- ప్రత్యేకంగా ఆడిట్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, డేటా అనాలసిస్ వింగ్
- ప్రభుత్వానికి వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల ప్రతిపాదనలు
- టాప్ -200 డీలర్లను ఎంపిక చేసి.. ఆడిట్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌తో నిఘా
- రిటర్న్‌ల స్క్రూటినీ, ఆడిట్లు, ఆకస్మిక తనిఖీలు
- అక్రమాలను సాంకేతికతతో గుర్తించేందుకు డేటా అనాలసిస్ వింగ్
- రూ. 10 కోట్లకు మించిన రీఫండ్ క్లెయిమ్‌ల విశ్లేషణకు రీఫండ్ వింగ్
- కొత్తగా శంషాబాద్, గచ్చిబౌలి, సంగారెడ్డి డివిజన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆదాయానికి గండికొడ్తున్న పన్ను ఎగవేతదారుల భరతం పట్టడంకోసం, వాణిజ్య పన్నుల శాఖను బలోపేతం చేసేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు కీలక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రత్యేకంగా ‘ఆడిట్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్’, ‘డేటా అనాలసిస్ వింగ్’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఫార్మా స్యూటికల్స్ వంటి అధిక ఆదాయం ఉండే రంగాలపై ప్రత్యేక బృందాలతో ‘ఆడిట్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్’ నిఘా పెట్టనుంది. ఇన్‌పుట్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ ట్రెండ్స్, ఈ-వే బిల్లులు, పన్ను చెల్లింపుదారుల రిటర్న్‌లను విశ్లేషణలకు ‘డేటా అనాలసిస్ వింగ్’ తోడ్పడనుంది.పన్ను ఎగవేతలతో ఏటా వేల కోట్ల ప్రభుత్వ ఆదాయం లాస్ అవుతున్నది. దీనికి చెక్ పెట్టాలంటే.. వాణిజ్యపన్నుల శాఖను మరింత పటిష్టం చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేశారు.
టాప్ 200 డీలర్లను ఎంపిక చేసి..
రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లించే టాప్- 200 డీలర్లను ఎంపిక చేసి, వారిని నేరుగా ‘ఆడిట్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్’ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదనల్లో ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం ఇద్దరు అదనపు కమిషనర్లను నియమించి, ఒక్కొక్కరికి 100 మంది డీలర్ల బాధ్యతను అప్పగించాలన్నారు. రియల్ ఎస్టేట్, వర్క్స్ కాంట్రాక్ట్స్, ఐరన్ అండ్ స్టీల్, ఫార్మా స్యూటికల్స్ వంటి అధిక ఆదాయం ఉండే రంగాలపై ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచాలని ప్రతిపాదించారు. రిటర్న్‌ల స్క్రూటినీ, ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం ద్వారా పన్ను ఎగవేతలను అరికట్టడమే కాకుండా.. చట్టపరమైన మార్పులు, కోర్టు తీర్పులపై ఆఫీసర్లకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలన్నారు.
అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో ‘రీఫండ్ వింగ్’
సాంకేతికతను జోడిస్తూ, పన్ను ఎగవేతలను గుర్తించడానికి ప్రత్యేకంగా ‘డేటా అనాలసిస్ వింగ్ ’ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ విభాగం ద్వారా ఇన్‌పుట్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ ట్రెండ్స్, ఈ-వే బిల్లులు, పన్ను చెల్లింపుదారుల రిటర్న్‌లను విశ్లేషించి క్షేత్రస్థాయి అధికారులకు కీలక సమాచారం అందించేలా చూడాలని కోరారు. అలాగే.. రూ. 10 కోట్లకు మించిన రీఫండ్ క్లెయిమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించేందుకు అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ‘రీఫండ్ వింగ్’ను ఏర్పాటు చేయాలని సూచించారు. జీఎస్టీ నెట్‌వర్క్ నుంచి సమాచారాన్ని సేకరించి విశ్లేషించడానికి ‘స్టాటిస్టికల్ వింగ్’ను, సరుకు రవాణా వాహనాల తనిఖీ కోసం జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో రెండు పటిష్టమైన మొబైల్ టీమ్స్‌తో ‘వెహికల్ ఇన్‌స్పెక్షన్ వింగ్’ను ఏర్పాటు చేయడం ద్వారా వ్యవస్థను పారదర్శకంగా మార్చాలని ప్రతిపాదించారు.
