబుతున్నారు. దీంతో ఇన్ని రోజులు ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందించిన వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఈ క్రమంలో తొలగించిన సిబ్బందిలో కొందరు మంగళవారం సివిల్ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.  ఏ ఒక్కరోజూ ఎమర్జెన్సీ వార్డులో పనిచేయని ప్రభుత్వ ఉద్యోగులకు లక్షలకు లక్షలు జీతాలు, కరోనా అలవెన్సులు కూడా  ఇచ్చారని, తమకు మాత్రం ఎలాంటి అలవెన్స్​లు ఇవ్వకుండా అక్కర తీరాక అన్యాయంగా బయటకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా ఇంకా కంట్రోల్​కానందున, జనవరి నుంచి వాక్సినేషన్​వేసే కార్యక్రమం ఉన్నందున తమను కొనసాగించాలని, రెగ్యులర్​ చేయాలని హెల్త్​ స్టాఫ్​ కోరుతున్నారు.

నడిమిట్ల ముంచిన్రు

కరోనా విజృంభించి, అందరూ భయపడుతున్న టైంలో మేము కోవిడ్​ పేషెంట్లకు సేవ చేయడానికి వచ్చినం. ఒక్క రోజైనా  సెలవు ఇవ్వకుండా కరోనా వార్డులో సేవలు చేయించుకున్నరు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టిందని ఇంటికి పొమ్మంటున్నరు. ఇది న్యాయమేనా? మేము బయట ఎన్ని ఆఫర్లు ఉన్నా.. గవర్నమెంట్ సెక్టార్​ లో చేస్తే భవిష్యత్ ఉంటుందని భావించి వచ్చినం. గిట్ల నడిమిట్ల ముంచుతరని అనుకోలేదు. –బిందు, స్టాఫ్ నర్స్

ఖాళీ పోస్టుల్లో చాన్స్​ ఇవ్వాలె

కరోనా తగ్గింది మీతో అవసరం లేదని పొమ్మంటున్నరు.  సివిల్ ఆస్పిటల్ లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో మాకు అవకాశం ఇవ్వాలి. ఆరేడు నెలలు పనిచేయించుకుని ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోవాలి. ఇక్కడ జాబ్ ఉంటదని కుటుంబంతో సహా వచ్చాం. ఇప్పుడు ఉద్యోగం లేదంటే రోడ్డు మీద పడల్నా..?  ప్రభుత్వం ఇప్పటికైనా మా గురించి ఆలోచించాలి.  –వరలక్ష్మీ, స్టాఫ్ నర్స్

For More News..

ఆసుపత్రి బిల్లులు లక్షల్లో.. సీఎం రిలీఫ్ మాత్రం వేలల్లో..

ప్లాట్ అమ్మాలన్నా.. కొనాలన్నా పిటిఐన్ ఉండాల్సిందే

సీక్రెట్​ ఆపరేషన్​తో చైనా సైన్యానికి షాక్