- జాతరలో 3 హాస్పిటల్స్.. 30 మెడికల్ క్యాంపులు
- ఏర్పాట్లపై అధికారులతో మంత్రి దామోదర రివ్యూ
హైదరాబాద్, వెలుగు: వన దేవతలు సమ్మక్క -సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. మేడారం జాతర కోసం వైద్యారోగ్య శాఖ ఏకంగా ఒక మెడికల్ ఆర్మీని మోహరిస్తున్నది. జాతర పరిసరాల్లోనే కాకుండా భక్తులు వచ్చే దారుల్లోనూ అడుగడుగునా వైద్యం అందేలా ప్లాన్ చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ రూపొందించిన యాక్షన్ ప్లాన్ను మంత్రి పరిశీలించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జాతరలో భక్తులకు అత్యవసర వైద్యం కోసం మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకలతో సమ్మక్క సారలమ్మ ప్రధాన వైద్యశాలను ఏర్పాటు చేశారు. జాతర పరిసరాల్లోనే మరో 30 మెడికల్ క్యాంపులు, 3 ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే భక్తుల తాకిడి పెరగడంతో గద్దెల వద్ద, జంపన్న వాగు, ఆర్టీసీ బస్టాండ్ వద్ద 3 క్యాంపులను అందుబాటులోకి తెచ్చారు.
దారి పొడవునా డాక్టర్లే....
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి సిబ్బందిని భారీగా పెంచారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి మొత్తం 3,199 మంది సిబ్బందిని డ్యూటీలో వేశారు. ఇందులో 544 మంది డాక్టర్లు ఉండగా.. వారిలో 72 మంది స్పెషలిస్టులు, 42 మంది లేడీ డాక్టర్లు ఉన్నారు. వీరికి తోడుగా 2,150 మంది పారామెడికల్ సిబ్బంది (నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు) షిఫ్టుల వారీగా 24 గంటల పాటు సేవలందిస్తారు. భక్తులు మేడారం బయలుదేరిన దగ్గరి నుంచి.. తిరిగి ఇంటికి చేరేంత వరకు వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎనిమిది ప్రధాన రూట్లలో మొత్తం 42 ఎన్-రూట్ మెడికల్ క్యాంపులు పెట్టారు.
ఎమర్జెన్సీ కోసం 35 అంబులెన్సులు
ఎమర్జెన్సీలో ప్రాణాలు కాపాడేందుకు 35 అంబులెన్సులను సిద్ధం చేశారు. పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంటే వెంటనే ములుగు గవర్నమెంట్ హాస్పిటల్, వరంగల్ ఎంజీఎంకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఈ రెండు హాస్పిటల్లో నెల రోజుల పాటు డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర ఆదేశించారు.
జాతరలో చిన్నపిల్లల మందుల నుంచి పాముకాటు విరుగుడు ఇంజెక్షన్ల వరకు మొత్తం 248 రకాల మందులు, సర్జికల్ సామగ్రిని రెడీగా పెట్టుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే జనవరి 25 నుంచి అన్ని క్యాంపులు ఫుల్ స్కేల్ లో పనిచేస్తాయని అధికారులు తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు మేడారం వెళ్లాలని హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ ను మంత్రి దామోదర ఆదేశించారు.
