
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై.. బుధవారం తన కుటుంబ సభ్యులతో కలసి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను చూశారు. సాత్వంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీసిన ఈ చిత్రాన్ని స్పెషల్ ప్రీమియర్ షో లో చూశారు. సినిమా చూసిన తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి అద్భుతంగా నటించారని ఆయన్ని ప్రశంసించారు. చరిత్రను ఈనాటి తరానికి తెలియజేసేలా ఓ మంచి చిత్రాన్ని తీసినందు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న సైరా విడుదలైంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాని నిర్మించారు.