- ఏప్రిల్ ఆఖరున స్కూళ్లకు క్లాత్
హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూల్ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే యూనిఫాం అందించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.ఆ లక్ష్యంతోనే అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. జాప్యానికి తావు లేకుండా ఇప్పటికే ప్రక్రియను వేగవంతం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రీప్రైమరీ చిన్నారులకూ యూనిఫాం ఇవ్వాలని సర్కారు డిసైడ్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ సర్కారు బడుల్లో సుమారు 20 లక్షల మంది చదువుతున్నారు. ఈసారి యూనిఫాం క్లాత్ సేకరణ, పంపిణీలో జాప్యం లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
విద్యార్థులకు అవసరమైన కోటి మీటర్ల వస్త్రం కోసం ఇప్పటికే ‘టెస్కో’కు ఇండెంట్ పెట్టారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచే జిల్లాలకు క్లాత్ సరఫరా ప్రారంభించి.. ఏప్రిల్ నెలాఖరు కల్లా మండలాల నుంచి స్కూల్ పాయింట్లకు వస్త్రం చేరేలా డెడ్ లైన్ విధించారు. సమ్మర్ హాలిడేస్ ప్రకటించడానికి ముందే స్కూళ్లలోని విద్యార్థులందరి కొలతలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే మహిళా సంఘాలకు యూనిఫాంలు కుట్టే బాధ్యతలు అప్పగించారు. వారితో వేసవి సెలవుల్లోనే కుట్టుపని పూర్తి చేయించి.. జూన్ 12న రీఓపెన్ రోజే విద్యార్థులు కొత్త యూనిఫామ్స్ వేసుకునేలా విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
