- సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కుల వ్యవస్థ మూలంగా ఏర్పడిన సామాజిక విభేదాలను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో వివాహాల ప్రోత్సాహక పథకం కింద రూ.26.80 కోట్లు కేటాయించగా, రూ.24.85 కోట్లు ( 93 శాతం ) ఖర్చు చేసినట్టు ఆయన తెలిపారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 994 మంది దంపతులు ప్రత్యక్షంగా లబ్ధి పొందారని శనివారం పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో 114 మందికి, తరువాత నల్గొండ, వరంగల్ అర్బన్, మంచిర్యాల, రంగారెడ్డి, నిజామాబాద్ కు చెందిన జంటలకు ఆర్ధిక సాయం అందించామని మంత్రి చెప్పారు.
పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోను ఈ పథకం విస్తృతంగా అమలవుతున్నదని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో నిధుల వినియోగ శాతం తక్కువగా ఉన్న అంశాన్ని గుర్తించామని, అవగాహన లోపం, దరఖాస్తుల కొరత వంటి సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా స్ధాయిలో రివ్యూ చేపడుతామని లక్ష్మణ్ వివరించారు.
