
- ఉద్యోగుల రిటైర్మెంట్బెనిఫిట్స్కు కూడా..
- 29న కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకునే చాన్స్
- డిప్యూటీ సీఎం భట్టితోత్రిసభ్య కమిటీ భేటీ
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిసింది. ఉద్యోగ సంఘాలు త్రిసభ్య కమిటీకి నివేదించిన పలు అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో కొన్ని ఆర్థిక పరమైన డిమాండ్లనూ నెరవేర్చనున్నట్టు తెలుస్తున్నది. పెండింగ్‌లో ఉన్న డీఏలలో రెండు చెల్లించడంతో పాటు ఉద్యోగుల రిటైర్మెంట్ రోజునే వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్‌లో కొంత మొత్తం చెల్లించేలా చర్యలు తీసుకోనుంది.
ఉద్యోగుల సమస్యలపై సీసీఎల్ఏ సెక్రటరీ నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేశ్ కుమార్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్‌తో ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై, వారి సమస్యలపై చర్చించింది. ప్రభుత్వానికి పలు సిఫార్సులతో నివేదిక రెడీ చేసింది. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన పలు అంశాలను మంగళవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం, ఉద్యోగుల సమస్యల పరిష్కార సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్కకు త్రిసభ్య కమిటీ అధికారులు వివరించారు. ‘‘ఈ నెల 29న సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తాం. ఆ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలు, వాటి పరిష్కారానికి సంబంధించిన సమాచారాన్ని వివరించండి” అని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. ఆర్థిక పరమైన అంశాల్లో కొన్నింటిపై కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఆర్థిక అంశాలపై కీలక నిర్ణయాలు..
ఉద్యోగులకు సంబంధించి ఆర్థికంగా ముడిపడి లేని 40కి పైగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా ఉంది. అదే సమయంలో కొన్ని ఆర్థిక సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలిసింది. పెండింగ్‌లో ఉన్న డీఏలలో రెండు ఇచ్చేందుకు సాను కూలంగా ఉన్నది. అలాగే, ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజునే బెనిఫిట్స్‌లో కొంత మొత్తం చెల్లించేలా చర్యలు తీసుకోనుంది. ఇక సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణపై మరింత అధ్యయనం చేయనుంది.
ఇందుకోసం మరో కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. ఉద్యోగులకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను మరింత బలోపేతం చేయనుంది. అలాగే, రూ.10 లక్షల వరకు ఉన్న ఉద్యోగుల బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేయనున్నట్టు తెలుస్తున్నది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బదిలీ అయిన అధికారులను తిరిగి ఆయా చోట్లకు పంపించనుంది.