రూ.10 వేల కోట్ల రుణాలు రీషెడ్యూల్.!..ప్రభుత్వానికి ఏటా రూ.510 కోట్లు మిగులు

రూ.10 వేల కోట్ల రుణాలు రీషెడ్యూల్.!..ప్రభుత్వానికి ఏటా రూ.510 కోట్లు మిగులు
  • ప్రభుత్వానికి ఏటా రూ.510 కోట్లు మిగులు
  • పదేండ్లలో రూ.5,500 కోట్ల దాకా ఆదా 
  • రూ.50 వేల కోట్లకు రీషెడ్యూల్ అడిగితే 
  • రూ.10 వేల కోట్లతో సరిపెట్టిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్ సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ)ల నుంచి తీసుకున్న అప్పులలో సుమారు రూ.10 వేల కోట్లు రీషెడ్యూల్ అయినట్లు తెలిసింది. ఈ రీషెడ్యూల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ.550 కోట్ల వడ్డీ భారం తగ్గుతుందని అంచనా. దీర్ఘకాలంలో అంటే పదేళ్ల వ్యవధిలో రాష్ట్ర ఖజానాకు రూ.5,500 కోట్ల దాకా ఆదా కానుంది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.50 వేల కోట్ల రుణాలను రీషెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని కోరగా, ప్రస్తుతం రూ.10 వేల కోట్లతో సరిపెట్టినట్లు సమాచారం. 

ఇది కూడా గడిచిన ఆర్థిక సంవత్సరమే చేసినట్లు తెలిసింది. ఈ రీషెడ్యూల్ తో కొంత ఉపశమనమే లభిస్తుంది. అయితే దీర్ఘకాలికంగా అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులను నియంత్రించడం, ఆదాయ మార్గాలను పెంచుకోవడం, ఇంకా రుణాల రీషెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కేంద్రాన్ని మరింత ఒప్పించడం వంటి చర్యలు చేపట్టాలని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. 
  
అధిక వడ్డీ రేట్లే సమస్య 

గత ప్రభుత్వం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వంటి భారీ ప్రాజెక్టుల కోసం పీఎఫ్​సీ, ఆర్ఈసీల నుండి రూ. వేల కోట్ల రుణాలు తీసుకుంది. ఈ రుణాలపై వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని రుణాలపై వడ్డీ రేటు ఏకంగా 10.75% నుండి 11.25% వరకు ఉంది. ఈ అధిక వడ్డీ రేట్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను భారాన్ని మోపుతున్నాయి. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం ఈ అధిక వడ్డీ రుణాలను రీషెడ్యూల్ చేయడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు 2023 వరకు పదేళ్లలో పీఎఫ్​సీ రూ.1,10,000 కోట్లు, ఆర్​ఈసీ రూ.1,57,306 కోట్ల రుణాలను తెలంగాణకు ఆమోదించాయి. ఇందులో పీఎఫ్​సీ రూ.91,000 కోట్లు, ఆర్ఈసీ రూ.1,37,606 కోట్లు ఇప్పటికే విడుదల చేశాయి. ఇందులో కొంత మొత్తం చెల్లింపులు పూర్తి చేశారు. ఈ భారీ రుణాలపై వడ్డీ చెల్లింపులు తెలంగాణ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెద్ద వాటాను కైవసం చేసుకుంటున్నాయి. డిస్కంలకు గతంలో ఉదయ్ పథకం కింద ఆర్ఈసీ, పీఎఫ్​సీలు వడ్డీ రేట్లను12% నుండి 9.95%కి తగ్గించడం వల్ల కూడా కొంత ఉపశమనం కలిగింది.

రీషెడ్యూల్ అంటే..? 

రుణాల రీషెడ్యూల్ అంటే, తీసుకున్న అప్పు చెల్లింపు నిబంధనలను మార్చడం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు లేదా వడ్డీ రేట్ల తగ్గింపు కోసం రీషెడ్యూల్ చేసుకుంటుంది. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఇచ్చిన పీఎఫ్​సీ, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలను సంప్రదిస్తుంది. రాష్ట్రం, ఆర్థిక సంస్థల మధ్య చర్చలు జరిగాక  కొత్త నిబంధనలకు (తక్కువ వడ్డీ రేటు, ఎక్కువ చెల్లింపు వ్యవధి వంటివి) కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డీ భారం తగ్గి, ఏటా వందల కోట్లు ఆదా అవుతాయి. తెలంగాణ సర్కారు కూడా రూ.10 వేల కోట్ల రుణాలకు ఇలాగే రీషెడ్యూల్ పొందింది.