ఆర్థిక కష్టాలను తీర్చుతూ.. ఆదరణ చూపుతూ..! సిరిసిల్ల నేతన్నలకు రాష్ట్ర సర్కార్ రూ.1000 కోట్ల సాయం

ఆర్థిక కష్టాలను తీర్చుతూ..  ఆదరణ చూపుతూ..! సిరిసిల్ల నేతన్నలకు రాష్ట్ర సర్కార్ రూ.1000 కోట్ల సాయం
  • వివిధ స్కీమ్ ల కింద కేటాయింపు 
  • బతుకమ్మ చీరల బకాయిలు రిలీజ్
  • యారన్ డిపో ఏర్పాటుకు నిధులు 
  • నేత కార్మికుల రుణమాఫీకి ఫండ్స్  

రాజన్నసిరిసిల్ల,వెలుగు : ఆర్థిక సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయిస్తోంది. వివిధ స్కీమ్ ల కింద ఇప్పటివరకు నేత కార్మికులకు దాదాపు  రూ.1000 కోట్లు ఇచ్చింది. గత సర్కార్ పెట్టిన పాత బకాయిలన్నింటిని క్లియర్ చేసింది. ఏడాదంతా నేత కార్మికులకు పని కల్పించేందుకు కొత్త ఆర్డర్లను ఇచ్చింది. చేనేత లక్ష్మి, నేతన్న బీమా, థ్రిఫ్ట్ స్కీమ్, చేనేత సహకార సంఘాలకు క్యాష్​ క్రెడిట్ రుణాలు, రాజీవ్ విద్యా మిషన్, ఇందిరమ్మ చీరల పథకాలను  ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. 

పాత బకాయిలు క్లియర్

సిరిసిల్ల నేత కార్మికులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను తయారు చేయించింది. ఉత్పత్తికి సంబంధించి బకాయిలను రూ.379 కోట్లు పెండింగ్ పెట్టింది. దీంతో సిరిసిల్ల నేత కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు.  అధికారంలోకి వచ్చిన వెంటనే నేతన్నల బకాయిలను క్లియర్ చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం  హామీ ఇచ్చింది. వచ్చిన ఏడాదిలోపే విడతల వారీగా బకాయిలను విడుదల చేసింది.

రూ. 318 కోట్లు కేటాయింపు

ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన నేత కార్మికులను ఆదుకునేందుకు పొదుపు సంఘాల మహిళలకు చీరలను అందించేందుకు గత ఫిబ్రవరిలో ఆర్డర్లు ఇచ్చింది. ఇందిరమ్మ చీరల ఉత్పత్తికి రూ.318 కోట్లు కేటాయించింది. ఇప్పటికే చీరల ఉత్పత్తి పూర్తి కావస్తోంది. ఏడాదంతా పని కల్పిస్తోంది.  

రూ.50 కోట్లతో యారన్ బ్యాంక్  

 నేత కార్మికుల చిరకాల కోరికైన యారన్ బ్యాంక్ ను రూ. 50 కోట్లతో ప్రస్తుత సర్కార్ ఏర్పాటు చేసింది. గత ఫిబ్రవరిలో వేములవాడలో నూలు డిపోను ప్రారంభించింది. సిరిసిల్లలో దాదాపు 100 మ్యాక్స్ సొసైటీలకు 250 మెట్రిక్ టన్నుల యారన్ సప్లై చేసింది. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు యారన్ డిపో ఏర్పాటుకు కార్మికులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. కాంగ్రెస్ రాగానే  ఏడాదిలోపే యారన్ బ్యాంక్ ఏర్పాటు చేయడంతో  నేత కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.  

త్వరలో చేనేత రుణ మాఫీ

నేత కార్మికుల అప్పును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేందుకు రూ.33 కోట్లు కేటాయించినట్లు ఇటీవల చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నేత కార్మికుల రుణాలు త్వరలోనే మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.  

గతంలో రాజీవ్ విద్యా మిషన్, సర్వ శిక్షా అభియాన్ 

స్కూల్ యూనిఫాం ఆర్డర్ల కోసం రూ.49 కోట్లు పెండింగ్ బకాయిలను కూడా సర్కార్ రిలీజ్ చేసింది. వారం  రోజుల కింద నేతన్న బీమా,థ్రిఫ్ట్ స్కీమ్ లో భాగంగా రూ.  24 కోట్లు అందజేసింది. నేతన్న బీమా కింద ఒక్కో కార్మికుడిని రూ. 5 లక్షల చొప్పున 1200 మందికి రూ. 60 లక్షలు ఇచ్చింది. 

ఏడాదంతా చేతినిండా పని 

సంక్షోభంలో ఉన్న నేత కార్మికులకు ప్రస్తుత ప్రభుత్వం  ఇందిరమ్మ చీరల ఆర్డర్లతో ఏడాదంతా  పని కల్పించింది. నేత కార్మికులు రెండు షిప్టులో పని చేస్తూ  ఒక్కో కార్మికుడు నెలకు రూ.25వేలకు పైగానే సంపాదిస్తున్నారు. దీనికి తోడు సర్కార్ బడులు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు స్కూల్ యూనిఫాం ఆర్డర్లను కూడాఇవ్వడంతో  ఏడాదంతా చేతినిండా ఉపాధి దొరికింది.