మేడిగడ్డ రిపేర్లపై సర్కారు కసరత్తు.. అక్టోబర్ 15 కల్లా అప్లికేషన్లు సమర్పించాలని నోటిఫికేషన్

మేడిగడ్డ రిపేర్లపై సర్కారు కసరత్తు.. అక్టోబర్ 15 కల్లా అప్లికేషన్లు సమర్పించాలని నోటిఫికేషన్
  • రిహాబిలిటేషన్ డిజైన్ల కోసం సంస్థల 
  • నుంచి ఎక్స్​ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సర్కారు దృష్టి సారించింది. మూడు బ్యారేజీలకు రీహాబిలిటేషన్ డిజైన్లను తయారు చేసి రిపేర్లు చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్ఏ) తన తుది నివేదికలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు తొలుత బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లపై ఇరిగేషన్ శాఖ ఫోకస్ పెట్టింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లను తయారు చేసేందుకు కన్సల్టెన్సీని నియమించేందుకు తాజాగా ‘ఎక్స్​ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ = ఆసక్తి ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులు)’ను సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ ఆహ్వానించారు. 

బుధవారం నుంచి ఎక్స్​ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లికేషన్లు అందుబాటులో పెట్టారు. ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటల లోపు అప్లికేషన్లను సీల్డ్ కవర్​లో ఈఎన్​సీ జనరల్​ పేరిట సీఈ సీడీవో ఆఫీసులో సమర్పించాలని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు జలసౌధలోని కాన్ఫరెన్స్ హాల్​లో ఈవోఐ అప్లికేషన్లను ఓపెన్ చేస్తామని తెలిపారు. ఈవోఐ ఫామ్​లు ఓపెన్​ చేసిన తేదీ నుంచి 90 రోజులపాటు వ్యాలిడిటీ ఉంటుందని పేర్కొన్నారు.

మేడిగడ్డ ఏడో బ్లాక్​పై ఫోకస్​

ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్​పై ఫోకస్ పెట్టింది. ఈవోఐ ద్వారా ఎంపికయ్యే సంస్థలు ఏడో బ్లాక్ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై సాంకేతిక అభిప్రాయాలను వివరించాలని సూచించింది. జియోటెక్నికల్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్​తో పాటు హైడ్రాలిక్ అసెస్​మెంట్స్ ఆధారంగా ఏడో బ్లాక్ పునరుద్ధరణ చర్యలను చేపట్టాలని పేర్కొంది. ఒకవేళ ఏడో బ్లాక్​ను పూర్తిగా తొలగించాల్సి వస్తే.. ఎలా చేయాలో కూడా టెక్నికల్ సలహాలు, సూచనలు ఇవ్వాలని స్పష్టం చేసింది. లేదంటే ఆ బ్లాక్​ను అలాగే ఉంచి రిపేర్లు చేయాలనుకున్నా.. దానికి అనుగుణంగా సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించింది. 

అయితే అదే సమయంలో ఏడో బ్లాక్​కు ఆనుకుని ఉండే ఇతర బ్లాకులకు ఎలాంటి నష్టమూ కలగకూడదని పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీపై అవసరమైన చోట అవసరమైనన్ని పరికరాలను ఏర్పాటు చేయాలని, ప్రతి గేటు వద్ద పీజోమీటర్స్​ను పెట్టాలని పేర్కొంది. బ్యారేజీ మొత్తంలో సీసీ బ్లాకులు, లాంచింగ్ ఆప్రాన్ వంటి ప్రొటెక్షన్ వర్క్​లకు డిజైన్లు ఇవ్వాలని సూచించింది. బ్యారేజీపై పూర్తి స్థాయిలో స్టడీ చేసి అది వినియోగానికి అనువుగా ఉంటుందో లేదో చెప్పాలని పేర్కొంది. 

