- పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేసే యోచనలో ప్రభుత్వం
- మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాఫీ లేనట్టే!
- వారం రోజుల్లో కేబినెట్ భేటీ.. రుణమాఫీ అంశమే ప్రధాన ఎజెండా!
హైదరాబాద్, వెలుగు: రుణమాఫీ గైడ్‌లైన్స్ రూపొందించడంపై రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తున్నది. ఆగస్టు 15లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇంకా రెండు నెలల గడువే ఉండటంతో నిధుల సర్దుబాటు, గైడ్‌లైన్స్ రూపకల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే వారం రోజుల్లో కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీ అంశమే ప్రధాన ఎజెండాగా ఉంటుందని సెక్రటేరియెట్ వర్గాలు వెల్లడించాయి.
కేబినెట్ మీటింగ్‌లో గైడ్‌లైన్స్ పై చర్చించి.. అదే రోజు వాటిని రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులకు రుణమాఫీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా, రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం? నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలేంటి? అందుబాటులో ఉన్న వనరులు ఏంటి? అనే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలి? అర్హులైన రైతులందరికీ లబ్ధి చేకూరేలా విధివిధానాలు ఎలా ఉండాలి? అనే దానిపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. గతంలో చేసిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, వాటి ఇంప్లిమెంట్కు అనుసరించిన పద్ధతులను సంబంధిత శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు ఇటీవల మహారాష్ట్ర వెళ్లివచ్చారు.
సెంట్రల్ గైడ్‌లైన్స్‌పై అధికారులతో రేవంత్ చర్చ
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల్లో.. అర్హుల ఎంపిక కోసం అనుసరిస్తున్న విధి విధానాలను, రుణమాఫీకి అమలు చేసే విషయమై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకిసాన్) స్కీమ్‌లో భాగంగా కేంద్రం.. దేశవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ ఏటా రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తున్నది. రూ.2వేల చొప్పున మూడు విడతల్లో డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, రూ.10వేలకు మించి పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ చెల్లించేవారు, డాక్టర్లు, ఇంజినీర్లు, సీఏ, ఆర్కిటెక్ట్ లాంటి ప్రొఫెషనల్స్‌ను ఈ పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయించింది. రుణమాఫీ స్కీమ్‌కు కూడా కేంద్రం అనుసరిస్తున్న గైడ్‌లైన్స్ ఫాలో అయితే బాగుంటుందని పలువురు అధికారులు సీఎం రేవంత్‌కు సూచించినట్టు తెలుస్తున్నది. అప్పుడే అర్హులైన, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతు కుటుంబాలకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం.