సర్కారు స్కూళ్లకు కంప్యూటర్ టీచర్లు.. 2,837 బడుల్లో ఇన్స్ట్రక్టర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్

సర్కారు స్కూళ్లకు కంప్యూటర్ టీచర్లు.. 2,837 బడుల్లో ఇన్స్ట్రక్టర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
  • 2,837 బడుల్లో ఇన్ స్ట్రక్టర్ల నియామకానికి సర్కారు గ్రీన్ సిగ్నల్ 
  • ఐదు, అంతకంటే ఎక్కువ సిస్టమ్స్ ఉన్న బడులకే చాన్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు స్కూళ్లలో డిజిటల్ విద్యకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ల్యాబ్‌‌‌‌లను పర్యవేక్షించడానికి కంప్యూటర్ టీచర్లను నియమించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లున్న బడులకే అవకాశం ఇవ్వగా.. వచ్చే విద్యా సంవత్సరం అన్ని స్కూళ్లకు కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్లను నియమించాలని సర్కారు భావిస్తోంది.

 వీరందరినీ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ హైస్కూళ్లలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్​ఎల్​ఎన్​ ఏఎక్స్ఎల్), ఖాన్ అకాడమీ ద్వారా గణితం, సైన్స్‌‌‌‌లో క్లాసులు,  ఫిజిక్స్ వాలా ద్వారా ఐఐటీ/జేఈఈ, నీట్ కోచింగ్‌‌‌‌ వంటివి ప్రారంభమయ్యాయి. అయితే, వీటిని రెగ్యులర్​గా మానిటరింగ్ చేసేందుకు కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్లు లేకపోవడంతో, స్కూళ్లలో టీచర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ఈ క్రమంలో విద్యార్థులు ఎక్కువగా ఉన్న బడుల్లో తొలిదశలో ఐసీటీ బోధకులకు నియమించుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్.. విద్యాశాఖ సెక్రటరీకి ఇటీవల లేఖ రాశారు. ఐసీటీ బోధకుల నియామకం కోసం  సమగ్ర శిక్ష కింద కేంద్రం నిధులు కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. 

దీనికి స్పందించిన సర్కారు 2,837 బడుల్లో ఐసీటీ బోధకులను నియమించుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో త్వరలోనే టీజీటీఎస్‌‌‌‌ఎల్ ద్వారా ఈ-టెండర్లు పిలిచి, ఔట్‌‌‌‌సోర్సింగ్ ఏజెన్సీని ఖరారు చేయనున్నారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి, వచ్చే నెలలో కొత్త టీచర్లు అందుబాటులో ఉండేలా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు ప్రారంభించారు.