
- నియమించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- మూడేండ్లు పదవిలో కొనసాగనున్న కుముదిని
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ఆఫీసర్ రాణి కుముదిని నియమితులయ్యారు. ఆమెను ఎస్ఈసీగా నియమిస్తూ మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేండ్ల పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు నెలల్లోగా బీసీ కుల గణన చేసి.. ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. 1988 బ్యాచ్‌కు చెందిన రాణి కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు.
కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు చేపట్టారు. 2023 ఎన్నికలకు ముందు పదవీ విరమణ చేశారు. సీఎస్ కావాల్సిన రాణి కుముదినికి ఆ అవకాశం ఇవ్వకపోవడంతో అప్పటి ప్రభుత్వం స్పెషల్ సీఎస్ హోదాలో మళ్లీ రీ ఆపాయింట్ చేసింది.
ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న పార్థసారథి పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. 2020 సెప్టెంబర్ 9న ఆయన ఎస్ఈసీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మూడేండ్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని ఆ సమయంలో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా 2023 సెప్టెంబర్ 8తో పదవీ కాలం పూర్తయింది. అయితే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పార్థసారథి పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించింది. పొడిగించిన పదవీకాలం ఈ నెల 7వ తేదీతో ముగిసింది.
విజిలెన్స్ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఎమ్.జీ. గోపాల్
తెలంగాణ విజిలెన్స్ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎమ్.జీ. గోపాల్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం గవర్నర్ ఆమోదంతో తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. గోపాల్ ఈ పదవిలో 3 సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. ఆయన1983వ ఐఏఎస్ బ్యాచ్ తెలంగాణ విభాగానికి చెందిన అధికారి. రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేశారు. 2017 ఫిబ్రవరిలో రిటైరైన ఆయన సేవలను తెలంగాణ ప్రభుత్వం మరోసారి వినియోగించుకోనుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ కమిషనర్ గా నియమించింది.