
- ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ప్రభాకర్‌రావు సహకరిస్తలే
- సిట్టింగ్ జడ్జీలు, లీడర్లు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేశారు
- సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
- మధ్యంతర రక్షణ ఉత్తర్వులు రద్దు చేయాలని విజ్ఞప్తి
- తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సిట్టింగ్ జడ్జీలు, పొలిటికల్ లీడర్లు, జర్నలిస్ట్ ల ఫోన్లను ట్యాప్ చేశారని.. ఇందులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు కీలకమైన సమాచారాన్ని ధ్వంసం చేశారని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ప్రభాకర్‌రావు సహకరించడం లేదని, అందువల్ల ఆయనకు గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో 2023 మార్చి 10న కేసు నమోదైంది. కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు మోపబడిన ప్రభాకర్‌రావు అప్పటికే అమెరికా వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, తాను భారత్‌కు తిరిగివస్తానని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు తిరస్కరించింది.
హైకోర్టు తీర్పును మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మే 29న ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చి సిట్ దర్యాప్తుకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ మరోసారి బుధవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా, పిటిషనర్ ప్రభాకర్ రావు తరఫున సీనియర్ అడ్వకేట్ దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు.
ఫోన్లు, ల్యాప్ టాప్ ఫార్మాట్ చేసిండు
తొలుత ప్రభుత్వం తరఫున మెహతా వాదనలు వినిపిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా ఐఏ దాఖలు చేసినట్లు తెలిపారు. ‘‘ఈ కేసుకు కీలకంగా మారిన తన ఫోన్లు, ల్యాప్ టాప్ ను ప్రభాకర్ రావు స్వయంగా ఫార్మాట్ చేశారు. ఆ తర్వాతే తన మూడు ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చారు. ఫోన్లు, ల్యాప్ టాప్ లను సమర్పించిన తేదీ, ఫార్మాట్ చేసిన తేది పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. దీంతో తదుపరి విచారణ కోసం ఎలాంటి డిజిటల్ డేటా లేకుండా పోయింది. కేసులో ప్రభాకర్ రావును అరెస్ట్ చేయొద్దని ఈ ఏడాది మే 29న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అయితే, ఈ ఆదేశాలు అమలులో ఉండగానే జులై 15న ఈ ఎవిడెన్స్‌ను ధ్వంసం చేశారు” అని వివరించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్లపై విచారణ జరుగుతున్న సమయంలోనే సాక్ష్యాలను ప్రభాకర్‌రావు ధ్వంసం చేశారన్నారు. ఒకసారి ఫోరెన్సిక్ నివేదికను చూడాలని, అందులో తేదీలతోపాటు సమగ్ర సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. దీనిని సాధారణ కేసులా పరిగణించొద్దని, ఇది అత్యంత తీవ్రమైన కేసు అని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఇచ్చిన రక్షణను ప్రభాకర్‌రావు దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మరోసారి గెలిస్తే..ఈ కేసు ఉండేది కాదేమో!
మధ్యలో జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకొని.. నేరం మోపబడిన టైంలో ఏ హోదాలో పని చేశారని ప్రశ్నించారు. ఇందుకు మెహతా సమాధానం ఇస్తూ... దేశ భద్రతకు ముప్పు కలిగించే వారి(వామపక్ష తీవ్రవాదం) ఫోన్లు ట్యాప్ చేసే విభాగానికి పదవీ విరమణ పొందిన తర్వాత కూడా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పని చేశారని వివరించారు. ఈ పేరుతో జర్నలిస్ట్ లు, సిట్టింగ్ జడ్జీలు, పొలిటికల్ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశారని తెలిపారు. అయితే... ఎలక్షన్ సంబంధించిన టైంలో జరిగిందన్న వాదనలు తెరపైకి వచ్చాయి. దీంతో జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. అసలు మరోసారి ఆ పార్టీ (బీఆర్ఎస్) గెలిస్తే ఈ కేసు ఉండేది కాదని కామెంట్ చేశారు.
ఇందుకు మెహతా బదులిస్తూ.. ఈ కేసును ప్రభుత్వం చేపట్టలేదని, పిల్ ఆధారంగా రాష్ట్ర హైకోర్టు పర్యవేక్షిస్తున్నదని తెలిపారు. విచారణకు కూడా పూర్తి స్థాయిలో సహకరించడం లేదని సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఈ కేసు ప్రారంభమైన రోజే ప్రభాకర్ రావు దేశం విడిచి పారిపోయారని మెహతా తెలిపారు. తిరుపతి నుంచి తిరిగి హైదరాబాద్ రావాల్సిన ఆయన... ఈ టికెట్ ను క్యాన్సిల్ చేసుకొని అమెరికాకు టికెట్ బుక్ చేసుకొని వెళ్లారని పేర్కొన్నారు. అయితే.. బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చాకే భారత్‌కు తిరిగి వచ్చారని వివరించారు.
పిటిషనర్ తరపు అడ్వొకేట్ అభ్యంతరం
కాగా, ప్రభుత్వ వాదనలపై పిటిషనర్ తరఫు అడ్వకేట్ శేషాద్రి నాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వాదలను వింటుంటే భయం వేస్తున్నదన్నారు. మూడు రోజుల కిందట్నే ప్రభుత్వం ఈ కేసులో ఐఏ దాఖలు చేసిందని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన వెంటనే ప్రభాకర్ రావును లక్ష్యంగా చేసుకుని ఈ కేసు పెట్టారని ఆరోపించారు. తాము ఎలాంటి ఆధారాలను ధ్వంసం చేయలేదని వాదించారు. ప్రభుత్వ ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు రెండువారాల సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విచారణను వాయిదా వేసింది. వచే నెల 8న వాదనలు వింటామని, అప్పటివరకు మధ్యంతర రక్షణ ఉత్తర్వులు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.