యాడ్స్ కోసం రూ. 300 కోట్లు ఖర్చు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం

యాడ్స్ కోసం రూ. 300 కోట్లు ఖర్చు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రకటనలు మరియు ప్రచారాల కోసం అక్షరాల రూ. 300 కోట్లు ఖర్చుపెట్టినట్లు ఆర్టీఐ వెల్లడించింది. సొసైటీ ఫర్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ అండ్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానంగా ఆర్టీఐ ఈ వివరాలు బహిర్గతం చేసింది. జూన్ 2014 నుంచి అక్టోబర్ 2018 వరకు కేసీఆర్ ప్రభుత్వం హోర్డింగ్స్, పోస్టర్లు, టీవీ ఛానెళ్లు మరియు రేడియోలలో ప్రచారాల కోసం రూ. 300 కోట్లు ఖర్చుచేసినట్లు తేల్చింది.

తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ మొత్తం ఖర్చులను ఆర్టీఐ రెండు విభాగాలుగా విభజించింది. అవుట్ డోర్ మీడియా సంస్థలకు మరియు టెలివిజన్ ఛానెళ్ల కోసం ఖర్చు చేసినట్లు తెలిపింది. అవుట్ డోర్ మీడియా సంస్థల కోసం సుమారు రూ .177 కోట్లు, టీవీ ఛానెళ్ల కోసం రూ .20 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.

ఖర్చుల పరిశీలిస్తే చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 2014-2015 సంవత్సరంతో పోలిస్తే మిగతా సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం చాలా ఎక్కువ ఖర్చు చేసింది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం తన ఖర్చులను పెంచుకుంటూ వచ్చింది. మొదటి సంవత్సరంలో తెలంగాణ అవతరణ దినోత్సవం మరియు సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకార వేడుకల కోసం ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేసింది. అదేవిధంగా బోనాలు మరియు బతుకమ్మ పండుగల కోసం కూడా ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది.

సీఎం కేసీఆర్ 2014లో సీఎన్ఎన్-ఐబిఎన్ చేత ఇండియన్ ఆఫ్ ది ఇయర్ – పాపులర్ ఛాయిస్ అవార్డును అందుకున్నారు. ఆ అవార్డు ప్రదానం సందర్భంగా ప్రచారం కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేశారు. ఆ తర్వాత 2015-16లో తెలంగాణ అవతరణ దినోత్సవం, గోదావరి పుష్కరాలు మరియు మేడారం జాతర కోసం అధిక ధనాన్ని ఖర్చు చేశారు. అదేవిధంగా 2017లో హరిత హారం, కృష్ణ పుష్కరాలు, బతుకమ్మ మొదలైన వాటి కోసం భారీగా డబ్బు ఖర్చు చేశారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రచారం కోసం సుమారు రూ .8.5 కోట్లు ఖర్చు చేశారు. మెట్రో పిల్లర్లకు బోర్డులు, మోడల్ బస్ షెల్టర్ హోర్డింగ్స్, ఫ్లైఓవర్లకు బోర్డులు మొదలైనవి ఏర్పాటు చేయడానికి ఈ డబ్బును ఉపయోగించారు. ఈ నాలుగు సంవత్సరాలలో ఖర్చు చేసిన మొత్తం డబ్బులో కొంత భాగాన్ని ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు మరియు ఇతర ప్రధాన కార్యక్రమాలను ప్రచారం చేయడానికి ఖర్చు చేశారు.

ఛానెళ్లు, పత్రికల్లో యాడ్స్ మరియు ప్రచారాల కోసం కూడా ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. గత నాలుగేళ్లలో టీ న్యూస్ కోసం సుమారు 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదేవిధంగా V6 మరియు TV 9 వంటి ఇతర ప్రాంతీయ ఛానెళ్లపై కూడా భారీ మొత్తాలను ఖర్చు చేసింది.. జాతీయ ఛానెళ్లైన సీఎన్‌బీసీ, టీవీ 18, సీఎన్‌ఎన్ ఐబీఎన్, ఇండియా టుడే, టైమ్స్ నౌ, ఎన్‌డీటీవీలలో కూడా ప్రకటనల కోసం డబ్బు ఖర్చు చేయబడింది.

For More News..

రాష్ట్రంలో కొత్తగా 952 కరోనా కేసులు నమోదు

సోన్‌సూద్‌కు అరుదైన గౌరవం అందించిన ఆయన సొంతరాష్ట్రం

తప్పుడు వార్తలపై పోరాటానికి 1.15 మిలియన్ డాలర్లు

అమెరికాలో 10 లక్షలకు పైగా పిల్లలకు కరోనా