
రాచరిక పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిందన్నారు గవర్నర్ తమిళి సై. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో ప్రసంగం ప్రారంభించారు తమిళిసై. కొత్తప్రభుత్వానికి, ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. నిర్భందపు పాలన నుంచి ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని చెప్పారు.
ప్రజాపాలన మొదలైందని.. బలిదానాలు చేసిన వారి త్యాగాలను గుర్తించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలకులం కాదు ప్రజా సేవకులం అని చెప్పారన్నారు. ప్రజావాణి కార్యక్రమంతో కొత్త ప్రభుత్వం పాలన మొదలు పెట్టిందని చెప్పారు గవర్నర్. రైతులు, యువత, మహిళలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రేవంత్ సర్కార్ రోల్ మోడల్ గా నిలుస్తుందని చెప్పారు గవర్నర్ తమిళి సై.
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల్లో రెండు ప్రారంభించిందన్నారు గవర్నర్ తమిళి సై. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు పథకాలు ప్రారంభించామన్నారు. త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కొత్త ప్రభుత్వంలో తెలంగాణ స్వేఛ్చా వాయువులు పీల్చుకుంటోందన్నారు. ప్రజాప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పడానికి గర్విస్తున్నానని చెప్పారు. పాలకులకు, ప్రజలకు మధ్య ఇనుప కంచలు తొలిగిపోయాయని తెలిపారు.
ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు గవర్నర్. భూ మాత పోర్టల్ అత్యంత పారదర్శకంగా ఉంటుందని.. అడ్డుగోడలు, అద్ధాల మేడలు పటాపంచలయ్యాయని తెలిపారు. దుర్వినియోగం, దుబారా ఎక్కడ జరిగిందే కనిపెట్టే పనిలో ఉన్నామన్నారు గవర్నర్. హైదరాబాద్ రాజధానే కాదు.. అత్యధిక రెవెన్యూ ప్రాంతమని చెప్పారు. త్వరలో అన్ని శాఖలపై శ్వేతపత్రం విడుదలచేస్తామన్నారు. ప్రజలపై భారం మోపకుండా మెరుగైన పాలన అందిస్తామన్నారు. కృష్ణానదిలో తెలంగాణ వాటా కోసం పోరాడతామన్నారు గవర్నర్.
విద్యుత్ సంస్థ 81 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు గవర్నర్. ఐటీఐఆర్ ప్రాజెక్టు తీసుకొస్తే తెలంగాణ ఎప్పుడో బాగుపడేదన్నారు. హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామన్నారు. త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే మెగా డీఎస్సీని ప్రకటిస్తామన్నారు గవర్నర్ .