- అన్ని హాస్పిటళ్లలో సీసీ కెమెరాలు
- స్పెషల్ పార్టీ పోలీసులతో రక్షణ కల్పించే అంశం పరిశీలన
- బీఆర్ఎస్ హయాంలో పోస్టుల భర్తీకి జీవో
- అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిన గత పాలకులు
- మంత్రి దామోదరను కలిసిన జూడాలు
- సమస్యలపై వినతిపత్రం అందజేత
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్లు, మెడికల్ కాలేజీల్లో డాక్టర్లకు రక్షణ కల్పించే అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. డాక్టర్లతో చర్చించి ఓ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం సెక్రటేరియెట్‌లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను జూనియర్ డాక్టర్ల బృందం కలిసి వినతి పత్రం అందజేసింది. డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ స్టాఫ్‌కు రక్షణ కల్పించడంలో కాంప్రమైజ్ అయ్యేది లేదని, అవసరమైన అన్ని చర్యలు చేపడుతామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. అన్ని టీచింగ్ హాస్పిటళ్లలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) పోలీసులతో రక్షణ చర్యలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లలో ఎస్‌పీఎఫ్ తో బందోబస్తు ఏర్పాటు కోసం 2019లో అప్పటి బీఆర్‌ఎస్ సర్కార్ జీవో విడుదల చేసింది. ఇందుకోసం ఒక ఇన్‌స్పెక్టర్, మూడు ఎస్ఐ, ఎనిమిది ఏఎస్ఐ, 20 హెడ్ కానిస్టేబుల్, 132 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను మంజూరు చేస్తూ జీవో 103ని విడుదల చేసింది. కానీ, అమలును మాత్రం పట్టించుకోలేదు. 2019 నాటికి రాష్ట్రంలో 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య 30కి పెరిగింది. ఈ నేపథ్యంలో పోస్టుల సంఖ్యను పెంచి, అన్ని టీచింగ్ హాస్పిటల్స్‌లో ఎస్‌పీఎఫ్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తున్నది. చట్టం తెచ్చినట్టే తెచ్చి ఆపేసిన కేంద్రండాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది రక్షణ కోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని తీసుకురావాలని గతంలో కేంద్ర సర్కార్ భావించింది.
ఈ మేరకు ‘‘ప్రివెన్షన్ ఆఫ్ వయొలెన్స్ అగైనెస్ట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్’’ పేరిట 2019లో ఓ డ్రాఫ్ట్ బిల్‌ను సిద్ధం చేసింది. దీనిపై న్యాయ నిపుణులు, మేధావులతో కమిటీలు వేసింది. దీన్నే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ డాక్టర్స్ అని కూడా పిలిచింది. అయితే, ఇలా ఓ ప్రత్యేక చట్టం తీసుకురావడం సరికాదని 2022లో ఉపసంహరించుకున్నది. ఇదే విషయాన్ని గతేడాది రాజ్యసభలో అప్పటి కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ వెల్లడించారు. అయితే, 2020, సెప్టెంబర్‌లో తీసుకొచ్చిన ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్‌లో డాక్టర్లు, వైద్య సిబ్బంది, దవాఖాన్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా సెక్షన్లు పొందుపర్చామని ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఇదే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలని దేశవ్యాప్తంగా డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. దీని విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జూనియర్ డాక్టర్లు మంత్రి దామోదరకు విజ్ఞప్తి చేశారు. లేదంటే.. రాష్ట్రంలో ఓ చట్టాన్ని చేయాలని కోరుతున్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి డాక్టర్లకు హామీ ఇచ్చారు.
అడుగడుగునా సీసీ కెమెరాలు
ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పెట్టినట్టుగా, అన్ని ప్రభుత్వ దవాఖాన్లు, కాలేజీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ కెమెరాల ద్వారా ఆయా కాలేజీలు, హాస్పిటళ్లలో ఏం జరుగుతున్నదో తెలుసుకునేలా ప్రతి హాస్పిటల్‌లో మానిటరింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. అప్పుడు హాస్పిటళ్లలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవచ్చని ప్రభుత్వానికి డాక్టర్లు సూచించారు. ఇదే సీసీ టీవీల ఫీడ్‌ను పోలీసు కంట్రోల్ రూమ్‌కు కూడా కనెక్ట్ చేయాలని కోరారు. దీనికి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. అలాగే, సెక్యూరిటీ పనితీరుపై ఆడిట్ కోసం ప్రత్యేకంగా ఓ కమిటీ వేస్తామని డాక్టర్లకు మంత్రి దామోదర హామీ ఇచ్చారు. ఈ కమిటీలో జూనియర్ డాక్టర్లకు కూడా చోటు కల్పిస్తామని తెలిపారు. హాస్పిటల్ ఎంట్రెన్స్‌ల వద్ద బ్రీత్ ఎనలైజర్‌తో టెస్టులు చేసి, ఆ తర్వాతే పేషెంట్ అటెండర్లను లోపలికి పంపించాలని డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రెస్ట్ రూమ్స్ మస్ట్
డ్యూటీలో ఉండే డాక్టర్ల కోసం రెస్ట్ రూమ్‌లు, వాష్ రూమ్‌లను అన్ని హాస్పిటళ్లలో ఏర్పాటు చేయాలని డాక్టర్లు ఈ సందర్భంగా కోరుతున్నారు. ఇలాంటి రూమ్‌లు లేకపోవడం కోల్‌కతా ఘటనకు ఓ కారణమని డాక్టర్లు భావిస్తున్నారు. రెస్ట్ రూమ్ ఉండి ఉంటే జూనియర్ డాక్టర్ సెమినార్ హాల్‌కు వెళ్లేది కాదని వారు చెప్తున్నారు. మెడికల్ కాలేజీ అనుబంధ హాస్పిటళ్లలో ప్రొఫెసర్ల కంటే ఎక్కువగా పీజీ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు, హౌజ్ సర్జన్లే డ్యూటీలు చేస్తుంటారు. వారికి ఒక్కోసారి కంటిన్యూగా 36 గంటల డ్యూటీలు కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్లకు రెస్ట్ రూమ్‌లు కంపల్సరీ అని మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు కూడా చెప్తున్నరు. ఇదే విషయాన్ని తాము ప్రభుత్వానికి సూచించామని, ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగా ఉందని ఓ అధికారి తెలిపారు.
15 రోజులకో నివేదిక..
అన్ని ప్రభుత్వ దవాఖాన్ల పనితీరు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, పేషెంట్ల సంఖ్య, రికవరీ విధానం, సిబ్బంది హాజరు తదితర అంశాలపై తనకు 15 రోజులకోసారి నివేదిక సమర్పించాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా సూచించారు. సోమవారం ఆయన సెక్రటేరియెట్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘అన్ని హాస్పిటల్స్‌లో మౌలిక సదుపాయాల కల్పన తో పాటు సెక్యూరిటీ, శానిటేషన్, డైట్, లాండ్రీ సేవలు మరింత పటిష్టం కావాలన్నారు. భవనాల స్థితిగతులు, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించడానికి టాస్క్ ఫోర్స్ కమిటీ నిరంతరం హాస్పిటళ్లను సందర్శించాలని సూచించారు.