ఉద్యోగుల కోసం ‘సర్వీస్ మ్యాటర్స్ వింగ్’
ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడంతో పాటు వారిలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ‘సర్వీస్ మ్యాటర్స్ వింగ్’ (హెచ్ఆర్) ను బలోపేతం చేయాలని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు తమ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ‘తప్పును శిక్షించు.. వ్యక్తిని కాదు’ అనే నినాదంతో, క్రమశిక్షణా చర్యల్లో మానవీయ కోణాన్ని అనుసరించాలని సూచించారు. ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లు, పదవీ విరమణ వంటి అంశాలను పారదర్శకంగా నిర్వహించడానికి కౌన్సెలింగ్ విధానాన్ని, పనితీరు ఆధారిత బదిలీలను అమలు చేయాలని కోరారు. సకాలంలో డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీలు నిర్వహించడం, సమర్థవంతంగా పనిచేసే అధికారులకు అవార్డులు, ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా వారిలో ఉత్సాహాన్ని నింపాలని ప్రతిపాదించారు. అలాగే, న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసేందుకు లీగల్ సెల్, అధికారులకు నిరంతర శిక్షణ కోసం ట్రైనింగ్ డివిజన్ ఏర్పాటు చేయాలని సూచించారు.
కొత్త డివిజన్ల ఏర్పాటు
పన్ను పరిపాలనను వికేంద్రీకరించే దిశగా, ప్రస్తుతం ఉన్న డివిజన్ల పరిధిని మారుస్తూ కొత్తగా కనీసం మూడు డివిజన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్, షాద్‌నగర్ ప్రాంతాలను కలుపుతూ 'శంషాబాద్ డివిజన్’.. పటాన్‌చెరు, పాశమైలారం, జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల కోసం ‘సంగారెడ్డి డివిజన్’.. మాదాపూర్, పంజాగుట్ట డివిజన్ల నుంచి ఐటీ కారిడార్ ప్రాంతాలైన గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేటను వేరుచేస్తూ ‘జూబ్లీహిల్స్/గచ్చిబౌలి డివిజన్’ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి డివిజన్‌కు జాయింట్ కమిషనర్ నేతృత్వం వహించేలా, ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం ప్రత్యేక అధికారిని నియమించేలా, డేటా అనాలసిస్ కోసం నిపుణులను నియమించి పన్నుల వసూళ్లను ముమ్మరం చేసేలా చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు.
సర్కిల్ వ్యవస్థ బలోపేతం
పన్ను చెల్లింపుదారులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండే సర్కిల్ ఆఫీసులను బలోపేతం చేయడంపై ఈ ప్రతిపాదనలు దృష్టి సారించాయి. ప్రస్తుతం కేంద్ర పన్నుల శాఖకు 152 ఫీల్డ్ ఆఫీసులు ఉండగా, రాష్ట్ర శాఖకు కేవలం 118 సర్కిల్స్ ఉన్నాయి. కాగా, ఒక్కో సర్కిల్ దాదాపు 2,500 మంది పన్ను చెల్లింపుదారులకు సేవలందించేలా కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ఇది కేవలం ఖర్చుగా కాకుండా, దీర్ఘకాలిక ఆదాయ వనరుగా భావించాలని సూచించారు. ప్రతి అధికారికి ల్యాప్‌టాప్‌లు, ప్రింటింగ్ పరికరాలు, బిఫా డేటా యాక్సెస్ కల్పించడం ద్వారా రిజిస్ట్రేషన్లు, రాబడి వసూళ్లు, ఎగవేత నివారణలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వాణిజ్య పన్నుల శాఖ తన ప్రతిపాదనలో స్పష్టం చేసింది.
