వైద్య విద్య కొత్త కోర్సులకు సర్కార్​ అనుమతి

వైద్య విద్య కొత్త కోర్సులకు సర్కార్​ అనుమతి

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో తొలిసారిగా వైద్య విద్య అనుబంధ కోర్సులకు రాష్ట్ర సర్కార్​ అనుమతించింది. దీంతో మొత్తం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 12 రకాల అనుబంధ కోర్సులు, 860 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులిచ్చింది. అనస్తీషియా, ఆపరేషన్ థియేటర్, రెస్పిరేటరీ థెరపీ, రీనల్ డయాలసిస్, న్యూరోసైన్స్, క్రిటికల్ కేర్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డ్స్ సైన్సెస్, ఆప్తోమెట్రిక్, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కోర్సులు ఇందులో ఉన్నాయి.

గాంధీ, కాకతీయ, రిమ్స్, ఉస్మానియా, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులు ఈ విద్యా సంవత్సరం (2022–-23) నుంచే ప్రారంభం కానున్నాయి. మూడేండ్ల కోర్సు, ఒక సంవత్సరం ఇంటర్న్ షిప్ తో కలుపి నాలుగేండ్ల కాల వ్యవధి ఉండనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏటా 860 మంది స్టూడెంట్లు లబ్ధి పొందనున్నారు.