హెచ్​ఏండీఏ భూములు అమ్మేద్దాం

హెచ్​ఏండీఏ భూములు అమ్మేద్దాం
  • రూ.వేల కోట్లు సేకరించే ఆలోచనలో సర్కార్
  • భూముల స్టేటస్, విలువపై రిపోర్ట్ తెప్పించుకున్న ప్రభుత్వం
  • ప్లాట్లు చేసేందుకు యాక్షన్​ప్లాన్​రెడీ
  • ఆ నిధులతోనే గ్లోబల్ సిటీ ఇన్​ఫ్రా డెవలప్​మెంట్​!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఖజానా ఖాళీ అవడంతో డబ్బుల కోసం వేల కోట్ల విలువజేసే హెచ్​ఎండీఏ భూములు అమ్మాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. ఇప్పటికే  సిటీ చుట్టూ ఉన్న ప్రభుత్వ భూముల స్టేటస్, విలువపై రిపోర్టు తెప్పించుకుంది. గ్లోబల్ సిటీ ఇన్ ఫ్రా డెవలప్ మెంట్ కు ఫండ్స్ సమకూర్చడం కోసమే ఈ భూముల్లో ప్లాట్లు చేసి అమ్మాలనుకుంటున్నట్లు చెప్తోంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు నిధులను ఇవ్వగా, రానున్న రోజుల్లో ఇంకిన్ని డెవలప్ మెంట్ పనులకు హెచ్ఎండీఏ నుంచి ఫండ్స్ సేకరించే ప్లాన్ రెడీ చేస్తున్నరు. ఉప్పల్ భగాయత్, ఎల్ఆర్ఎస్ పేరిట వచ్చిన ఆదాయంతో బాలానగర్ ఫ్లై ఓవర్, ఓఆర్ఆర్ మెయింటెనెన్స్, లాజిస్టిక్ పార్కులు, ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ పనులు చేపట్టింది. ఈ క్రమంలో విలువైన భూములను అభివృద్ధి చేసి, వాటి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరిన్ని అభివృద్ధి పనులకు కేటాయించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్న భూములను హెచ్ఎండీఏ డెవలప్ చేసే పనులు స్పీడప్ చేసింది. హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలో 8 వేల ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. దీనిలో ఇప్పటికే హెచ్‌‌‌‌ఎండీఏ 3,600 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లు వేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇందులో కోకాపేట్ 200 ఎకరాల వెంచర్ కీలకంగా మారింది. ఈ భూములతో కనీసం రూ.6 వేల నుంచి 7వేల కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇక తెల్లాపూర్, మియాపూర్, మోకీలా, బాటాసింగారం, కుత్బుల్లాపూర్ పరిధిలోనూ వెంచర్లకు అనుకూలంగా ఉన్న భూములు ఉన్నాయి. వీటన్నింటినీ త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ రూపొందించింది.

మెట్రో నుంచి ఎక్స్ ప్రెస్ వే లకు వరకు..

ఉప్పల్ భగాయత్ భూముల వేలం, ఎల్ఆర్ఎస్​తో వచ్చిన మొత్తాన్ని సిటీలో అభివృద్ధి పనులకు మళ్లించింది. బాలానగర్ ఎక్స్ ప్రెస్ వేకు రూ.350 కోట్లు ఖర్చు చేయగా, రాయదుర్గం–శంషాబాద్ మెట్రో విస్తరణకు నిధులివ్వాలని ప్రభుత్వంహెచ్ఎండీఏకు సూచించింది. మరో రూ.200 కోట్లతో ఫారెస్టుల అభివృద్ధి, రేడియల్, లింకు రోడ్లు నిర్మిస్తుంది. ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణ, భూ సేకరణ బాధ్యతలను అప్పగిస్తే వాటికి భారీ మొత్తంలో నిధులు కావాలని హెచ్ఎండీఏ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసమే విలువైన భూములను ప్లాట్లుగా చేసి అమ్మి డబ్బులు సేకరించే పనులు స్పీడప్ చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి మీటింగ్‌‌‌‌లో హెచ్ఎండీఏ భూముల స్టేటస్, లీగల్ ప్రాబ్లమ్స్‌‌‌‌లేని భూముల వివరాలు, విలువపై రిపోర్ట్ ఇచ్చినట్లుగా తెలిసింది.