- ఆర్థిక శాఖ మంత్రి హామీతో కాంట్రాక్టర్ల ‘చలో హైదరాబాద్’ వాయిదా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యలపై ప్రభుత్వం మానవీయకోణంలో స్పందిస్తున్నదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంగళవారం ప్రజాభవన్ లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, సివిల్ కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేయగా, డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.
చిన్న కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఆర్థిక శాఖ ప్రతినెలా నిరంతరాయంగా బిల్లులను చెల్లిస్తున్నదని భట్టి వారికి గుర్తు చేశారు. పెండింగ్ బకాయిల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నదని వివరించారు. అంతకుముందు, మధ్యాహ్నం కాంట్రాక్టర్ల ప్రతినిధులు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సెక్రటేరియెట్‌లో చర్చలు జరిపారు. అనంతరం వారు ప్రజాభవన్‌కు చేరుకుని, మంత్రి కోమటిరెడ్డితో జరిగిన చర్చల సారాంశాన్ని డిప్యూటీ సీఎంకు వివరించారు.
‘చలో హైదరాబాద్’ వాయిదా: రవీందర్ రెడ్డి
పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీతో తాము సంతృప్తి చెందామని, ఈ నెల 18న నిర్వహించాలనుకున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చైర్మన్ రవీందర్ రెడ్డి ప్రకటించారు. తమ సమస్యల విషయంలో సానుకూలంగా స్పందించిన మంత్రులకు అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు సత్యమూర్తి, ఎస్.ఎన్. రెడ్డి, డీవీఎన్. రెడ్డి, సుగుణాకర్, భాస్కర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ప్రభాకర్, శ్యామ్ పాల్గొన్నారు.