‘‘డిజైన్ ఫ్లడ్​కు అనుగుణంగా హైడ్రాలిక్ డిజైన్లు ఇవ్వాలి. రాఫ్ట్ కటాఫ్ స్ట్రెంథ్​ను అంచనా వేయాలి. సీపేజీ, సుడిగుండాల వంటి వాటిని నిరోధించే చర్యలకు డిజైన్లు ఇవ్వాలి. రాఫ్ట్ కింద ఏవైనా గోతులున్నాయోమో అంచనా వేయాలి. వాటిని పూడ్చేందుకు అవసరమైన చర్యలను సిఫార్సు చేయాలి. రేడియల్ గేట్ సీట్ పొజిషనింగ్, వాటి పనితీరుపైనా డిజైన్లు చేయాలి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలోనూ ఎన్​డీఎస్ఏ సిఫార్సు చేసిన అన్ని అంశాలపైనా పనిచేయాలి’’ అని స్పష్టం చేసింది. 

పకడ్బందీగా..

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై సర్కారు పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. అనుభవం, అర్హత ఉన్న సంస్థలకే ఆ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే వివిధ ప్రాజెక్టులు, డ్యామ్​ల నిర్మాణాల్లో డిజైన్లు చేసిన అనుభవం ఉండాలని నిబంధనల్లో పేర్కొంది. కనీసం ఐదేండ్ల ఎక్స్​పీరియన్స్ అవసరమని స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా సీకెంట్ పైల్స్ టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్టుల్లో రీహాబిలిటేషన్ వర్క్స్​లో పనిచేసిన అనుభవం ఉండాలని సూచించింది. ఒకవేళ సంస్థలు సబ్​కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం.. అది పని విలువలో 25 శాతానికి మించకూడదని వెల్లడించింది. 

ఈవోఐ వేసే సంస్థ.. గత 15 ఏండ్లలో కనీసం 3 ప్రాజెక్టుల్లోనైనా ఇలాంటి పని చేసి ఉండాలని పేర్కొంది. అయితే, ఎంపిక చేసిన సంస్థలకే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్​పీ) సబ్​మిషన్ కు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఎన్​డీఎస్ఏ రిపోర్టుకు అనుగుణంగానే పనులను చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. కాఫర్ డ్యామ్, కటాఫ్, ఎనర్జీ డిసిపేషన్ అరేంజ్​మెంట్స్, గైడ్​బండ్స్​/ఫ్లడ్ బ్యాంక్స్, గోతులను పూడ్చడం, సీకెంట్​పైల్స్, సీపేజీ నివారణ, బ్యారేజీ పగుళ్లకు రిపేర్ల వంటి వాటికి డిజైన్లు ఇవ్వాలని తెలిపింది. 


ఇవన్నీ చేసి ఉండాలి:

  • బ్యారేజీ ఫ్లోర్​లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సీపేజీ అనాలసిస్ చేసిన అనుభవం
  • ఇసుక భూముల్లో ఆర్​సీసీ డయాఫ్రామ్ వాల్​/షీట్​పైల్స్​/సీకెంట్ పైల్స్​కు సంబంధించి కటాఫ్ వాల్ నిర్మాణానికి సంబంధించి డిజైన్ 
  • ఇంజనీరింగ్​లో అనుభవం
  • ఎనర్జీ డిసిపేషన్ (గేట్లు ఎత్తినప్పుడు వరద దూకే వేగాన్ని నియంత్రించే పద్ధతి) డిజైన్​లో అనుభవం
  • నిర్మాణం పూర్తయి డ్యామేజీ అయిన ప్రాజెక్టులకు రిపేర్లు చేసిన అనుభవం ఉండాలి.
  • ఇసుక నేలల్లో బ్యారేజీ/డ్యామ్​ల నిర్మాణానికి డిజైన్లు ఇచ్చిన అనుభవం
  • రేడియల్ గేట్లు, స్టాప్​లాగ్ గేట్ల రోప్ డ్రమ్, గాంట్రీ క్రేన్​ల వంటి హైడ్రో మెకానికల్ పనులు చేసి ఉండాలి
  • కంపెనీ వార్షిక టర్నోవర్ కనీసం రూ.10 కోట్లుగా ఉండాలి. అందుకు 
  • అనుగుణంగా గత ఐదేండ్ల ఆడిట్ రిపోర్టులను జత చేయాలి.