- హైదరాబాద్ స్టార్టప్స్లో కనీసం 100 యూనికార్న్‌లుగా ఎదగాలి
- ఇందుకోసం ప్రభుత్వం, గూగుల్ సహకారం అందిస్తాయని హామీ
- గూగుల్ స్టార్టప్ హబ్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్టార్టప్‌ల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం రూ.వెయ్యి కోట్ల ‘స్టార్టప్ ఫండ్’ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 20 ఏండ్ల కింద ప్రారంభించిన ఎన్నో స్టార్టప్‌లు ఇప్పుడు బిలియన్ల డాలర్ల కంపెనీలుగా ఎదిగాయన్నారు.
గూగుల్, యాపిల్, అమెజాన్, టెస్లా, ఫేస్బుక్ ఇలాంటివన్నీ గొప్ప ఉదాహరణలని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 25 ఏండ్లలో సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాలకు చెందిన స్టార్టప్‌లు పెద్ద కంపెనీలుగా ఎదిగాయన్నారు. బుధవారం టీ హబ్‌లో గూగుల్ స్టార్టప్హబ్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా స్టార్టప్స్ కోసం ప్రణాళికలేమిటి అని అడిగితే.. స్టార్టప్స్‌ను ఫుట్‌బాల్‌తో పోలుస్తానని చెప్పారు.
‘‘నేను ఫుట్బాల్ ఆడతాను. ఫుట్‌బాల్‌లో సమిష్టి కృషి అవసరం. పట్టుదలతో సాధన చేయాలి. ఇది టీమ్ వర్క్. కానీ, చివరికి గెలుపే ముఖ్యం. కలిసికట్టుగా ముందుకు సాగితేనే విజయం. స్టార్టప్స్ కూడా అదే విధంగా పనిచేయాలి. గెలవాలి’’ అని సీఎం పేర్కొన్నారు.
హైదరాబాద్ కేవలం స్టార్టప్హబ్గా ఎదగడమే కాదని, ఇక్కడి స్టార్టప్‌లు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని ఆకాంక్షించారు. కనీసం 100 స్టార్టప్లైనా యూనికార్న్‌లుగా.. అంటే బిలియన్ డాలర్ల కంపెనీలుగా ఎదగాలని పేర్కొన్నారు. 2034 నాటికి ఈ వంద యూనికార్న్‌లలో కనీసం 10 సూపర్ యూనికార్న్‌లుగా మారాలన్నారు. దాని కోసం రాష్ట్రంలో ఒక మంచి ఎకోసిస్టమ్‌ను సృష్టించాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. స్టార్టప్‌ల ఎదుగుదలకు స్టార్టప్ ఫండ్ నుంచి నిధులను వాడుకోవచ్చని ఆయన చెప్పారు.
గూగుల్ ఓ అగ్ర స్థాయి స్టార్టప్..
హైదరాబాద్‌లో ఉన్న అగ్రస్థాయి స్టార్టప్స్లో గూగుల్ ఒకటని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘మీరు యువకులు, శక్తిమంతులు. సాధారణంగా మీరు మీ కలలను సాకారం చేసుకోవాలనుకుంటారు. ఈ సందర్భంగా మీకు స్ఫూర్తిని కలిగించే ఒక విషయం చెప్తా.. ఉన్నత ఆశయాలతో 1998లో ఇద్దరు స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గారేజీలో ఓ స్టార్టప్‌ను ప్రారంభించారు. అదే నేటి ప్రఖ్యాత గూగుల్ కంపెనీగా అవతరించింది.
తెలంగాణ భవిష్యత్ అభివృద్ధిని ఆకాంక్షించి ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్‌ను పరిచయం చేయాలని గత రెండు రోజులు మనం తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్‌ను నిర్వహించాం. జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ల సమక్షంలో తెలంగాణ భవిష్యత్ కోసం మన విజన్‌ను ఆవిష్కరించాం. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ఆయన వివరించారు.
యూనివర్సిటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు: శ్రీధర్‌బాబు
కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఇంక్యుబేషన్ సెంట ర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చాల నే లక్ష్య సాధనలో ముందుకు వెళ్తున్నామన్నారు.
స్టార్టప్‌లను చిన్న కంపెనీలుగా మాత్రమే చూడటం లేదని, సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు వినూత్న పరిష్కారాలు అందిస్తూ కొత్త ఉద్యోగాలను సృష్టించే ఎకనామిక్ ఇంజన్లుగా చూస్తున్నామని ఆయన తెలిపారు. 2024లో ఇక్కడి స్టార్టప్‌లు 571 మిలియన్ డాల ర్ల నిధులను సమీకరించాయన్నారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 160 శాతం అధికమని వివరించారు.
ముఖ్యంగా హెల్త్ టెక్ రంగంలో 2,139 శాతం వృద్ధి నమోదైందన్నారు. మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లలో హైదరాబాద్ దేశంలోనే ఆరో స్థానంలో ఉందని తెలిపారు. మహిళలు లీడ్ చేస్తున్న 531 స్టార్టప్ లు 417 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయ న్నారు. ఇవి కేవలం గణాంకాలు కాదని, తమ ప్రభుత్వ పనితీరుకు, ప్రగతిశీల విధానాలకు నిలువెత్తు నిదర్శనమని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం టెక్నాలజీని కేవలం టూల్ గా చూడటం లేదని, ఒక సమానత్వ సాధనంగా చూస్తున్నదని పేర్కొన్నారు.

